Click Play to listen audio of this column
If you have issues with Voice clarity, upgrade your Flash Player Version.
Click Here

 

గురి తప్పిన నిరసన

గొల్లపూడి మారుతీరావు
                                 gmrsivani@gmail.com
                                     

  

నిన్నకాక మొన్న - స్వాతంత్రదినోత్సవం నాడు కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మీద ఒక మాజీ పోలీసు ఉద్యోగి బూటు విసిరాడు. అంది కొన్ని అడుగుల దూరంలో తప్పిపోయింది. ఇతను ఉద్యోగంలోంచి ఏవో కారణాలకి  బర్త్ రఫ్ అయాడు. పాకిస్తాన్ వరదల్లో అల్లాడుతూంటే బ్రిటన్ లో పర్యటిస్తున్నందుకు నిరసనగా లండన్ లో ఒక పాకిస్థానీ తమ అధ్యక్షుడు అసిఫ్ ఆలీ జర్దారీగారి మీద బూటు విసిరాడు. అదీ గురితప్పింది. మధ్య - 1984 లో సిక్కులకి జరిగిన దురన్యాయానికి సత్వర చర్యలు తీసుకోలేదని ఒక సర్దార్జీ, హోం మంత్రి చిదంబరం గారి మీద బూటు విసిరాడు. చైనా ప్రధాని వెన్ జియాబాయో కేంబ్రిడ్జి వచ్చినప్పుడు ఒక చైనా నిరసనకారుడు బూటు విసిరాడు. వీటన్నిటిలో సామాన్య గుణం ఉంది. అందరికీ తమ తమ నాయకత్వం మీద ఏవో కారణాలకి కోపం ఉంది. అందరికీ బూటు విసిరి తమ కోపాన్ని చాటుకోవాలనే కోరిక ఉంది. కాని అందరిలోనూ బూట్లనిసరిగ్గా విసరలేని అసమర్ధత ఉంది. ఇది చాలా శోచనీయమైన సంగతి . మొన్న కాశ్మీరులో బూటు విసిరిన తీరు మనదేశానికి మరింత తలవొంపులుగా భావించాలి. ఒక పోలీసు ఉద్యోగి అయివుండీ బూటు సరిగ్గా విసరలేకపోయినందుకు మనమంతా సిగ్గుపడాలి. అటువంటి పోలీసు బర్తరఫ్ అయితే ఆశ్చర్యం లేదు, కాగా, ఇది మన శత్రువుల దృష్టిలో మనల్ని తేలికపరిచే విషయం. కాశ్మీరు పోలీసుని వెంటనే ప్రత్యేక కాశ్మీరు ఉద్యమానికి రాళ్ళు విసిరే వాళ్ళ దగ్గర సత్వరంగా తర్ఫీదు ఇప్పించాలని నా మనవి. ఇలాంటి సంఘటనల్లో నిరసనకంటే, నిరసనకారుల అసమర్ధత అన్ని దేశాలకూ కొట్టవచ్చినట్టు కనిపిస్తుంది. ముఖ్యంగా ఐక్యరాజ్య సమితి ఇన్ని దేశాల అసమర్ధతని వెంటనే గుర్తించాలని, అందరికీ సామూహికంగా తమ తమ బూట్లను విసిరే హక్కుని గుర్తిస్తూ కావలసిన నైపుణాన్ని  నేర్పించాలని నా అభిప్రాయం.

ఇలా అంటున్నప్పుడూ నేనేదో వ్యంగ్యంగా అంటున్నానని చాలామందికి అనిపించవచ్చు. కాని ఇది ఒక ఉద్యమానికి పురిటిలోనే పట్టిన చీడగా భావిస్తున్నానని చెప్పడం నా లక్ష్యం. కారణం ఇది. నాయకుల మీద కొందరికి కోపం వచ్చింది. కొందరికి బూట్లతో తమ కోపాన్ని చాటుకోవాలనే ఆలోచన వచ్చింది. విషయాన్ని, అలా చాటుకునే వారి హక్కునీ ప్రతీ నాయకులూ గుర్తించారు. అందుకే అందరూ ఆయా బూటు యజమానులను అక్కడికక్కడే క్షమించారు. ఇది వారి ఉద్యమానికి శుభశకునం. ఒమర్ అబ్దుల్లాగారయితే బూటు విసరడాన్ని ఆహ్వానించారు. "బాబూ! రాళ్ళు విసరడం కన్న బూట్లు విసరడం మేలైన పని" అని మెచ్చుకున్నారు.మరో అడుగు ముందుకు వేసి వారి నాన్నగారు ఫరూక్ అబ్దుల్లా గారు కొడుక్కి జరిగిన మర్యాదకి పొంగిపోతూ "మా వాడు జార్జ్ బుష్, అసిఫ్ జర్దారీ, చిదంబరం వంటి మహాపురుషుల లిస్టులో చేరినందుకు నాకు గర్వంగా ఉంది" అని పేర్కొన్నారు.

ఇంతవరకూ తమకో అనుమానం రావచ్చు. ఉద్యమకారుల జాబితాలో - బూట్ల విసురుడుకి మూలపురుషుడైన ఇరాక్ పాత్రికేయుడి ప్రసక్తి ఎందుకు చేర్చలేదని. అయ్యా, కారణం ఉంది. 2008 డిసెంబరులో కథానాయకుడే ఇలాంటి నిరసనకి నాందీ పలికాడు. తదాదిగా ప్రపంచమంతా ఆయన అనుచరులు ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. అయితే ఇతను విసిరిన బూటు సరిగ్గా బుష్ గారికి తగిలేదే. కాని బుష్ దొరగారు చాకచక్యంగా తప్పించుకుని పాత్రికేయుడిని అవమానించారు. చెప్పుదెబ్బని ఊహించడం దానిని తప్పించుకునే మెళుకువల్ని ప్రాక్టీసు చెయ్యడం బుష్ దొరగారి ప్రత్యేకత. కనుక వారిని మిగతా అసమర్ధ నాయకులతో చేర్చరాదని నా ఉద్దేశం. అంతేకాదు. సంఘటన తర్వాత ఇరాక్ లో పాత్రికేయుడు పెద్ద హీరో అయిపోయాడు. కొన్ని కోట్లు విరాళాలు ఇచ్చారు. ఆ బూట్ల కంపెనీ బ్రాండు బూటుని మార్కెట్లో ఉంచి మరికొన్ని కోట్లు సంపాదించుకుంది. 'షూ-బుష్షూ ' అనే కంప్యూటర్ ఆట ఇప్పుడు అద్భుతంగా అక్కడ ప్రచారంలోకి వచ్చేసింది. బుష్ గారి బొమ్మని ఎన్ని బూట్లు కొడితే అని మార్కులు! కనుక వైతాళికుడిని అసమర్ధుల జాబితాలో చేర్చరాదని నా మనవి. ఇతను ఉద్యమానికి ఆధ్యుడు. పూజనీయుడు.

ప్రఖ్యాత రష్యన్ రచయిత చెకోవ్ ఒకమాట అన్నారు. ' నీకు పన్ను ఊడిందా? మూతి పగల లేదని సంతోషించు ' అని. ఇక్కడ రెండు పనులు వెంటనే జరగాలని జరగాలని మనవి చేస్తున్నాను. ఉద్యమకారులులకు బూటు విసిరే నైపుణ్యాన్ని పెంచడంతో ఫాటు, బుష్ గారిని గురువుగా అలాంటి సందర్భాలలో బూటుని ఎలా తప్పించుకోవాలో ఆరువారాల పాటు ప్రపంచంలో ప్రతీ నాయకుడికీ తర్ఫీదు ఇప్పించాలని. దేశాల అధ్యక్షులకీ, ప్రధానులకీ, ముఖ్యమంత్రులకీ, హోం మంత్రులకీ - అందరికీ శిక్షణ అవసరమని పరిస్థితులు నిరూపిస్తున్నాయి. ఇందువల్ల 'బూటు క్రీడ' ఆయా దేశాలలో స్థిరపడే అవకాశం ఉంటుంది. ఎలాగూ నాయకులు తమని క్షమిస్తారని ఆయా ఉద్యమ కారులు గ్రహించారు కనుక - ఇకముందు మాత్రమూ సంకోచం లేకుండా తమ నిరసనల్ని వ్యక్తం చేస్తారని నాకనిపిస్తుంది. కాక, ఇలాంటి పనివల్ల తమకి అంతర్జాతీయమైన కీర్తి ప్రతిష్టలు వస్తాయనీ, ఆయా నాయకులతో పరిచయాలు పెరుగుతాయని పలువురు భావించవచ్చు. ఉదాహరణకి రుచికా హత్యకేసులో రుచికా కంటే రాధోడ్ గారి పాపులారిటీ ఇనుమడించింది. వారిలాగ వెధవ పని చేసి చిరునవ్వులు ఒలకపోయాలని చాలామంది తంటాలు  పడుతుంటారని నా నమ్మకం. అలాగే రేపు పెద్ద మనిషైనా కొడైకెనాల్లో అమ్మాయిల్ని రేప్ చేసే ప్రిన్సిపాల్ గారి మీద బూటు విసిరాడనుకోండి. కోపంతో ఆయన కోర్టుకెక్కాడనుకోండి. న్యాయమూర్తిగారు 'ఏమయ్యా, నువ్వు బుష్ గారు, జర్దారీగారి కంటే గొప్పవాడివా? వాళ్ళు చూపించిన మర్యాద నువ్వు చూపించలేవా? ' అని కేసు కొట్టేసే అవకాశం ఉంది.

కనుక, ముందు ముందు మనం సభల్లో రకరకాల బూట్లని మరింత విరివిగా విసిరే యోధుల్ని చూసే అదృష్టం కలగనుంది. బూటు సంధించే వాళ్ళని క్షమించే నాయకత్వం ఉండాలేగాని విసిరేవాళ్ళకి కొరత ఉండదు. బహిరంగంగా పదిమందిలో చెప్పుతీసి కొట్టడం అవమానంగా భావించే రోజులు పోయాయి. అది 'అదృష్టం' గా, 'గొప్ప'గా భావించే నాయకత్వం ఇప్పుడిప్పుడే ముందుకు వస్తోంది. నాయకుల్లో 'సిగ్గులేని తనం' తరానికి కొత్త అలంకారం. పదిమందిలో కొట్టి, గర్వంగా బోరువిరుచుకోవడం - తరం 'కోపా'నికి కొత్త కోణం. అలనాడు మహాత్మా గాంధీ మీదో, మార్టిన్ లూధర్ కింగ్ మీదో ఇలాంటి పని చెయ్యబూనడం అనూహ్యం. ప్రస్తుత నాయకత్వానికి అనుగుణంగానే 'చెప్పుతీసికొట్టే' తరం తయారవుతోంది.

నాది ఒక్కటే బాధ. అక్కడ లండన్ లోనూ, కేంబ్రిడ్జిలోనూ, కాశ్మీరులోనూ అందరూ అసమర్ధులయిన ఉద్యమ కారులు పుట్టుకొస్తున్నారే అని. వీరి చేతకానితనం ఆయా నాయకుల చేతకానితనం కంటే మరింత కొట్టవచ్చినట్టు కనిపిస్తోందని ముందు ముందు బూట్లు విరిసే ఉద్యమకారుల దృష్టికి తీసుకు రావాలన్నదే కాలం పరమార్ధం. బాబూ! బూట్లు విసరండి. కాని ప్రాక్టీసు చేసి, లక్ష్యాన్ని సాధించి, చిత్తశుద్ధితో, ఏకాగ్రతతో విసరండి. కుక్కకాటుకి చెప్పుదెబ్బ అన్నది పాత, పాడుపడిన సామెత అని గుర్తించండి. మిమ్మల్ని గుర్తించి, మీ చర్యకి పొంగిపోయే నాయకులు మీ 'బూటు దెబ్బ'కి ఎదురుచూస్తున్నారు. చాకచక్యాన్ని పెంచుకోండి. ఉద్యమాన్ని భ్రష్టుపట్టించకండి - అని మనవి చేస్తున్నాను.

     ఆగస్టు 23, 2010

       ************               ************           *************          *************
Also meet Maruthi Rao Garu in his telugu blog gollapudimaruthirao.blogspot.com
Read all the columns from Gollapudi  గొల్లపూడి గారి మిగతా కాలంస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

KOUMUDI HomePage