అమ్మ

           
            దేశాల మధ్య దౌత్య సంబంధాలలో ఇంతవరకూ క్రికెట్‌, బస్సుయాత్ర, మసీదుల సందర్శన ముఖ్యపాత్ర వహించాయి. ఇప్పుడిప్పుడు మరో కొత్త అంశం చోటుచేసుకుంది. అమ్మ, ఆయా ప్రయత్నాలలో సంబంధాలు మెరుగుపడలేదు కాని -అమ్మ ఆ పనిని నిర్దుష్టంగా చేయగలదని నా నమ్మకం. పాకిస్థాన్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ కాశ్మీరు సమస్యకి దగ్గర తోవని అద్భుతంగా సూచించినా ఇంత ఆనందం రాదు. ఆయన అంతకంటే గొప్పపనే చేశారు. నరేంద్రమోడీ 95 ఏళ్ల తల్లికి తెల్లని చీరెని కానుకగా పంపారు. నవాజ్‌ షరీఫ్‌ గారు అంతకు ముందు ఇండియా వచ్చినప్పుడు నరేంద్రమోడీ మంచి దుశ్శాలువాని ఆయన తల్లికి బహూకరించారు. ''మానాన్న స్వయంగా ఆ శాలువాను మా నాయనమ్మకి ఇచ్చారు. ఆమె చాలా ఆనందించింది'' అంటూ నవాజ్‌ షరీఫ్‌ కూతురు మర్యాం ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు.
                   అంతకుముందు నరేంద్రమోడీ ఎన్నికలలో విజయం సాధించాక -తల్లి దగ్గరికి వెళ్లినప్పుడు హీరాబెన్‌ కొడుక్కి మిఠాయిని తినిపించడం చూసి నవాబ్‌ షరీఫ్‌ తల్లి షమీమ్‌ అఖ్తర్‌ ఆనందపడిపోయిందట. ఊహించని విషయం నవాజ్‌ షరీఫ్‌ని నరేంద్రమోడీ తన ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించడం. ఇంకా ఊహించని విషయం -మోడీ నవాజ్‌ షరీఫ్‌ తల్లికి శాలువాని బహూకరించడం.
                ఈ విషయాలు వినడానికీ, చెప్పుకోడానికీ చాలా ముచ్చటగా ఉంటాయి. మోడీలో పరిపాలనా దక్షతని పక్కన పెడితే ఎప్పటికప్పుడు ఆయన నిలబడిన నేలని మరిచిపోకపోవడం, ఒక మనిషిగా ప్రవర్తించడం నాకు ఆయన్ని మనిషిగా గుర్తుపట్టడానికి రుజువుల్ని సూచిస్తుంది. ఉదాహరణకి మొన్న పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగంపై స్పందనకి సమాధానం చెప్పడానికి నిలబడిన ప్రధాని మోడీ ''మొట్టమొదటి సారిగా పార్లమెంటులో నోరు విప్పుతున్నాను. నాకంటే అనుభవంలో, వయస్సులో ఎందరో పెద్దలు ఈ సభలో ఉన్నారు. నా మాటలో ఏదైనా తప్పిదం ఉంటే క్షమించండి'' అంటూ మొదలెట్టారు. నాకు తెలిసి ఏ దేశంలోనూ, ఏ దేశ నాయకుడూ ఈ మాటని అనలేదు. ఒక నాయకుడు వ్యక్తిగా తన పరిమితిని గుర్తుపెట్టుకోవడం, దానిని ఒప్పుకోవడం ఆతని పెద్దరికానికి, ఔన్నత్యానికీ గుర్తు. ''మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమనే అర్థమందులో ఉంది''.
           మళ్ళీ కథకి వస్తే -దేశాలు తమ మధ్య ఒప్పందాన్ని నోటి మాటతో, కొండొకచో తుపాకులతో ప్రయత్నిస్తారు కాని -మరో బలమైన ఆయుధం తమ చేతుల్లో ఉన్నదని మరిచిపోతున్నారు. దాని పేరు -అమ్మ. ఈ ప్రపంచంలో ఈ ఆయుధానికి లొంగనివారు ఇంకా పుట్టలేదు. సృష్టిలో మరే శక్తికీ, వ్యక్తికీ లేని, సాధ్యంకాని బంధుత్వం ఒక్క అమ్మతోనే ఉంది. కడుపులో మాంసం ముద్దకి ప్రాణం పోసి, తను తిని ఆ బిడ్డకి ఆయువునిచ్చి ఈ భూమిమీదకు తెచ్చాక కూడా పసిగుడ్డుతో బంధుత్వం తల్లికిపోదు. తల్లినీ బిడ్డనీ తల్లిపేగు ఇంకా ముడివేసే ఉంచుతుంది. తల్లినుంచి బలవంతంగా విడదీశాకే ఆ మనిషి ఉనికి ప్రారంభం. అందుకనే ఈ సృష్టిలో అన్నిటినీ పరిత్యజించిన సన్యాసికి కూడా తను ఈ జన్మలో తీర్చుకోలేని రుణం ఒక్కటి ఉండిపోతుందట. అది తల్లిరుణం. అందుకే సన్యాసికి అందరూ మోకరిల్లాలి. కాని అతనూ మోకరిల్లే శక్తి -తల్లి. ఈ దేశంలో ఆదిశంకరులు మొదటి విప్లవకారులు. సర్వసంగపరిత్యాగి అయిన సన్యాసికి అర్హత లేదని తెలిసికూడా తల్లికి కర్మని నిర్వహించిన గొప్ప వ్యక్తి. ఇంతకంటే తల్లికి గొప్ప కితాబు లేదు.
                       దేశనాయకుల, మహానుభావుల గొప్పతనాన్ని ఒక్కక్షణం పక్కన పెడితే -వాళ్లని మనతో మన స్థాయికి నిలపగల గొప్పశక్తి -తల్లి. రెండు దేశాల నాయకులు తాము ప్రేమించే ఇద్దరు తల్లుల గురించి పలకరించుకోవడం విని ఎన్నాళ్లయింది?
                   చరిత్రలో కొందరు నియంతలు కూడా తల్లి ముందు తలవొంచిన సందర్భాలు ఉన్నాయి. మొదటి ప్రపంచ యుద్ధంలో ఎన్నో విజయాల్ని మూటగట్టుకుని తిరిగివచ్చిన నెపోలియన్‌ అవసాన దశలో ఉన్న తన తల్లి పక్కన కూర్చున్నాడు. ఆమె చేతులు పట్టుకుని: 'అమ్మా, నువ్వు బతకాలి. ఈ ప్రపంచం నన్ను నా పేరుతో పిలవడం మరిచిపోయింది అప్పుడే. నువ్వు వెళ్లిపోతే నన్ను నా పేరుతో పిలిచే ఒక్క వ్యక్తిని నష్టపోతాను'' అన్నాడు.
             కన్నీటికి కొత్త భాష్యాన్ని చెప్పిన మహానటుడు చార్లీ చాప్లిన్‌ జీవితంలో ఆరోయేట స్టేజి ఎక్కడానికి కారణం నీరసంతో గొంతు చెడిన తల్లిని తాగుబోతులు ఎకసక్కేం చేస్తూండగా కాపాడడానికి. ఆ రోజుల్లోనే అయిదు పౌన్లు సంపాదించిన అతన్ని చూసి తల్లి అన్న మొదటివాక్యం ఎప్పుడూ మరిచిపోలేదు. 'అవసరమైనప్పుడు నాకు కప్పు టీ ఇచ్చివుంటే నేనిక్కడకి వచ్చేదాన్ని కాదు' అంది గుండు చేయించుకుని మెంటల్‌ ఆసుపత్రిలో చేరిన ఆ తల్లి. కృత్రిమమైన జీవితానికి, విలువలకి అద్దం పట్టే హాలీవుడ్‌లో -ప్రపంచంలోకల్లా ఖరీదయిన నర్సింగ్‌ హోంలో మతిస్థిమితం లేని దశలో ఆ తల్లి వెళ్లిపోయింది. చాప్లిన్‌ పసిబిడ్డలాగ ఏడ్చాడు -ప్రపంచాన్ని కన్నీళ్లతో నవ్వించిన ఓ గొప్ప తత్వవేత్త.
             ప్రహ్లాదుడు ప్రహ్లాదుడు కావడానికి కారణం తల్లికడుపులో ఉండగా నారదుని భక్తిబోధ. విచిత్రం ఏమిటంటే నరసింహావతారం అనూహ్యమైన రౌద్రావతారం కాదు. ప్రహ్లాదుడనే పసివాడిమీద భగవంతుడి కరుణ ఆ అవతారానికి స్ఫూర్తి. అందుకనే భగవంతుడి అపారమైన కరుణని కోరుకునే భక్తులు నరసింహుడిని ఆశ్రయిస్తారు -ఆది శంకరులతోసహా. శ్రీరాముడు ఆదర్శమూర్తి. శ్రీకృష్ణుడు ఆచార్యుడు. నరసింహుడు ఆశ్రయమూర్తి. 'యోగీశ శాశ్వత శరణ్య భవాబ్దిపోత, లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్‌''.
             51 సంవత్సరాలు సినీమాలతో సంబంధం ఉన్నవాడిగా అమ్మ ప్రసక్తి వచ్చిన -అమ్మని ఆకాశంలో నిలబెట్టిన ఏ సినీమా ప్రేక్షకుల ఆదరణ పొందకుండా మిగలలేదు. వెంటనే గుర్తుకొచ్చే సన్నివేశం -దీవార్‌ సినీమా. తమ్ముడి ఎదుట గర్వంగా నిలబడిన హీరో ''నా దగ్గర కోట్లు వున్నాయి. భవంతులున్నాయి, అధికారం ఉంది, అవకాశం ఉంది. ఏముంది నీదగ్గర?'' అని తమ్ముడిని నిలదీస్తాడు.
          తమ్ముడు అతి సరళంగా, హుందాగా సమాధానం చెప్తాడు: ''నా దగ్గర అమ్మ ఉంది'' అని. దీవార్‌లో గ్లామర్‌ని, వ్యాపార విలువల్ని ఈ ఒక్క వాక్యంతో బేరీజు వేశారు -స్క్రీన్‌ప్లే రచయితలు.
            ప్రపంచ ప్రఖ్యాత నాయకులు అబ్రహాం లింకన్‌ అన్నారు: ''నేను మా అమ్మ నా కోసం చేసిన ప్రార్థనల్ని ఏనాడూ మరిచిపోలేదు. జీవితమంతా అవి నాకు తోడుగా నిలుస్తూనే ఉన్నాయి'' అని.

    


      gmrsivani@gmail.com   
           జూన్ 16,   2014          

*************

Read all the columns from Gollapudi  గొల్లపూడి గారి మిగతా కాలంస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 


KOUMUDI HomePage