Click Play to listen audio of this column
If you have issues with Voice clarity, upgrade your Flash Player Version. Click Here
 
దేశ సేవ

గొల్లపూడి మారుతీరావు
      gmrsivani@gmail.com 


ఈ దేశంలో ఎందరో రాజకీయనాయకులు లక్షలు, కోట్లు ఖర్చుచేసి, రాత్రింబవళ్ళు శ్రమించి, అవసరమయితే హత్యలు చేసి, చేయించి ఎందుకు నాయకులవుతున్నారో ఎప్పుడయినా ఆలోచించారా? వాళ్ళని అడగండి. కళ్ళు ఎర్రబడేలాగ ఆవేశపడి 'దేశ సేవ ' కోసమని చెపుతారు. వీళ్ళని దేశసేవ చేయమని ఎవడేడ్చాడు? వీళ్ళు 'చెయ్యని' రోజు ఏనాడయినా వస్తుందా అని ఆశగా ఎదురు చూసే ఎందరో నాయకుల పేర్లు, మొహాలు మనకు తెలుసు.
ఆ రోజుల్లో తిలక్, లాల్ బహదూర్ శాస్త్రి, మహాత్మాగాంధీ, నెహ్రూ - వీళ్ళంతా ఏం పెట్టుబడులు పెట్టి నాయకులయారు? నెహ్రూగారు ఏనాడయినా "నన్ను ఎన్నుకుంటే మీకో టార్చిలైటు ఇస్తాను. లేదా నాలుగు పెన్సిళ్ళు ఇస్తాను" అన్న పాపాన పోయారా? పోనీ, అనలేదని ఓట్ళు వేసేవాళ్ళు ఆలోచించారా? మా అమ్మా నాన్నా గాంధీగారిని రెండు ఫర్లాంగుల దూరం నుంచి మాత్రమే చూసిన అతి నేలబారు వోటర్లు. చచ్చిపోయే వరకూ మా అమ్మ కాంగ్రెసుకే ఓటు వేసేది.
విజయనగరంలో పుట్టి పెరిగింది కనుక "మా రాజావారు" అంటూ ఏ రాజుగారు నిలబడినా ఓటు వేసేది. ఆయన పార్టీలో, అభిప్రాయాలో ఆవిడకి తెలీవు. అవినీతి విశ్వరూపం దాల్చక, ఇంకా విశ్వాసానికి కాలదోషం పట్టని రోజులవి.
గుండె బాదుకుంటూ ఉపన్యాసాలిచ్చే నాయకులు ఎంత దుగుల్భాజీలో ఓటరుకి తెలుసు. ఏ విధంగానూ వాళ్ళ నుంచి తనకు విముక్తి లేదనీ తెలుసు. నిలబడిన నలుగురిలో - ఎవరి వల్ల 'తక్కువ ' అన్యాయం జరుగుతుందో ఆలోచించి, ఎవరివల్ల ఎక్కువ 'లాభం ' కిట్టుబాటవుతుందో బెళ్ళించుకుని ఓటు వేస్తున్నాడు - మరో గత్యంతరం లేక. ఏతావాతా నాయకుడికి పదవి పెట్టుబడి. ఓటరుకి ఓటు రాబడి. మధ్యలో దరిద్రంలో పడి నాశనమయిపోయేది ఏమిటి? దేశం. అది ఎవడిక్కావాలి?
ఈ ఒప్పందానికి అతి లాయకీగా పురోగతిని సాధించిన రాష్ర్టం - తమిళనాడు. కరుణానిధిగారి మొహాన్ని చూస్తూ - ఆయన దేశాన్ని ఉద్దరిస్తారని ఎవరూ నమ్మరు. పెళ్ళాల పేరిట ఛానళ్ళూ, కొడుకులూ, రెండో పెళ్ళాం కూతుళ్ళూ, మేనల్లుళ్ళు, వారి దగ్గరి సంబంధాలవారూ - అందరికీ మంత్రి పదవులూ - అన్నిటినీ ఏర్పాటు చేసుకున్న కరుణానిధిగారు - ఓటరుతో లాలూచీ ద్వారానే పదవులు సాధ్యమని నమ్మే వేత్త. "అయ్యా, తమరు బాగా మేస్తున్నారని మాకు తెలుసు. మా చేత ఏం తినిపిస్తారు?" అని ఓటరు అడుగుతాడని తెలుసు. ఇందులో తికమకలేదు. అందుకే క్రితం ఎన్నికల్లో ఉచితంగా కలర్ టీవీలూ, చదువుకునే కుర్రాళ్ళకు సైకిళ్ళూ, పేదలకు సరసమైన ధరలకి మేలు రకం బియ్యం - అన్నీ ఇచ్చారు. ఆ బియ్యాన్ని దళారీల ద్వారా లారీల పళంగానే పక్క రాష్ర్టాలకి తరలిపోతుండగా కొందరు పట్టుకోవడం మనం విన్నాం. వీరిక్కడ లక్షా డెబ్బై ఆరువేల కోట్ల ధనాన్ని కొల్లగొట్టిన కథలు చదువుకున్నాం.
గుడిసెల్లో మగ్గే పేదవాడు - మేలు రకం బియ్యం వండుకు తినడు. దాన్ని అమ్ముకుని - నాసిరకం సారాని కొనుక్కుని తాగుతాడు. అది అతని ఆనందం.
తన మీద కోట్ల ఆదాయం కేసులు పొరుగు రాష్ర్టం కోర్టుల్లో మురుగుతున్న మరో తమిళ నాయకురాలు జయలలితగారు - ఆనాడే వారు శక్తి మేరకు ఓటరుని మేపే ఎన్నో పధకాలను ప్రకటించారు.
ప్రస్తుతం - ఈ నాయకుల పదవులకి పెట్టుబడులు - మరీ ఆనందకరంగా, నోరూరించేవిగా ఉన్నాయి.
కరుణానిధిగారు ఈ సారి ఓటరుకి ఉచితంగా గ్రైండరూ లేదా మిక్సీ, ఒక ఫాన్ ఇస్తారు. ప్రభుత్వ కళాశాలల విద్యార్ధులకు లాప్ టాప్లు ఇస్తారు. స్వయం సహాయక సంఘాలకు నాలుగేసి లక్షలు ఇస్తారు. గర్భిణీ స్త్రీలకు పదివేల రూపాయలు ఇస్తారు. పెళ్ళికాని ఆడపిల్లలకు 25 వేల రూపాయలు, పెళ్ళి చేసుకునేటప్పుడు నాలుగు గ్రాముల మంగళ సూత్రం ఇస్తారు. డిగ్రీలు చదివే అమ్మాయిల పెళ్ళిళ్ళకి 50 వేలు ఇస్తారు. బడుగు వర్గాలవారికి 300 చదరపు అడుగుల విస్తీర్ణంలో 1.80 లక్షల వ్యయంతో ఇళ్ళు కట్టించి ఇస్తారు. పాలకోసం ఆవుల్ని ఇస్తారు.. ఇంకా.. ఇంకా..
జయలలితగారు ఏం తక్కువ తినలేదు. ఇవన్నీ మేమూ ఇస్తాం, అంతకంటే ఎక్కువ ఇస్తాం. ప్రభుత్వ కళాశాలలేం ఖర్మ - 11, 12 తరగతుల వారందరికీ లాప్ టాప్లూ, స్వయం సహాయక సంఘాలకి పది లక్షలు, గర్భిణీ స్త్రీలకి పన్నెండువేలు, ఆవులకి బదులు నాలుగేసి మేకలు - అయ్యా, నేను మేసే గడ్డికి మీరు కళ్ళు మూసుకుంటే మీ వాటా గడ్డి మీకు దక్కుతుందని హామీ.
'దేశసేవ' చేయడానికి ఇలా ఉత్సాహపడే నాయకులుండడం ఈ దేశానికి శుభ సూచకం. ఇలాంటి ఉపకారాలు మన రాష్ర్టంలోనూ ఓటర్లకి జరగాలని, పొరుగు రాష్ర్ట నాయకుల దేశసేవ ఆంధ్ర నాయకులకు ఒరవడి కావాలని నా ఆశ.
నాయకత్వాన్ని వ్యాపారం చేసి, ఓటర్ని వెర్రిగొర్రెని చేసి ఇచ్చి పుచ్చుకోడాల్లో ఇంత బరితెగించి వీధిన పడిన ఈ దేశంలో - "దేశసేవ" అందరి నాయకుల నోళ్ళలోనూ నానే బూతుమాట.
తాయిలాలు పంచడం సమాజ శ్రేయస్సుకి దగ్గర తోవకాదని, నిస్సిగ్గుగా వ్యాపారం సాగించడానికి సంకేతమని - మన నాయకులు మరిచిపోయి చాలా రోజులయింది. మరి ఓటరు? క్రమంగా నిజాన్ని గమనిస్తున్నాడు. నాకు కేవలం కలర్ టీవీ, రెండు కిలోల బియ్యం - మీకు మాత్రం లక్షా డెబ్బై కోట్ల చీకటి ధనమూనా అని ఆలోచిస్తున్నాడు. వాటాలు పంచుకోవడంలో తేడాలు గమనిస్తున్నాడు. పెద్ద తిమింగలాలు,చిన్న చేపల్ని ఎరలుగా ఇచ్చి తమని జోకొడుతున్నాయని అర్ధం చేసుకుంటున్నాడు. అయితే చీడపట్టిన పంటలో - దక్కినంత రాబట్టుకునే గడుసుదనానికి అలవాటుపడుతున్నాడు. కాని అవకాశం దొరికినప్పుడు - ఆ మాత్రం 'పచ్చగడ్డి' దొరికినప్పుడు వాటాలలో అన్యాయం పాలవుతున్న - చిన్న వాటాదారుడు - ఓటరు - దుడ్డుకర్రతో తన నిస్పృహనీ, కోపాన్నీ సంధించి - చీడని దులుపుతాడు. ఉదాహరణలు: ఈజిప్టు, లిబ్యా .
 

 ***
మార్చి 28, 2011

       ************               ************           *************          *************
Also meet Maruthi Rao Garu in his telugu blog gollapudimaruthirao.blogspot.com
Read all the columns from Gollapudi  గొల్లపూడి గారి మిగతా కాలంస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి


KOUMUDI HomePage