విలువలకు కాలదోషం

           
       మనదేశంలో క్రికెట్‌ కేవలం వినోదం కాదు. జీవన విధానంలో ఒక భాగం. ఈసారి ఐపిఎల్‌ పోటీలు మూడోవంతు యునైటెడ్‌ ఎమిరేట్స్‌లో జరిగాయి -మన ఎన్నికల దృష్ట్యా. ఎవరయినా గుర్తించారో లేదో -అక్కడి ఆటలకీ మనదేశంలో ఆటలకీ తేడా ఉంది. అక్కడ -నిజంగా ఈ ఆటలకి అక్కరలేని, అదనంగా జతచేసిన చీర్‌ లీడర్స్‌ విన్యాసాలు -చాలా ముచ్చటగా జరిగాయి. ఆడపిల్లలందరూ వొంటినిండా బట్టలేసుకుని -ప్రేక్షకుల్ని, ఆటగాళ్లను ఆనందపరిచే పనిచేశారు. మొన్న ఈ పోటీలు మనదేశానికి దిగుమతి అయాయి. అంతే. అమ్మాయిల వొంటిమీద బట్టలు 80 శాతం లేవు. పెద్ద పెద్ద శరీరాల్ని వీధిన పడేసి, బారుల్లో తైతక్కలని స్ఫురింపజేసే వెర్రి గెంతులు మనం చూస్తున్నాం. ప్రేక్షకుల్ని ఆనందపరచడం కాక, రెచ్చగొట్టడం లక్ష్యంగా వెనుదియ్యని పెద్దశరీరాల సర్కసు ఇది.


            ఏమొచ్చింది మనదేశానికి? చిన్న దేశాలు చూపగల అభిరుచి, నియతి, ఆరోగ్యకరమైన ఆనందాన్ని చూపలేని అభిరుచి దారిద్య్రం, ఆకర్షణకి వెంపర్లాట. సంస్కృతికి శతాబ్దాల చరిత్ర ఉన్నదని బోరవిరుచుకునే ఈ దేశంలో పిల్లా పెద్దా చూస్తున్న జీవితంలో ఒక భాగమైన ఈ ఆట ఇంత బరితెగించి వీధినపడాలా? ఎవరూ గుర్తించడం లేదా? నేను బొత్తిగా సనాతనంగా, కిందటి శతాబ్దపు మనిషిగా మాట్లాడుతున్నానా? సంవత్సరాల కిందట మాలే దేశం వెళ్లాను. అది రంజాన్‌ మాసం. ముస్లింలకు అతి పవిత్రమైన సమయం. ఎయిర్‌ పోర్టులో దిగగానే హెచ్చరించారు. 'అయ్యా, ఇక్కడ పగలు బహిరంగంగా మంచినీళ్లు కూడా తాగకూడదు'' అన్నారు. విదేశీ యాత్రికులకు -మా హోటళ్లలో మందుని ఏర్పాటు చేశారు. అయితే గదిదాటి బయటికి రాకూడదని ఆంక్ష. ఇది సబవైన, ఆ దేశం ఏర్పరుచుకున్న విలువలకు ప్రతీక.


               చాలా సంవత్సరాల కిందట పాట్నా వెళ్లాను. రోడ్డుమీద నడిచే ప్రతీ ఆడపిల్లా తలచుట్టూ ఓ పరదా చుట్టుకుంది. ముక్కు, చెవులు, నోరు, తల అన్నీ ఆ ముసుగు వెనుక. ఒక్క కళ్లే కనిపిస్తున్నాయి. ఇదేమిటి? అన్నాను మా మిత్రుడితో. ఇది ఇక్కడి ధోరణి -అన్నాడు క్లుప్తంగా. ఆ మధ్య ఓ మునిసిపల్‌ కమిషనర్‌ వచ్చారట. ఆడపిల్లలు ఇలా గుడ్డలు చుట్టుకోకూడదని, అపాయం వస్తే గుర్తు పట్టలేక రక్షణకి భంగమని, వెంటనే తీసెయ్యాలని ఆర్డరు వేశాడట. అంతే. మిన్ను విరిగి మీదపడింది. ''మమ్మల్ని ఆపడానికి నువ్వెవరు? మేం టెర్రరిస్టులనుకుంటున్నావా? మా స్వేచ్ఛని కాదనే హక్కు నీకెవరిచ్చారు? ఆర్డరు ఉపసంహరించుకోకపోతే కోర్టుకి వెళ్తాం'' అని హుంకరించారట. ఇదేమిటి? పెద్దలు, తల్లిదండ్రులు మాట్లాడరేం? అని వాపోయి, నాకెందుకులే అని సమాధానం పడి బదిలీ అయాక వెళ్లిపోటాడట. ఇప్పుడీ వికారం మన రాష్ట్రానికీ వచ్చింది. మంచి విలువని అలవరించుకోడానికి దశాబ్దాలు పడుతుంది. జబ్బుని కొనితెచ్చుకోడానికి క్షణం చాలు.


             బాధ్యతగల పెద్దమనిషిగా నా అనుభవం చెప్తున్నాను. ఆ మధ్య హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని అంబేద్కర్‌ విశ్వవిద్యాలయం పక్కనుంచి వస్తున్నాను. ఓ అబ్బాయి, అమ్మాయి మధ్యాహ్నం పక్కనే ఉన్న పార్కులోంచి వస్తున్నారు -కులాసాగా. బయటికి వచ్చాక -ఆ అమ్మాయి -తలచుట్టూ గుడ్డ చుట్టుకుని తన స్కూటర్‌ ఎక్కివెళ్లిపోయింది. ఇది తలకే కాదు అవినీతికి ముసుగు, ఒక అవకాశం, ఒక సాకు అయే, అవుతున్న, అవడానికే తలపెట్టిన 'దొంగస్వేచ్ఛ' అనిపిస్తుంది.


             ఈ తరం ఆడపిల్లలు తమ సామర్థ్యంతో పదవుల్ని సంపాదించుకుని, పదిమంది మధ్యకీ వచ్చి, మగవారికి దీటుగా తమ ఉనికినీ, ఆధిక్యాన్నీ గర్వంగా చాటుకునే రోజులు. మా చిన్నతనంలో కన్నా -ఆఫీసుల్లో, కాలేజీల్లో స్వేచ్ఛగా తిరిగే ఆడపిల్లలు ఈ జాతి ప్రగతికి సంకేతాలు. మధ్యలో ఈ ముసుగులేమిటి? బురఖా మతపరంగా నియమం ఉన్నవారే దాన్ని వదులుకుని తమ విశృంఖలత్వాన్ని చాటుతున్నారు. ఇరాన్‌ వంటి దేశాలలో నౌషీన్‌ అహ్మదీ, ఫతేమా కరోబీ వంటివారు, నిన్నకాక మొన్న తాలిబన్లకు ధైర్యంగా ఎదురునిల్చిన యూసఫ్‌ జాయ్‌ మలాలా వంటివారు ప్రపంచాన్ని దిగ్భ్రాంతుల్ని చేస్తున్నారు. మనవాళ్లు -దరిద్రపు కారణాలకి ముసుగులవెనుక మాయమౌతున్నారు.

       ఆ మధ్య ఓ సిగ్నల్‌ దగ్గర నా కారు ఆగింది. నా పక్కనే ఓ ముసుగు అమ్మాయి స్కూటర్‌ ఆగింది. నన్ను చూస్తూనే ఆ అమ్మాయి కళ్లు పెద్దవయ్యాయి. ''నన్ను గుర్తుపట్టి ఆనందిస్తున్నావా? పళ్లు కొరుకుతున్నావా?'' అని అడిగాను. గుడ్డ వెనక నుంచే ''నేను మీ ఫాన్‌ని సార్‌!'' అంది. ఆకుపచ్చ దీపం వచ్చేలోగా ఆ అమ్మాయిని అడిగాను: 'ఏమమ్మా, రెండు చెవులు, రెండు ముక్కుపుటాలు, ఒక నోరు, చుట్టూ ఉన్న అవయవాలన్నీ మూసేసుకున్నావు. మంచిదే. మరి చూడడానికి రెండు కళ్లెందుకమ్మా? ఒక్కటి చాలదా? ఇదీ ఒకటి మూసేస్తే బాగుంటుంది కదా?'' అన్నాను. ఆ అమ్మాయి -నవ్వి -నాలాంటి తండ్రో, తాతో, మునిసిపల్‌ కమిషనరో లేనందుకు ఆనందంగా నిష్క్రమించింది.

      సభ్యతకీ ఆధునికతకీ సంబంధం లేదు. ఒకదానికొకటి చుక్కెదురూ కాదు. వ్యక్తిగతమైన స్వేచ్ఛకీ, వ్యక్తి ఇష్టాయిష్టాలకీ మనం బతికే సమాజంలో వాటా ఉంది. నలుగురి మధ్యా గోచీ లేకుండా నడవడం స్వేచ్ఛ అనిపించుకోదు. అలాగే అక్కరలేని, అర్థంలేని ముసుగు -వ్యక్తి విలువల దుబారాగా కనిపిస్తుందే తప్ప హుందాతనాన్ని పెంచదు. కాగా శతాబ్దాలుగా లేని వికారానికి ఇప్పుడు కారణం ఎలా వెదకగలం? పోనీ, మగ పశువులబారినుంచి తమని కాపాడుకోడానికి 'నిర్భయ' కాకుండా ఈ ముసుగు అంటారా? పశువుల్ని ముసుగులు ఆపవు.


        ఈ సమాజంలో ఆలోచనా ధోరణిలో మార్పు రావాలి. వ్యవస్థ ఆడపిల్లకి దీటుగా నిలబడాలి. ఐపిఎల్‌ వంటి క్రీడ మనకి ఆనందదాయకమే. ఆనందిద్దాం. కాని మన విలువల్ని తాకట్టు పెట్టి దాన్ని బూతు దృశ్యం చేయనక్కరలేదు. దానికి కొన్ని రోజుల ముందు -యూఏయీ జరిపి చూపిన విధానమే సాక్ష్యం. సగం బట్టలతో, బారుల్లో వొళ్లు విరుచుకునే హంగులతో -తైతక్కలాడే శరీరాలు మన అభిరుచికీ, ఆనందానికీ దర్పణాలు కానేరవు. నేను ప్రమోద్‌ ముతాలిక్‌ ధోరణిలో మాట్లాడడం లేదు. ప్రమోదానికి అభిరుచి దారిద్య్రం దగ్గర తోవకాదని హెచ్చరించడమే నా లక్ష్యం. ఏమయినా -తక్కువ వ్యవధిలో తమ విలువలకు రాజీపడని యూఏయీ దేశాల సంప్రదాయానికి మనస్ఫూర్తిగా అభినందనలు పలుకుతున్నారు.
    


      gmrsivani@gmail.com   
           మే 26,   2014          

*************

Read all the columns from Gollapudi  గొల్లపూడి గారి మిగతా కాలంస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 


KOUMUDI HomePage