Click Play to listen audio of this column
If you have issues with Voice clarity, upgrade your Flash Player Version. Click Here
 
 ఓ అరుదయిన సాయంకాలం
గొల్లపూడి మారుతీరావు

      gmrsivani@gmail.com

 మహానటి సావిత్రి నా మొదటి సినీమా (డాక్టర్ చక్రవర్తి) హీరోయిన్. నా ఆఖరి రేడియో నాటకం హీరోయిన్. ఈ రెండు సంఘటనల మధ్య ఆమె జీవితంలో జరిగిన అన్ని ముఖ్యమయిన ఘట్టాలూ పరుచుకున్నాయి. ఆకాశం ఎత్తుకి ఎగసిన కీర్తి ప్రతిష్టలున్నాయి. కృంగదీసిన అపజయాలున్నాయి. అనారోగ్యం ఉంది. నిస్సహాయమైన జీవన విధానం ఉంది. ఎన్ని ఉన్నా- దాదాపు మూడు దశాబ్దాల తర్వాత సావిత్రి జ్ఞాపకాన్ని యింకా యింకా పచ్చగా, పవిత్రంగా కాపాడుకుంటున్న అభిమానులున్నారు.
సావిత్రి తెలుగువాడి గొప్ప జ్ఞాపకం. ఒక తరం సినీ ప్రేక్షకుల వరం. కొన్ని పాత్రలకు ప్రత్యామ్నాయం లేని కళా వికసనం.
నాకు ఆ కుటుంబంతో ఆత్మీయమైన పరిచయం. ఆమె కూతురూ, అల్లునికి నేనంటే ఎనలేని గౌరవం, భక్తి. ఆమె మనుమడు ఈ మధ్యనే సెల్యూలాయిడ్ మీద అమ్మమ్మ వారసత్వాన్ని పుచ్చుకున్నాడు.
జులైలో శాంతాక్లారా తానా సభలకి వచ్చినప్పుడు ఆమె కొడుకు సతీష్ ఈ ప్రాంతాల్లోనే ఉన్నారని తెలిసింది. ఫోన్ చేస్తే అత్మీయంగా వచ్చి కలిశారు. మరునాడు భార్యనీ, కొడుకునీ పరిచయం చేశాడు. తల్లి కన్నుమూసినప్పుడు సతీష్ వయస్సు 16 సంవత్సరాలు. ఆలోచనలు, ఆవేశాలూ, జ్నాపకాలూ, ఉద్రేకాలూ ముసురుకుంటున్న వయస్సది. ఇన్నేళ్ల తర్వాత- యిప్పటికీ తెలుగు దేశాన్ని ఆనందపరుస్తున్న ఆ విదుషీమణి జ్నాపకాలు అతని మనస్సులో ఎలా నిలిచాయి? ఆత్మీయమయిన ప్రసంగం ఇది. మారియట్ హొటల్లో ఒక గంట. ఓ గొప్ప జీవితంలోని గొప్ప జ్ఞాపకం.


 

 

 

 

 

 

 

 

ఇవీ సతీష్ మాటలు:
అమ్మ అందరి తల్లులలాగే తన పాత్రనీ మా జీవితంలొ పోషించేడానికి ప్రయత్నించేది. ఇది నటించే పాత్రకాదు. జీవించే పాత్ర. ఏది చేసినా ఒక నిర్దుష్టమయిన పూనికతోనే చేసేది.
ఆమె ఓ విభిన్నమయిన వాతావరణంలో పెరిగింది. కాని ఆమె అమ్మ. ఆమెలో ప్రత్యేకంగా గుర్తున్న విషయం -అచంచలమైన అత్మవిశ్వాసం. అలాగే ఎందరున్నా- నాన్న-అందరికన్న ఎత్తుగా నా జీవితంలోకి తొంగిచూశారు. ప్రభావాన్ని చూపించారు.
చిన్నతనంలో అక్కకి ఏ బొమ్మలు కొన్నా వాటిని విరగ్గొట్టి చూసేవాడిని. చిలిపితనం కాదు. జిజ్ఞాస. నన్ను ఇంజనీరుని చెయ్యాలని అమ్మ కోరిక. అలాగే అక్క డాక్టరు కావాలని. అమ్మ కలని అక్క దాదాపు సాధించింది. ఫిజికల్ ఫిట్నెస్ నైపుణ్యాన్ని సాధించుకుంది అక్క.
అమ్మ ఎప్పుడూ అంటూండేది: ఎన్నిరకాల మనుషులు కలిసినా వారిలో మంచిని చూడు, చెడుని చూడకు-అని.
మమ్మల్ని ఏదో పేరున్న గొప్ప కళాకారిణి పిల్లల్లాగ పెంచలేదు అమ్మ. అలా మేం పెరగడం యిష్టం లేదు. నేలమీద నిలబడి నలుగురు పిల్లల్లాగే పెరగాలని అమ్మ ఆశించేది. 1980 ప్రాంతాల్లో అమ్మతో కలిసి అన్నానగర్ లో చింతామణి సూపర్ మార్కెట్ లో కూరగాయలు కొనుక్కోడానికి వెళ్లిన జ్నాపకాలున్నాయి.
వెనక్కి తిరిగి చూసుకుంటే కొడుకుగా నేను అదృష్టవంతుడినే అనిపిస్తుంది. నేనెక్కడికి వెళ్లినా- యిప్పటికీ- సావిత్రి మా అమ్మ అని తెలిస్తే ఆ ఒక్క కారణానికే నన్ను అభిమానిస్తారు. ఇది అమ్మ నాకిచ్చిన వరం.
అమ్మది ఎడం చేతి అలవాటు. క్రికెటంటే చాలాయిష్టం. వెస్ట్ ఇండీస్ ఆటగాడు గారీ సోబర్స్ ఎడం చేతి ఆటగాడు. అతని అభిమాని మా అమ్మ. ఎన్ని పనులున్నా తీరిక చేసుకుని మాతో చదరంగం ఆడేది. బాడ్ మెంటన్ ఆడేది. పేకాటలో "లిటరేచర్’ ఆట ఆంటే అమ్మకి అభిమానం. నాకు అమ్మే యీత నేర్పింది.
అమ్మ నటించిన సినీమాలన్నీ చూసే అవకాశం నాకు రాలేదు. ఇప్పటికీ అన్నీ చూడలేకపోయాను. అమ్మ నటించిన మాయాబజార్, గుండమ్మ కధ, మిస్సమ్మ వంటివి చూశాను. విషాద భరితమైన పాత్రలు నటించేదికాని ఏడుపు పాత్రల్నీ, కధల్నీ మమ్మల్ని చూడనిచ్చేదికాదు.
నాకు బాగా నచ్చిన సినీమా- అమ్మ పాత్ర- అర్ధాంగి. తెలుగు వెర్షన్ లో అక్కినేని హీరో. తమిళంలో శివాజీ విలన్ పాత్రని చేశారు. ఆమె నటించిన సినీమాలన్నీ ఎప్పటికయినా చూడాలనీ, అవన్నీ పోగుచేసి ఒక లైబ్రరీ చేయాలనీ నాకోరిక.
హాలీవుడ్ నటి షిర్లీ మాక్లియన్ అంటే అమ్మకి యిష్టం. షిర్లీ మాక్లియన్ కీ అమ్మంటే యిష్టం. ఓసారి ఆవిడ మా యింటికి వచ్చారు.
చివరలో చాలా కారణాలకి ఆమె ఆరోగ్యం దెబ్బతినడం ప్రారంభించింది. "తనవాళ్లు’ అనుకున్నవాళ్లే వెన్నుపోటు పొడిచారు. తన చుట్టూ ఉన్నవాళ్లమీద ఎక్కువ నమ్మకాన్ని పెంచుకుంది(ఓవర్ కాన్ఫిడెన్స్). మరికాస్త జాగ్రత్తగా ఉండవలసింది. ఆరోగ్యం పాడయిందికాని అది అవసానమని ఎన్నడూ అనుకోలేదు. నాకేం పరవాలేదనుకునే మొండి ధైర్యం ఉండేది.
క్రమంగా ఆరోగ్యం క్షీణించింది. బాగుచెయ్యాలని ప్రయత్నించాం. కాని మా చెయ్యి దాటిపోయింది. ఒకటిన్నర సంవత్సరాలు బాధపడింది.1977 లో ఒక్కసారి కోలుకుంది. ఆ రోజుల్లోనే గోరింటాకు, బెంగుళూరులో రాజ్ కుమార్ తో "తాయితక్కమగ’ వంటి చిత్రాలు చేసింది. ఇంక పరవాలేదని, మెల్లగా కోలుకుంటుందని నిట్టూర్చాం.
అయితే ఇన్ కంటాక్స్ సమస్యలూ, కోర్టు కేసులూ ఆమెని మరీ క్రుంగదీశాయి.
1981 లో కోమాలోకి వెళ్లిపోయింది. అది ఆఖరి దశ. కాస్త ముందుగానే వెళ్లిపోయివుంటే బాగుండేది అన్నంతగా బాధపడింది. మేమేం చెయ్యలేకపోయాం.
ఎన్ని అవాంతరాలు మీద పడినా- ఆమె మెదడు, ఆలోచనలు పదునుగా ఉండేవి. ఆరోగ్యం ఏమాత్రం సహకరించినా యింకా ఎన్నో అద్భుతాలు చేసి ఉండేది అనుకుంటూంటాను. తన కళని పదిమందికీ పంచగలిగేది.
మా అబ్బాయికి నాన్నమ్మ పోలికలు బాగా వచ్చాయి. మా అమ్మలాగే ఎడం చెయ్యి అలవాటు. అమెలాగే ఉంటాడు. మొండితనం, నిర్దుష్టమైన అభిప్రాయాలూ అమ్మవే. "మూర్ఖత్వం’ కాదు- "పట్టుదల’ అని నా ఉద్దేశం.
మా ఆవిడ మా అమ్మకి పెద్ద అభిమాని. ఆమె చిత్రాల్ని చూసినప్పుడు తప్పనిసరిగా ఆమె కళ్లు చెమ్మగిల్లుతాయి.
""మరి మీకు?” అనడిగాను.
చెప్పలేదు. ఒప్పుకోలేదు. నవ్వేశాడు. కాని తల్లి జ్ఞాపకాలు పదిలంగా, ఆత్మీయంగా, ఏకాంతంగా దాచుకున్న కొడుకు తెలిశాడు.
అమెరికా మర్యాదలకి అలవాటుపడిపోయాడు. లేచి ఒక్కసారి నా కాళ్లకి నమస్కారం చేశాడు-""మిమ్మల్ని కలుసుకోవడం ఆనందంగా ఉంది” అంటూ.
వెనకటికి చెలం ఒక ప్రేమలేఖలో ప్రేయసికి రాస్తాడు. నీ వేపు ప్రయాణం చేస్తున్న ఏ రైలు అయినా- నాకు ఆత్మీయంగానే కనిపిస్తుంది-నీకు చేరువవుతోంది కనుక-అని.
తన తల్లితో పనిచేసిన ఏవ్యక్తి అయినా, ఏ జ్ఞాపకమయినా అతన్ని ఆర్ద్రం చేస్తుంది. మనస్సులో ఏకాంతంగా దాచుకున్న "అర’ ఒక్కక్షణం తెరుచుకుంటుంది. నన్ను చూస్తున్నప్పుడు అలాంటి స్పందన ఏదో కదిలింది.
చెప్పలేని మాధుర్యం, వాత్సల్యం, మమకారం, గర్వం, వేదన, తియ్యని బాధ- యిన్నిటిని కదిలించింది. అదీ ఓ అరుదయిన అమ్మ జ్నాపకాలకు - అమ్మ అభిమాన ప్రపంచానికి దూరంగా జీవిస్తూ జనజీవనంలో కలిసిపోతున్న ఓ కొడుకు అంతరంగం.
 

 ***
జూలై  11, 2011

       ************               ************           *************          *************
Also meet Maruthi Rao Garu in his telugu blog gollapudimaruthirao.blogspot.com
Read all the columns from Gollapudi  గొల్లపూడి గారి మిగతా కాలంస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి


KOUMUDI HomePage