మందుభాగ్యులు
గొల్లపూడి మారుతీరావు

      gmrsivani@gmail.com

     దాదాపు ముప్ఫై సంవత్సరాల కిందటిమాట. అప్పట్లో ఇప్పటి పద్మవిభూషణ్‌ ప్రతాప్‌ సి.రెడ్డి నాకు వైద్యులు. సెయింట్‌ మేరీ వీధిలో హెచ్‌.ఎం. ఆసుపత్రిని నిర్వహించేవారు. నాకు ఆ రోజుల్లో గుండె నొప్పి వస్తుందేమోనన్న భయం ఎక్కువగా ఉండేది. ప్రతి చిన్న అసౌకర్యం నాలో ఆ భయాన్ని రెచ్చగొట్టేది. ఆయన దగ్గరికి వెళ్లాను. అన్ని రకాల పరీక్షలూ చేసి, నన్నెలా ఒప్పించాలో తెలీక 'మీకు గుండె నొప్పి ఎట్టి పరిస్థితిలోనూ రాదని రూపాయిన్నర స్టాంపు పేపరుమీద రాసి ఇవ్వగలను' అన్నారు. అప్పుడే మందు అలవాటు గురించి మాట్లాడుతూ ఆయన చెప్పిన మాటలు గుర్తున్నాయి. 'మొదటి పెగ్గు ఔషధం. రెండోది అలవాటు. మూడోది అనర్థం' అని. మధ్యలో చాలాసార్లు కలిసినా ఈ మధ్య ప్రత్యేకమైన పనిమీద ఆయన దగ్గరికి వెళ్లినపుడు ఆనాటి మాటని గుర్తు చేశాను. ఆయన మనస్ఫూర్తిగా నవ్వి 'మీకింకా గుర్తుందే!' అన్నారు.
'లేదు. గుర్తుంచుకున్నాను. చాలామందికి గుర్తు చేస్తూంటాను' అన్నాను.
ఈ దేశంలో సెక్స్‌, పదవి, డబ్బు -అదే వరసలో భయంకరమైన లౌల్యాలు. వాటన్నిటినీ మించినది -మందు. కాళ్లకూరి నారాయణరావు సరిగ్గా పట్టుకోలేనిది శరత్‌బాబు పట్టుకోగలిగారని నాకనిపిస్తుంది. చింతామణి మీద వ్యామోహాన్ని తట్టుకోలేక భవానీశంకరుడు అర్ధరాత్రి వర్షంలో పాముని పట్టుకుని చింతామణి ఇంటిగోడని ఎగబాకాడు. కానీ ఆయన చేతికి మందు సీసా ఇచ్చివుంటే దేవదాసులాగ ఓ మూల పడివుండేవాడు. మిగతా వ్యసనాలన్నీ మనస్సుని మత్తెక్కించి నరాలు రిలాక్స్‌ అవడానికి సహకరిస్తాయి. అంటే అవన్నీ ఆనందానికో, మత్తుకో పరోక్షమైన ఆలంబన. కానీ మందుకి ఆ గొడవ లేదు. సరాసరి నరాల మీదే పనిచేస్తుంది. తన పని ముగించుకుంటుంది. మీకు ఆనందం కావాలన్నా, అలసట నుంచి విముక్తి కావాలన్నా, ఆటవిడుపు కావాలన్నా, విషాదం నుంచి తప్పుకోవాలన్నా దేనికైనా సరాసరి రక్తాన్ని వేగవంతం చేసి, వేడెక్కించే ఆల్కెమీ మందు.
కనకనే కాయకష్టం చేసే కూలీ దగ్గర్నుంచి, ఏడు నక్షత్రాల హోటల్‌ గదిలో విశ్రమించే కోటీశ్వరుడిదాకా, మందు స్థాయిలో మార్పే, కానీ పర్యవసానం ఒకటే. అందుకే మందు ప్రభుత్వాలకి బలమైన, బరువైన ఆదాయం. ఆ కారణానికే బలమైన అవినీతికి ఆలంబన.
కొన్ని దశాబ్దాలుగా ఈ మందుని నమ్ముకుని లక్షలు, కోట్లు గడించిన మహానుభావులు నాకు తెలుసు. అలవోకగా కోట్లు కుమ్మరించి సినిమాలు తీసినవారిని గురించి నాకు తెలుసు. మందు కారణంగానే అతి సుతారంగా, అతి ఉదారంగా పీకలు కోసిన సంఘటనలు మనం విన్నాం. 'మందు' సభ్య సమాజంలో సరస్వతీ నదిలాంటిది. ఉందని అందరికీ తెలుసు, కళ్లకి కనిపించదు. ఈ మందు పెట్టుబడిగా దశాబ్దాలుగా కానిస్టేబుళ్లూ, ఎక్సైజ్‌ ఇన్‌స్పెక్టర్లూ, మధ్యవర్తులూ, అమ్మకందారులూ, టోకు వ్యాపారులూ, రవాణాదారులూ నిరంతరం లక్షలు గడిస్తున్నారని అందరికీ తెలుసు. ప్రభుత్వానికీ, అవినీతి నిరోధకులకీ తెలియదంటే పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగినట్టే.
మందు కథ చెప్పుకుంటున్నాం కనుక ఈ మాట మందుతో సరిపెట్టుకుంటున్నాం కానీ నిజానికి 'అవినీతి' అన్నిటా సరస్వతీ నదిలాగ ప్రవహిస్తోందని తెలియనివారు లేరు. ఎందుకనో, ఎవరి కారణంగానో, పాపం బద్ధలయి ఈ మందు మాఫియా మీద వేట మొదలయింది. న్యాయంగా ఎప్పుడో కావలసింది. స్థాళీపులాక న్యాయంగా -లాంఛనంగా కొందరు కానిస్టేబుళ్లూ, కొందరు సిబ్బంది, కొందరు మాఫియా ఘనులూ అరెస్టయారు. ఇంకా బోలెడంత 'కంపు' వుంది. కొన్ని వర్గాలు బయటపడకపోవడానికి మళ్లీ కొన్ని లక్షలో, కోట్లో చేతులు మారి ఉంటాయి. ఈమాటే తెలుగుదేశం నిలదీస్తోంది. పదవిలో ఉంది కనుక కాంగ్రెస్‌కి ఇది గొంతులో పచ్చి వెలగకాయ అయింది కానీ ఈ భాగోతం తెలుగుదేశం రోజుల్లోనూ సాగిందే!
అయితే ఈ చర్యకు కారణమైన మహానుభావులకి చేతులెత్తి నమస్కారం పెట్టకతప్పదు. అవినీతిమయమై పోయిన ఈ వ్యవస్థలో ఒకానొక రంగంలో వీధినపడిన కేవలం నమూనా 'అవినీతి' కథలివి.
ఇందులో మంత్రిగారికి స్వయానా ముడుపులు చెల్లించినట్టు అరెస్టయిన ఒకాయన రుజువులతో సహా విన్నవించారు. అవినీతి గుండె ఎంత బలమయినదో, ఎంత గుండెలు తీసిన వ్యవహారమో మనకిప్పుడిప్పుడే అర్థమౌతోంది. ఆయన అరెస్టు కాకముందు ఈ విషయం బట్టబయలు చేస్తే వారి నిజాయితీ తెలిసేది. 'ముత్యాలముగ్గు'లో రావుగోపాలరావు అన్నట్టు 'ఆ మాట ముందు చెప్పాల'. తీరా మంత్రిగారు ఆ ముడుపుపుచ్చుకున్నారో లేదో మనకు తెలియదు. హిరణ్య కశిపుడు 'నిన్నరాత్రి కలలో విష్ణుమూర్తి కనిపించి నన్ను క్షమించమని వేడుకున్నాడు' అని చెప్తే మనం ఎంత విలువనివ్వగలం? నేరస్తుడి నీతికీ, నిజాయితీకీ అంతే విలువ.
అయితే నేరస్తుల్ని వీధిన పెట్టిన వ్యవస్థ -మహానుభావుల ధైర్యానికి నివాళులర్పిస్తూ మంత్రిగారు నిజంగా 10 లక్షలు పుచ్చుకుంటే ఇద్దరు సాక్షుల సమక్షంలో ఆ పదిలక్షలూ ఆ పెద్దమనిషికి వాపసు ఇప్పించి, మంత్రికి లంచం ఇచ్చినందుకు మరో కేసుని ఆ నేరస్తుడి మీద నిందారోపణ చెయ్యాలని నాకనిపిస్తుంది. దీనినే కోర్టులో 'అప్రూవర్‌' అంటారు. ఈ రోజుల్లో అంటే అవినీతి మయమైన కాలంలో ఏ ప్రక్షాళన జరగాలన్నా అవినీతి నుంచి అవినీతివరకే జరగాలి. తప్పదు. అది సర్వాంతర్యామి కనుక.
శివుడిని పూజించే భక్తుడు 'స్వామీ! నిన్నెలా పూజించాలన్నా ప్రపంచమంతా ఎంగిలిగా కనిపిస్తోంది' అని వాపోయాడట. 'అవినీతి' మయంగా వున్న ఈ వ్యవస్థలో దశాబ్దాలుగా తినమరిగిన నేరస్తుల్ని బయటపెట్టే ప్రక్రియలో లాంఛనపు అవినీతి ఒకవేళ నిజమైనా సరిపెట్టుకోవలసిన అగత్యం ఉన్నదని వార్తాపత్రికలు మాత్రమే చదివి స్పందించగల నాలాంటి 'అవినీతి' లోతులు తెలియని, అర్థం కాని, అవగాహన లేని అజ్ఞానికి అనిపిస్తుంది.

 

                                               
ఫిబ్రవరి 27, 2012    

   ************               ************           *************          *************
Also meet Maruthi Rao Garu in his telugu blog gollapudimaruthirao.blogspot.com
Read all the columns from Gollapudi  గొల్లపూడి గారి మిగతా కాలంస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి


KOUMUDI HomePage