Click Play to listen audio of this column
If you have issues with Voice clarity, upgrade your Flash Player Version.
Click Here

 

రాజ నర్తకి పరిష్వంగం

           నాకు చాలా యిష్టమయిన జోక్ ఒకటుంది. నిజానికి ఇది అబ్బూరి రామకృష్ణారావుగారు తమ ఉపన్యాసాల్లో -ఆ రోజుల్లో- తరుచు చెప్పేవారు.

        వెనకటికి ఒకాయన అనాధ శరణాలయానికి సహాయం చెయ్యమని ఉత్తరం రాశాడట. ఉత్తరం చూసుకున్న పెద్దమనిషి బాగా ఆలోచించి ఇద్దరు అనాధల్ని పంపాడట.

        అహింసకీ, శాంతికీ ప్రతీకగా నిలిచిన మహాత్మాగాంధీ పుట్టిన రోజునాడు ఆన్నార్తులకు రుచికరమైన చికెన్ బిరియానీ పంచితే ఎలావుంటుంది?

        దక్షిణాఫ్రికానుంచే స్వదేశీ ఉద్యమాన్ని ప్రారంభించిన మహాత్ముడు- ఇండియా వచ్చాక మిల్లుబట్టలను విడనాడమంటూ- మీ చేత్తో వడికిన ఒక్క నూలు బట్ట మీ వొంటిని కాపాడితే అది ఐశ్వర్యం అన్నాడు.

        మహాత్ముడు ఎప్పుడూ మేకపాలు తాగేవాడు. అతి నిరాడంబరమయిన జీవనం సాగించేవాడు. మరి ఆయన ఎక్కడికి వెళ్ళినా మేకల్ని వెదకాలి. లేదా వాటిని భద్రంగా ఆయనతో తీసుకువెళ్ళాలి. సరోజినీ నాయుడు జోక్ ఒకటి ఆ రోజుల్లో చాలా ప్రచారంలో ఉండేది. If only Bapu knows how much it costs Birla to keep him poor అని. రిచర్డ్ అటెన్ బరో తన గాంధీ చిత్రంలో ఈ జోక్ ని వాడారు ఒకచోట.

        మహాత్ముడు అతి సరళమయిన జీవనానికీ, అతి పొదుపయిన అలవాట్లకీ ప్రతీక. ఆయన కాగితానికి పొదుపుగా రెండు పక్కలా రాసేవారు. వీలయినంత వరకు పనికి వచ్చే ఏ వస్తువునయినా తిరిగి ఉపయోగించే పద్ధతిని అవలంభించేవారు. భారతదేశంలో ప్రతి భారతీయుడి వ్యక్తిగతమైన హక్కుని సమర్ఢించడానికి 1930 లో ఉప్పు సత్యాగ్రహాన్ని నిర్వహించారు బాపూ. దండీ యాత్ర ప్రపంచాన్ని నివ్వెరపోయి చూసేటట్టు చేసింది. ఏమి ఈ క్రాంత దర్శి ఉద్యమశీలం! రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం వేళ్ళతో వొణికింది. అప్పటి వైస్రాయి వేషాన్ని నాకు ప్రియమైన నటుడు సర్ జాన్ గిల్ గుడ్ "గాంధీ సినీమాలో నటించారు. బ్రిటిష్ నాయకులకు "ఉప్పు తయారు చెయ్యడంలో సందేశం అర్ధం కాలేదు! అంతకు మించి- ఆ ప్రయత్నాన్ని ఆపాలా వద్దా అన్నది బొత్తిగా వంటబట్టలేదు. కత్తి పట్టుకున్నవాడిని ఎదిరించవచ్చు. తుపాకీ పట్టుకున్న వాడిమీద కాల్పులు జరపవచ్చు. కాని సముద్ర తీరంలో నిలబడి చెంబుడు నీళ్ళతో ఉప్పు తయారు చేయబోయే ఓ 60 ఏళ్ళ ముసిలావిడని ఏం చెయ్యాలి? బ్రీటిష్ అధికారులకు అర్ధం కాలేదు. తెల్లబోయారు. అయితే దేశం నాలుగు చెరగులా ఉవ్వెత్తున లేచిన ప్రజా సందోహం ఒక చరిత్ర. ఆనాడు భారతీయుడి రక్తనాళాల్లో ప్రవహించిన విద్యుత్తు ఈ తరానికి తెలీదు. గాంధీ చిత్రంలో రవిశంకర్ తన సితార్ తో ఎంతో కొంత శృతి చేశారు. అది కేవలం ఆనాటి ఉత్తుంగ ఆవేశ తరంగానికి నమూనా.

        ఇంత చెప్పాక మహాత్ముని జ్ణాపకార్ధం చేసే కృషి ఎలాంటిదయి ఉండాలి? మొన్న ప్రపంచ ప్రఖ్యాతి గడించిన మాంట్ బ్లాంక్ కంపెనీ ఒక నివాళిని సమర్పించింది మహాత్మునికి. ఎలాగ? ఆనాడు కేవలం 14 లక్షల రూపాయలు ఖరీదు చేసే కలాన్ని విడుదల చేసింది! గాంధీ ప్రతి రోజూ తన రాట్నం మీద వొడికే సన్నటి ఖద్దరు దారం లాగ ఈ కలం చుట్టూ బంగారు తీగెను చుట్టారట. రోడియమ్ తో తయారయిన  ఈ కలం పాళీ మీద గాంధీజీ చేతికర్ర పట్టుకున్న ఆకారాన్ని ముద్రించారట. గాంధీజీ దండీ యాత్రలో 241 మైళ్ళు నడిచారు. మాంట్ బ్లాంక్ కంపెనీ సరిగ్గా 241 కలాలనే తయారు చేసిందట. ఈ కలాన్ని మహాత్ముని మనుమడు తుషార్ గాంధీ విడుదల చేశారు. ఇది కొనుక్కునే డబ్బు లేదా?  లక్షా డెబ్బైయ్ వేల ఖరీదయిన ఇంకు పెన్ను,  లక్షన్నర ఖరీదయిన బాల్ పాయింట్ కలాన్ని కొనుక్కోవచ్చు. అందుకూ స్థోమతు లేకపోతే ఆ పెన్నుని చూసి ఆనందించవచ్చు.

        ఆ రోజుల్లో మదర్ ధెరెస్సాకి అప్పటి అమెరికా అద్యక్షుడు రోనాల్డ్ రీగన్ (?) ఓ ఖరీదయిన కారుని బహూకరిస్తూ- ఆ కారుని ముక్కలు చేసి ఆమె పేదలకు పంచినా ఆశ్చర్యంలేదని అన్నారట. సరిగా ఆపనే చేసింది మదర్.

        నాకిప్పటికీ ఆలోచనకందని విషయం ఒకటుంది. ఈ 14 లక్షల పెన్నుని మహాత్ముడు చూస్తే వేరే గోడ్సే అవసరం వుండదేమోనని. అయినా ఈ పెన్నుని చెరిచి ఆయన కొన్ని వేల తకిలీలు తెప్పిస్తాడా? దూదిని కొనిపిస్తాడా? రాట్నాలు చేయిస్తాడా? అని.

        ఖరీదయిన కంపెనీ అంతకంటే విలువయిన ఏ దేశపితకు నివాళినివ్వడం చాలా హర్షించదగ్గ విషయం. సందేహం లేదు. కాని నా కనిపిస్తుంది. మాంట్ బ్లాంక్ కంపెనీ- 241 మైళ్ళు నడిచిన మహాత్మునికి నివాళిగా 241 స్థలాలలో అన్నార్తులకు అన్నదానం చేసినా, 241 జీవితాలను ఉద్ధరించే విరాళాలిచ్చినా, 241 మందికి ఉచితంగా కలాలు పంచినా, 241 కలాలతో మహాత్ముని వైభవాన్ని తెలియజెప్పే వ్యాసపోటీని నిర్వహించినా ఇంతకంటె ఘనంగా ఉండేదేమో.

        చాలా సంవత్సరాల క్రితం నాకు కాలూ చెయ్యీ విరిగి మద్రాసులో ఓ ఆసుపత్రిలో ఉన్నాను. స్పెషల్ వార్ద్ కిటీకీలోంచి- వసంతం లో పూచిన మామిడి చివుళ్ళూ, పువ్వులూ కనిపించేవి. ఏమీ తోచక పాటలు రాసాను. వాటి పేరు "ఆసుపత్రి పాటలు”. మిత్రులు పురాణం సుబ్రహ్మణ్య శర్మగారు వాటిని ఆంధ్రజ్యోతి వారపత్రికలో ప్రచురించారు.

        అందులో రెండు వాక్యాలు గుర్తుకొస్తున్నాయి.

        ఆసుపత్రిలో వసంతం

        నపుంసకుడికి రాజనర్తకి పరిష్వంగం లాంటిది.

        మహాత్ముని జన్మదినాన మాంట్ బ్లాంక్ 14 లక్షల కలమూ నాకలాగే అనిపిస్తుంది.

         

                                                             నవంబర్ 9, 2009

       ************               ************           *************          *************
    
You can mail your opinions directly to Maruthi Rao Garu at gmrsivani@gmail.com
Also meet Maruthi Rao Garu in his telugu blog gollapudimaruthirao.blogspot.com

Read all the columns from Gollapudi  గొల్లపూడి గారి మిగతా కాలంస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

KOUMUDI HomePage