పిదప బుద్ధుల 'పెద్దక్క'
గొల్లపూడి మారుతీరావు

      gmrsivani@gmail.com

 'క్షణ క్షణముల్‌ జవరాండ్ర చిత్తముల్‌' అన్నారు. జవరాండ్ర మాటేమోగానీ తృణమూల్‌ కాంగ్రెస్‌ పెద్దక్క మమతా బెనర్జీ విషయంలో ఆ మాట నిజం. మొన్నటిదాకా వారి పార్టీలో సీనియర్‌ సహచరుడు, ప్రభుత్వంలో తృణమూల్‌ ప్రతినిధి రైల్వేమంత్రి దినేష్‌ త్రివేదీ. కానీ నిన్ననే ఆయన 'ద్రోహి' అయిపోయాడు. ఆయన చేసిన ద్రోహం అల్లా పెద్దక్కని సంప్రదించకుండా బడ్జెట్‌ని తయారు చేయడం, కాంగ్రెస్‌తో కుమ్మక్కయి సామాన్య ప్రజల మీద అదనపు ఖర్చుల భారాన్ని వేయడం. అది తప్పే కావచ్చు. చెయ్యకూడని పని కావచ్చు. కానీ ఒక్క రోజులోనే 'ద్రోహి' అయిపోతాడా? సరే. మొన్న మార్చిలో ఆయన ఇంతకన్నా పెద్ద ద్రోహమే చేశాడే! రైల్వే రవాణా ఖర్చులను పెంచాడు. అది పరోక్షంగా సామాన్య ప్రజల నడుం విరగగొట్టడం. అయితే ఆ 'విరుగుడు' ప్రజలకి సూటిగా 'తెలియదు'. కనుక ఆ ద్రోహాన్ని పెద్దక్క మౌనంగా సరిపెట్టుకున్నారు. 'ద్రోహా'లు రెండు రకాలు. సూటిగా ప్రజలకి అర్థమయి -ఓట్లను భంగపరిచే ద్రోహాలు.
పోలీసోడి దెబ్బల్లాగ తగిలినా తమదాకా రాని ద్రోహాలు. ఇది దినేష్‌ త్రివేదీకి అర్థం కాలేదా? లేదా మొన్నటి రవాణా వ్యవహారం లాగే పెద్దక్క దీన్నీ సరిపెట్టుకుంటారని భావించారా? రైల్వే బడ్జెట్‌ రాగానే రెండు నిర్ణయాలు చేశారు పెద్దక్క. దినేష్‌ త్రివేదీని ద్రోహిని చేశారు. ముకుల్‌ రాయ్‌ని రైల్వే మంత్రిని చేయాలన్నారు. తమ వంటగదిలో కూరల మార్పిడిలాగ. ఈ రెండూ జరగాలని ప్రధానిని డిమాండ్‌ చేశారు. పాపం, మన్మోహన్‌ సింగ్‌ గొంతుపోయి చాలా రోజులయింది. ఆయన ఏం చెప్పాలనుకున్నా ప్రణబ్‌ ముఖర్జీ గొంతుని ఎరువు తెచ్చుకుంటారు. అప్పుడప్పుడు ధనంజయ పూజారీ, రేణుకా చౌదరీ వంటి చిల్లర గొంతులను వాడుకుంటూంటారు. ప్రస్తుతం కేంద్రంలో బొత్తిగా నోరులేని వాళ్లు ఇద్దరున్నారు, సోనియాగాంధీ, మన్మోహన్‌ సింగ్‌. ఇందులో మరో విచిత్రం ఉంది. ఎనిమిదేళ్లుగా రైలు టిక్కెట్ల చార్జీలు పెరగనందుకు దేశంలో చాలామంది ఆనందించారు. ఇది ఆఫీసర్లకి టూరుల్లో జరిగే రాచమర్యాదల్లాంటివి. మంత్రిని ఫలానా ఉద్యోగి సత్కరిస్తున్నాడంటే పక్కన ఎవడి జేబుకో కన్నం వేస్తున్నాడనే అర్థం. మరి ఇంత విస్తృతమైన రైల్వే ఖర్చు ఎలా సాగుతోంది? ఎవడిక్కావాలి? పోనీ, ఇప్పుడు చార్జీలు పెరిగినందుకు ఎవరూ గగ్గోలు పెట్టినట్టు కనిపించలేదు. ప్రజల కంటే పెద్దక్క కోపం అసలు విషయాన్ని మరిపించినట్టుంది. దొంగపోటు కంటే లింగపోటు ఎక్కువయిపోయిందన్నాడట వెనకటికి ఒక భక్తుడు. ప్రస్తుతం దినేష్‌ త్రివేదీ, పెద్దక్కల వీరంగమే రంగస్థలం మీద సాగుతోంది. నాకు భగత్‌సింగ్‌ త్యాగం లక్ష్యం అంటున్నారు త్రివేదీ. ఆయన్ని తీసెయ్యడమే నాకు కావాలి అంటున్నారు పెద్దక్క.
ఎనిమిదేళ్లుగా మంత్రులు ఎందుకు చార్జీలు పెంచలేదు? అవి మామూలు ప్రజలకి తట్టే విషయాలు కావు. వెనకటికి గిరీశం బండివాడితో గంటసేపు రాజకీయాల గురించి మాట్లాడితే 'మావూరి కానిస్టేబుల్‌ని ఎప్పుడు బదిలీ చేస్తారండీ' అని అడిగాడట బండివాడు. కొన్ని పార్టీలకి కొన్ని ఊతపదాలున్నాయి. బడుగు వర్గాలు, సామాన్య ప్రజలు, తిండికీ బట్టకీ నోచుకోని పేద ప్రజానీకం యిలాగ. ఇవన్నీ కాదనలేని నిజాలు. కానీ ఇవి కొన్ని పార్టీలకి పెట్టుబడులుగా ఉపయోగపడే ఇజాలు. నిజంగా ఈ బడుగువర్గాల గురించే పాటుబడితే లక్షల ఆదాయం ఉన్న మాయావతి వ్యక్తిగతమైన ఖజానాలో వందల కోట్లు ఎలా చేరతాయి? లక్నోలో ఒక్కొక్క ఏనుగు ఎంతమంది తిండిలేని ప్రజలకి ఆహారాన్ని ఇవ్వగలదు? లెక్కల్లోకి వెళ్తే చాలామందికి అర్థం కాదు కానీ, ముక్తసరిగా చెప్పుకుందాం. మనదేశంలో రైలు ఒక కిలోమీటరు నడిస్తే పాసింజరు తలా ఒక్కడికీ సగటున 412.22 రూపాయల ఆదాయం రైల్వేకి దక్కుతుంది. కానీ రైలు ఒక కిలోమీటరు నడవడానికి ఇంధనం, ఖర్చులు, జీతాలు, బొగ్గు, పెట్టుబడులు -అన్నీ కలిస్తే 550.97 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇలా రోజుకి 250 లక్షల మంది 64 వేల కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్నారు. ఇది కేవలం 2008 మాట. 2012కి ధరలూ, ఖర్చులూ అన్నీ పెరిగాయి. మొన్నటిదాకా సరకుల రవాణా మీదా, నేటిదాకా -గత ఎనిమిదేళ్లలో పాసింజర్ల చార్జీల ద్వారా ఆదాయం పెరగలేదు. ఇక్కడితో అంకెల్ని వదిలేస్తే గత ఎనిమిదేళ్లుగా ఆయా మంత్రులు ఆయా బడ్జెట్లతో ప్రజల్ని ఆనందపరిచి తమ భుజాలు చరుచుకుని పార్టీలకి ఓట్లని దండుకునే పనిలో దేశం సొమ్మును ఖర్చు చేస్తున్నారు.
ఈ ఘనత మన లాలూతో ప్రారంభమయి, పెద్దక్కదాకా కొనసాగింది. ప్రస్తుతం దినేష్‌ త్రివేదీ లాంఛనంగా పెంచారు కానీ అలా వచ్చే ఏడు వేల కోట్ల ఆదాయం కొండల్ని మింగేవాడికి వేరుశనగ గింజ తినిపించినట్టు. తాను రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు రైల్వే శాఖ పాలిచ్చే జెర్సీ ఆవు. ఇప్పుడు వట్టిపోయిందన్నారు లాలూ. సరే, బడ్జెట్‌ని ప్రతిపాదించగానే తన పార్టీ మంత్రినే పదవిలోనుంచి తొలగించాలంటూ పాలక యంత్రాంగంలోనే భాగమయిన ఒక పార్టీ నాయకురాలు పెద్దక్క వీధిన పడడం చరిత్రలో ఇది మొదటిసారి. కేంద్రం ఏమైనా తన ఓట్లని పెంచుకోవాలనుకున్న రాజకీయమైన యావకి -సమష్టి బాధ్యత అనే నీతిని పక్కన పెట్టడానికి ఇది నాంది. ఇంతకీ దినేష్‌ త్రివేదీ ఉండేనా? ఊడేనా? ఛార్జీలు పెరిగేనా? వెనక్కి తిరిగేనా? భగత్‌సింగ్‌ వంటి త్యాగశీలత కలిగిన మంత్రి పార్లమెంటులో మిగిలేనా? కలకత్తా రైలెక్కేనా? సామాన్య మానవుడి నడ్డి విరిగేనా? ప్రస్తుతానికి మిగిలేనా? ప్రజల కళ్లు తుడిచి కుళ్లిన మేడిపండుకి ఏటేటా కొత్తరంగులు పులిమే జెర్సీ ఆవు పాలకుల ఆటలు ఇంకా సాగేనా? ఆగేనా? ఇవన్నీ భేతాళుడి ప్రశ్నలు. తెలిసి చెప్పకపోతే తల వెయ్యి చెక్కలవుతుంది. తెలియక చెప్పకపోతే పార్టీల 'బడుగు' వర్గాల లిస్టులో మనమూ ఉంటాం క్షేమంగా.
 

                                        మార్చి 19. 2012
  

   ************               ************           *************          *************
Also meet Maruthi Rao Garu in his telugu blog gollapudimaruthirao.blogspot.com
Read all the columns from Gollapudi  గొల్లపూడి గారి మిగతా కాలంస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి


KOUMUDI HomePage