Join us on


Click Play to listen audio of this column
If you have issues with Voice clarity, upgrade your Flash Player Version.
Click Here

 

ఒకమాట


గత రెండు సంవత్సరాలుగా మారుతి రావు గారు కౌముదిలో వారం వారం వివిధ అంశాల మీద ఈ కాలంస్ వ్రాస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఈ పరంపరలో ఇది 100 వ కాలం!  ఈ సందర్భంగా మీతో రెండు మాటలు పంచుకోవాలనిపించింది.
రెండేళ్ళుగా క్రమం తప్పకుండా గొల్లపూడి గారు వ్రాస్తున్న ఈ అంశాలు ఆయన విశేషమైన అనుభవానికీ, విలక్షణమైన దృక్కోణానికే కాక వారిలోని క్రమశిక్షణ గల రచయితకి కూడా ప్రత్యక్షప్రమాణాలు ( గత 102 వారాల్లో కేవలం రెండు సార్లు మాత్రమే ఈ కాలం ని అందించలేకపోయారు ). ఏ రోజు ఎక్కడ వున్నా, ఎన్ని పనుల్లో ఉన్నా ఖచ్చితంగా శనివారం సాయంకాలాని కల్లా ఈ శీర్షికని అందించి మాకెంతో స్ఫూర్తినిస్తున్నారు.
ఒక దినపత్రికలో వస్తున్న వారి కాలం
2008లో ఆగిపోయింది. అభ్యంతరంలేక పోతే కౌముదిలో వారి శీర్షికని కొనసాగిస్తానని అన్నాను. ఆయన ప్రియ మిత్రుడు ఎస్.గోపాలరెడ్డి గారికి నివాళితో ఈ కొత్త శీర్షికని 2008 సెప్టెంబర్ 15 న మొదలుపెట్టడం జరిగింది. కౌముది ప్రారంభ సంచికనుంచీ తన రచనలతో మనల్ని అలరిస్తున్న శ్రీ మారుతి రావు గారి ఈ శీర్షికకి కూడా కౌముది వేదిక కాగలగడం ,. ఇదొక అరుదైన అవకాశం.
జూన్ 2009 నుంచీ ఆడియో ఫైల్సు కూడా జతచేయడం జరుగుతోంది. గత సంవత్సరంగా బ్లాగురూపంలో కూడా ఈ కాలం వేలాది పాఠకులని వారం వారం అలరిస్తోంది. గత కొద్ది నెలలుగా ఆంధ్రప్రభ ఆదివారం సంచికలో కూడా ప్రింట్ రూపంలో వస్తూ ఈ కాలం మరింత మంది పాఠకులని చేరుతోంది.
సిడ్నీ తెలుగు సంఘం వారి రేడియో ద్వారా ఈ కాలం ఆడియో రూపంలో వారం వారం ప్రసారమౌతోంది.
నిత్యపరిణామ శీలియైన సమాజాన్ని అనుక్షణం నిశితంగా పరిశీలిస్తూ, వారం వారం తనదైన విశ్లేషణతో మనల్ని అలరిస్తున్న గొల్లపూడి గారి ఈ శీర్షికాప్రస్థానం ఇలానే కొనసాగాలని మనసారా ఆశిస్తూ, ఈ ప్రయోగాన్ని ఆదరిస్తున్న పాఠకులకి అభివందనాలు తెలియచేస్తున్నాం. మారుతి రావు గారూ..థాంక్యు ..!

కిరణ్ ప్రభ      

బూతు   క్రీడ

గొల్లపూడి మారుతీరావు
      gmrsivani@gmail.com
 

 

మొదట 'కండోం'కి అర్ధం తెలుగు పాఠకులకు చెప్పాలి. గర్భ నిరోధానికి, సెక్స్ వ్యాధులు రాకుండా జాగ్రత్తపడడానికి ఉపయోగించే రబ్బరు తొడుగు. ఇంతకంటే  వీధిన పడడం నాకిష్టం లేదు.

చాలా సంవత్సరాల కిందట జపాన్ చిత్రం ఒకదానిని అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో చూశాను. ఆ దేశం గర్వపడే ప్రాతినిధ్యం వహించే గొప్ప చిత్రంగా దానిని చిత్రోత్సవానికి పంపించారు. అది ఒక సెక్స్ బ్రోకర్ కథ. ఇతను దేశభక్తిలో ఏ గొప్పనాయకునికీ తీసిపోనివాడు. ముఖ్యంగా దేశరక్షణకు పోరాడే యోధులకు అమ్మాయిల్ని తారుస్తూ ఉంటాడు. అతనిది ఒకటే ఆదర్శం. అమ్మాయిలతో చెపుతుంటాడు: 'దేశ శ్రేయస్సునీ, కళ్యాణాన్నీ కాపాడే వీరుల్ని కనండి' అని. సినిమా చూస్తున్నంత సేపూ రెండు రకాలయిన షాకులు. ఒకటి: ఒక తార్పుడిగాడి కథ ఆ  దేశపు గొప్ప చిత్రమా! అన్నది. రెండు: చిత్రం పూర్తయేసరికి దేశం గర్వించదగ్గ ఏ దేశభక్తునికీ అతని ఆదర్శం కాని, అతని లక్ష్యం కానీ తీసిపోదని.

కల్మాడీ గారి మీద ఎన్నో అవినీతి ఆరోపణలు - ఈ మధ్య టీవీ ఛానళ్ళలో, పత్రికలలో వినవస్తున్నాయి. వాటన్నిటి మీదకీ నా మనస్సు పోవడం లేదు. కాని ఈ కామన్వెల్తు ప్రతినిధులుండే చోట 150 కండోముల మిషన్లు పెడతారట. ఈ కండోములు రోజుకి మూడువేలనుంచి 3300 వరకు వినియోగిస్తారట. ఒక్కొక్క పాకెట్లో రెండు కండోముల లెక్కన చూసుకున్నా ఈ క్రీడలయేసరికి ఒక లక్ష ఖర్చవుతాయని అంచనా. అసలు మొదట్లో రెండొందలు కండోం మిషన్లనిపెడదామనుకున్నారట. కాని ప్రస్తుతం వాటిని వందకి తగ్గించారు.

వీటిని ఎవరు వాడుతారు? ఆయా దేశాల నుంచి వచ్చిన క్రీడాకారులు, వారి సిబ్బంది, వారి పాలక యంత్రాంగం. వీళ్ళల్లో ఎవరూ భార్యాభర్తలు కారు. మరి కండోంల దాకా పోయే - రోజుకి 6600 కండోంలు ఖర్చయ్యే శృంగార క్రీడ ఎలాసాగుతోంది? ఈ విషయాన్ని కర్ణాటక ఉద్యమ కారులు ప్రమోద్ ముతాలిక్ గారు గమనించడం లేదా? ఈ ' ధర్మ ' సంస్థల లక్ష్యం ప్రకారం వాళ్ళని అక్కడికక్కడే పట్టుకుని పెళ్ళిళ్ళు చేసెయ్యాలి కదా? పోనీ ఈ కండోముల ఖరీదు కలిసి వచ్చేలాగ ప్రపంచ శాంతి సంస్థ, ప్రపంచ పునరావస సంస్థ, ప్రపంచ ఆరోగ్య సంస్థల వంటివి స్పాన్సర్ చేస్తే మరింత సరసమైన ధరలు పలుకుతాయి కదా? ఈ వ్యభిచారానికి అంతర్జాతీయమైన మద్దతు లభిస్తుంది కదా?. ఇంతకీ నాకు బొత్తిగా తేలని సంశయం  ఒకటుంది. పార్కుల్లో, బీచిల్లో చెయ్యి చెయ్యీ పట్టుకుంటేనే బ్రోతల్ కేసులు బనాయించే పోలీసు శాఖవారి అనుమతి ఈ ఘరానా కండోం వితరణకి లభించిందా అని. రంజాన్ నెలలో ఇస్లాం దేశాలలో మందు పేరెత్తితేనే జైల్లో పెడతారు. ప్రపంచంలో ఏ దేశమలో నయినా మాదక ద్రవ్యాల ఊసెత్తితే అరెస్టు చేస్తారు. మరి నీతి, సౌశీల్యం వంటి విలువలకు ఆటపట్టయిన భారతదేశంలో గర్వంగా సామూహిక శృంగార వైభవానికి ఇంత సాధికారమైన ఏర్పాట్లు చేస్తున్నందుకు భారతీయుడిగా ఈ ఒక్క కారణానికే కల్మాడీగారికి భారత రత్న ఇవ్వాలని ప్రతిపాదిస్తున్నాను. ఏమయినా, నాకేమో ఈ కండోముల వల్ల జీవహింస జరుగుతుందని భావిస్తున్నాను. ఈ కండోముల వినియోగాన్ని ఆపగలిగితే -  పైన చెప్పిన జపాన్ కథ ప్రకారం - ఆ కథలో హీరో ఆదర్శాన్ని దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే - గొప్ప గొప్ప క్రీడాకారులు కొత్త తరం పుట్టుకొస్తుందని గర్వపడాలనిపిస్తుంది.

ఇక్కడ మళ్ళీ చిన్న ఆడిట్ సమస్య ఉంది. పేపర్లో చదివిన ప్రకారం - పాలకవర్గమంతా నాసిరకం అవినీతిపరులైతే (డబ్బునే ఎవరికీ దొరకకుండా దోచుకోలేకపోతున్నారు) వారూ ఈ కండోముల్ని సరిగా వాడకపోతే , మరింత బలమైన నాసిరకం అవినీతిపరులు పుట్టుకొచ్చే అవకాశం ఉంది. వీరంతా 2030లో జరిగే కామన్వెల్తు క్రీడలకు కొరకరాని కొయ్యలుగా తయారయే ప్రమాదం ఉన్నది.

ఏమయినా ఈ క్రీడలలో గొడుగులకీ, టాయిలెట్ పేపర్లకీ కోట్లు ఖర్చుచేసే పాలక యంత్రాంగం రెండొందల కండోం మిషన్లను వందకి ఎందుకు కుదించారో చెప్పాలి. కామన్వెల్తు క్రీడల్లో ఎన్నో క్రీడల్ని ప్రకటించారు కాని లక్ష కండోములను వినియోగించే ఈ 'శృంగార ' క్రీడను ఎందుకు చేర్చలేదో సంజాయిషీ ఇవ్వాలి. ముఖ్యంగా వాత్సాయనుడి వంటి మహా జ్నానులు జన్మించిన ఈ దేశంలో కండోముల కక్కుర్తిని ఎల్లరూ గర్హించాలి. తీరా - క్రీడల సమయానికి - శృంగార ప్రవృత్తిలో ఆవేశపూరితులైన క్రీడాకారులు, సిబ్బంది -  కండోముల కోసం వెదుకులాటని ప్రారంభిస్తే మన దేశానికి ఎంత తలొంపులుగా ఉంటుందో కల్మాడీ, బానోత్ గారలు గుర్తించాలి. క్రీడలు పూర్తయేసరికి - కండోం మిషన్లు మిగిలితే మిగలనీగాక, కనీసం 900 మిషన్లు ఏర్పాటు చెయ్యాలని దేశంలో అలజడిని చేయాలి.  మిషన్లు మిగిలిపోతే తరువాత వాటిని కాలేజీలకి, కార్పొరేట్ కంపెనీలకు ఉపయోగిస్తాయి. ఈ పనికి రిటైరయిన పోలీసు అధికారి రాధోడ్ వంటివారిని ఉపయోగించవచ్చు.  ఇప్పటికే అదిలేని కొరతని వారనుభవిస్తున్నారు..కామన్వెల్తు క్రీడల పేరుతో ఢిల్లీ రోడ్లు బాగుపడతాయని షీలా దీక్షిత్ గారు ఆనందించినట్టు - ఈ క్రీడల పేరుతో కాలేజీలకు, విశ్వవిద్యాలయాలకూ, కార్పొరెట్ కంపెనీలకూ ఉపయోగం జరుగుతుంది. అయితే ప్రస్తుతం లెక్కల ప్రకారం - ఒక్కొక్క కండోం ధర వెయ్యి నుంచి రెండు వేలదాకా ఉండవచ్చు. అయితే వాటిని ప్రపంచ స్థాయి క్రీడాకారులు వాడుతున్నారనీ, ఈ 'వాడకం' మన దేశ ప్రతిష్టను పెంచుతున్నదని పెంచుతున్నదని మనం మరిచిపోకూడదు.

భారతదేశం ప్రాచీన కాలం నుంచీ అతిధి మర్యాదలకూ, సంప్రదాయ సిద్ధమైన మర్యాదలకూ పెట్టింది పేరు. సెక్స్కి సశాశ్త్రీయమైన స్థానాన్నీ, గౌరవాన్నీ అంతర్జాతీయ స్థాయిలో కల్పించిన మన దేశం - ముఖ్యంగా అంతర్జాతీయ క్రీడల నేపధ్యంలో - కండోముల విషయంలో వెనుకాడకూడదని నా ప్రగాఢ విశ్వాసం. క్రీడలు ఆడడానికి వచ్చిన ప్రపంచ స్థాయి క్రీడాకారులు జపం  విడిచి లొట్టల్లో పడిన సామెతగా - వచ్చిన పని మరచిపోయి - లక్షసార్లు 'వ్యభిచారం'లోకి దిగుతారని మనం భావించకూడదు. పేదవాడు చేస్తే రంకు. మధ్య తరగతి వాడు చేస్తే అపచారం. డబ్బున్నవాడు చేస్తే వినోదం. కామన్వెల్తు క్రీడాకారుల స్థాయిలో జరిగితే దాని పేరు 'క్రీడ'. అది దేశ గర్వకారణం. దానికి ప్రభుత్వపు సాధికారకమైన మద్దతు ఉంటుంది. ఏమయినా ఈ కండోముల వల్ల కాకపోతే - ఈ క్రీడలు పూర్తయేసరికి జపాన్ సినిమాలో 'తార్పుడు ' హీరోలాగ - దేశం గర్వపడే - గొప్ప క్రీడాకారుల తరం పుట్టుకురాదా అని గర్వపడాలని నా కనిపిస్తుంది.

 

ఆగస్టు 30, 2010

       ************               ************           *************          *************
Also meet Maruthi Rao Garu in his telugu blog gollapudimaruthirao.blogspot.com
Read all the columns from Gollapudi  గొల్లపూడి గారి మిగతా కాలంస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

 

Join us on
 

KOUMUDI HomePage