Click Play to listen audio of this column
If you have issues with Voice clarity, upgrade your Flash Player Version.
Click Here
 
మూడుకథలు

గొల్లపూడి మారుతీరావు
      gmrsivani@gmail.com
 

ప్రతీ ఏడూ ఆఖరి రోజుల్లో పత్రికలకీ, టీవీ ఛానళ్ళకీ ఓ వార్షికం ఉంది. ఈ సంవత్సరంలో జరిగిన గొప్ప విషయాలూ, గొప్ప అరిష్టాలూ, గొప్ప అవినీతులూ, గొప్ప హత్యలూ, గొప్ప మోసాలూ - ఇలా మరోసారి అన్నిటినీ తలుచుకుని 'అయ్యో ' అనో 'ఆహా! ' అనుకుని కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టడం రివాజు.
నాకేమో మూడే మూడు కథలు చెప్పాలని ఉంది. కెనడాలో 24 ఏళ్ళ చక్కని క్రీడాకారిణి ఉంది. పేరు జోన్ రోసెట్. ఐస్ మీద స్కేటింగ్ చేస్తుంది. ఈ పిల్ల వాంకోవర్ (కెనడా)లో జరిగే చలికాలపు ఒలంపిక్ పోటీల్లో పాల్గొననుంది. వారం రోజుల ముందు వాళ్ళమ్మకి ఫోన్ చేసింది. "నువ్వు తప్పకుండా బహుమతి గెలుస్తావు. వేదిక ఎక్కి గర్వంగా పతకాన్ని పుచ్చుకుంటావు" అంది తల్లి. పీటీ నాలుగు రోజులుందనగా 55 ఏళ్ళ తల్లి గుండెనొప్పితో కన్ను మూసింది. రోసెట్ గుండె పగిలింది. కళ్ళ ముందు కల చెదిరింది. కాని వేలమంది అభిమానులూ, మిత్రులూ ఆమె భుజం తట్టారు. "మీ అమ్మ దీవెన నిజం చెయ్యి" అని. రోసెట్ పీటీలో పాల్గొంది. మూడో బహుమతి - కంచు పతకం గెలుచుకుంది. ఒక టీవీ ఛానల్ అన్నది - నిజానికి అది కంచు కాదు - ప్లాటినం అని.
గుండెని ఛిన్నాభిన్నం చేయగల అంతటి విషాదంలోంచి ప్రపంచ స్థాయిలో పోటీ చేసి ఏకాగ్రతతో, విశ్వాసంతో, ఆత్మస్థైర్యంతో మూడో స్థానంలో నిలబడగలగడమే ఏ దేశపు భగవద్గీత అయినా చెప్పగలిగేది. మానవ చిత్తశుద్ధి, కార్యదక్షతలో ఔన్నత్యానికి ఈ విజయం ప్రతీక. ఒక గొప్ప విషాదాన్ని ఒక గొప్ప విజయానికి సంధించగల గుండె దిటవు మానవాళి ఆదర్శాన్ని పతాక స్థాయిలో నిలుపుతుంది. అది రోసెట్ సాధించిన విజయం. జోన్ రోసెట్ సౌందర్యాన్ని మీరు కంప్యూటర్లో చూడవచ్చు. అద్భుతమైన శారీరక సౌందర్యాన్ని ధిక్కరించే పారమార్ధిక ఔన్నత్యం ఆ అమ్మాయిలో ద్యోతకమౌతుంది.
************
రెండో కథ ఆకాశం మీదనుంచి నేలమీదకి - ఇంకా చెప్పాలంటే పాతాళానికి జారిపోయే కథ. ఈ దేశంలో ఘనత వహించిన అవినీతి కథ. ఈ మధ్య ప్రభుత్వాల కంటే టీవీ ఛానళ్ళు - నిజమైన కారణాలకే - అవినీతికి జుత్తు పీక్కుంటున్నాయి. అలా పీకగా పీకగా - రుజువులతో, దాడులతో ముందుకు సాగిన రెండు అవినీతులున్నాయి. ఒకటి చిన్న చేప - సురేష్ కల్మాడీ గారిది ('చిన్న ' అనడానికి కారణం - పక్కనున్న పెద్ద గీత). ఈయనది 17 వేల కోట్ల అవినీతి. పెద్ద చేప - రాజాగారిది లక్షా డెబ్బై ఆరు వేల కోట్ల అవినీతిది. మొన్న రాత్రి అన్ని పత్రికలూ, ఛానళ్ళూ ఈ కథల్ని ఉదారంగా వక్కాణించాయి. కాని నాకు అర్ధంకాని విషయమేమిటంటే - కల్మాడీగారు చేసింది నిజంగా అవినీతి అయితే, ఆయన చుట్టూ ఉన్న ఉద్యోగులూ, సహచరులూ జైళ్ళకు వెళితే కల్మాడీగారు ఎందుకు వెళ్ళలేదా అని. అలాగే 2జీ స్కాంలో అందరూ దాదాపు వీధిన పడితే - రాజాగారు మాత్రం మద్రాసు ఆసుపత్రిలో ధైరాయిడ్ చికిత్స చేసుకుంటూ సుఖపడుతున్నారెందుకని?
మన దేశంలో ఎందరో సీజరు పెళ్ళాలున్నారు. పార్టీకో సీజరు. మద్రాసులో ఓ సీజరు, బొంబాయిలో ఓ సీజరు, ఢిల్లీలో ఓ సీజరు. వారి వారి పెళ్ళాల వీరంగం, చిరునవ్వులు చూసి మురిసిపోయే 'అలవాటు 'ని చేసుకోవడమే ఈ పాత సంవత్సరం మనకు చేసిన గొప్ప అలవాటు.
************
మూడో కథ - నాకు మరింత ఇష్టమయినది. వికీలీక్స్ ఈ మధ్య ప్రపంచమంతా ప్రాచుర్యాన్ని, సంచలనాన్నీ సృష్టించింది కాని - నేను ఆ విధమయిన బట్టబయలుని వ్యతిరేకిస్తున్నాను. నేనెప్పుడో రాసిన 'నిజం నిద్రపోయింది ' నాటిక ఇతివృత్తం ఇదే. మనసు లోతుల్ని విప్పితే - విప్పిన సందర్భాలు బట్టబయలయితే - పెళ్ళాం పిప్పి పన్ను, స్నేహితుడి బద్దకం కారణాలుగా మనుషులు విడిపోతారు. ఈ ప్రపంచంలో సహజమయిన బాంధవ్యాలు ఉండవు - అని. నలుగురూ అర్ధం చేసుకునే, అంగీకరించే నిర్ణయాలు తీసుకునే ముందు ఏకాంతంగా నాయకులు 'లజ్జు గుజ్జులు ' పడడాన్ని వీద్ఝిన పెట్టడం అన్యాయం. అనవసరం. గాంధీగారి రోజుల్లో వికీలీక్స్ ఉంటే "ఈ ముసలాడు (గాంధీ) మన దుంపతెంచుతున్నాడయ్యా - మాట్లాడితే నిరాహార దీక్ష అంటాడు. అసలు పనులు మానేసి ఆయన వెనుక నిమ్మరసం పట్టుకు తిరగాల్సి వస్తోంది" అని నెహ్రూగారు, పటేల్గారూ ఏ బలహీనమయిన క్షణంలోనో ఏకాంతంగానయినా అనుకుని ఉంటారు.
శ్రీకృష్ణుడు అవతార పురుషుడు అనే కాలంలోని ఆయన్ని రోజూ బండబూతులు తిట్టే శిశుపాలుడు, చంపాలనుకున్న కంసుడూ ఉన్నారు. గాంధీగారిని ఒకాయన చంపనే చంపాడు.
ఇంతకీ నన్నాకర్షించిన కథ. మన యువరాజుగారు - ముందు ముందు ఈ దేశానికి ప్రధాని కావడానికి అన్ని హంగుల్నీ సంతరించుకుంటున్న రాహుల్ గారు అమెరికా రాయబారితో మాట్లాడుతూ  "ఈ దేశంలో ముస్లిం దౌర్జన్యకారులకంటే హిందూ దౌర్జన్యకారులవల్ల వల్ల ఎక్కువ ప్రమాదం ఉంద"నడం. అయితే అంతకు ముందు యువరాజుగారు హిందూ వైభవాన్నీ, స్వామి వివేకానంద, అరవిందుల గురించి మాట్లాడేవుంటారు. అసాంజేకి ఆ పేర్లు అర్ధంగాక రాసి ఉండడు.
ఏతావాతా 'ఇటలీ ' రక్తం ఉంది. వారి అమ్మ స్థాయిలో 'హిందూ ' నేపథ్యానికి అవగాహన పెరిగి ఉండదు. యువరాజుగారన్నారుగాని, ఇన్ని అనర్ధాలు మనచుట్టూ జరుగుతున్నా ఈ దేశంలో ఒక్కరు - ఒక్కరు - 'ముస్లిం ' దౌర్జన్యం అంటూ విమర్శించలేదు. కాగా ఒక అబ్దుల్ కలాం, ఒక ఉస్తాద్ అంజాద్ అలీఖాన్, ఒక జహీర్ ఖాన్, ఒక దిలీప్ కుమార్ లను చూసి మనం గర్వపడతాం. ఇంకా ఆఫ్గనిస్థాన్లో, ఇంగ్లండులో, పాకిస్థాన్లో, పార్లమెంటు బయట, అక్షరధాం దగ్గర గోద్రాలో, బొంబాయిలో జరిగిన ఉదంతాల 'కథ 'కి ప్రత్యేకమయిన వ్యాఖ్యానాలు ఎవరూ చెయ్యనక్కరలేదు.
ఒక్కటే భయం. ఈ దేశం ఆలోచనా సరళి మీద, సంస్కృతి వైభవం మీద, విశాల దృక్పధం మీద సరైన అవగాహన లేని యువరాజుగారు - కేవలం మెజారిటీ పుణ్యమా అంటూ ఈ దేశపు ప్రధాని అయితే బొత్తిగా పరిపాలన అనుభవమూ, అన్వయమూ చాలని చేతుల్లోకి - ఈ దేశపు భవిష్యత్తు ఇరుక్కుంటుందేమోనని - ఈ సంవత్సరంలో నాకనిపించిన భయం. (ఈ వాక్యాలు రాసినప్పుడు - నా ఆలోచనల్ని కామెర్లరోగి రంగులాగ చాలామంది తోసిపారేయవచ్చు. నేను భారతీయ జనతా పార్టీ సభ్యుడినీ, విశ్వహిందూ పరిషత్ సభ్యుడినీ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సభ్యుడిని కానని, ఆ సంస్థలతో నాకేమీ సంబంధం లేదని చెప్పడం వల్ల నా భయానికి కాస్త బరువుంటుందని మనవి చేస్తున్నాను.)
 

***
జనవరి 3, 2011

       ************               ************           *************          *************
Also meet Maruthi Rao Garu in his telugu blog gollapudimaruthirao.blogspot.com
Read all the columns from Gollapudi  గొల్లపూడి గారి మిగతా కాలంస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి


KOUMUDI HomePage