మదర్ మమతా

               
       కిందటి వారం ఒక్కరోజు కలకత్తాలో ఉండడం తటస్థించింది. ఆ 24 గంటలూ రాజకీయవాతావరణం అక్కడ అట్టుడికినట్టు ఉడికిపోయింది. కారణం -తృణమూల్‌ కాంగ్రెస్‌ రాజకీయనాయకుడు, (నేనూ సిగ్గుతో తలవొంచుకోవలసిన కారణం) సినీనటుడు తపస్‌ పాల్‌ తన పార్టీ కార్యకర్తలను ఎదిరించే వారిళ్లకు తమ కార్యకర్తల్ని పంపించి వాళ్ల భార్యల్ని రేప్‌ చేయిస్తామని ఒక బహిరంగ సభలో పేర్కొన్నారు. సభలో ఉన్న తృణమూల్‌ కాంగ్రెస్‌వారంతా ఆనందంతో కితకితలు పెట్టినట్టు సంతోషించారు. నినాదాలు చేశారు. పొంగిపోయారు. అంతే. మిన్ను విరిగి మీదపడింది. అందరూ ఒక్కసారిగా తపస్‌ పాల్‌ మీద కత్తులు దూశారు.
             ఇంతకుముందు కూడా ఈ ఘనుడు ఇలాంటి సూచనలు తమ పార్టీ కార్యకర్తలకు ఇచ్చాడు. తమ పార్టీ వారిమీద ఎవరు ఎదిరించినా వారి పీకలు తెగగోయమని ఈయన లోగడ సలహాలిచ్చారు.
              అయితే ఇలాంటి అరాచకాలు తృణమూల్‌ కాంగ్రెస్‌వారికి వెన్నతో పెట్టిన విద్య. ఉదాహరణకి మరికొందరు తృణమూల్‌ మహానుభావుల ఉవాచలు విందాం:
       ''మా అమ్మ, నాయకురాలు మమతా బెనర్జీ మీద ఎవరు చెయ్యెత్తినా మేం ఆ చేతిని నిర్దాక్షిణ్యంగా నరుకుతాం'' -మణిరుల్‌ ఇస్లాం.
         ''కాంగ్రెస్‌ కార్యకర్తలు మా పార్టీ పోస్టర్లని, మమతా బెనర్జీ పోస్టర్లని చించితే -వారి చేతులు నరుకుతాం. రాత్రి వారి ఇళ్లమీద దాడి చేస్తాం'' -జ్యోతిప్రియ మల్లిక్‌.
       ''మిమ్మల్ని ఎవరు ఎదిరించినా వాళ్లని అడ్డంగా నరకండి. మీ సంగతి నేను చూసుకుంటాను'' -అనూప్‌ చక్రవర్తి.
        అయితే ఈ కాలమ్‌ ఉద్దేశం ఇలాంటి నాయకుల అరాచకం కాదు. ఈ అరాచకానికి ఆ పార్టీ నాయకురాలు, రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందనని ఉటంకించడానికి. ''మేం హత్యలు, అసభ్యతల్ని ఎప్పుడూ ఖండిస్తాం'' అంటూనే ఇంకా రెచ్చిపోయే విమర్శకుల పట్ల కోపంతో: ''నన్నేం చెయ్యమంటారు? అతన్ని చంపెయ్యమంటారా?'' అని విసుక్కున్నారు. బహుశా ఈ దేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడూ ఇలా స్పందించలేదేమో! ఇదీ గొప్ప రాజకీయజ్ఞతకు నిదర్శనం.
          నిన్న ఒక పత్రికలో ఒక కాలేజీ అమ్మాయి ఈ ఘనత వహించిన ముఖ్యమంత్రిగారికి బహిరంగ లేఖ రాస్తూ మమతా బెనర్జీ అన్నమాట జూనియర్‌ స్కూలులో తన బిడ్డ పక్క కుర్రాడి కేరేజీలో అన్నం దొంగతనం చేస్తే తల్లి అనే మాటల్ని గుర్తుచేశాయన్నారు. ''నేను పదేళ్లు కలకత్తా రోడ్లమీద కాలేజీకి నడిచాను. ఎవరయినా కుర్రాడు అత్యాచారం చేస్తే మీ పోలీసులు ''చీకటి పడ్డాక రోడ్డుమీద ఎందుకు నడుస్తున్నావు?'' అని అడుగుతారు. మీరయితే ''నగరంలో అందరు ఆడపిల్లలకూ మానభంగం జరగలేదు కదా?'' అని సెలవిచ్చారు. తమకు ఈ నాయకుల అరాచకాలు -సరిపెట్టుకోవలసిన కుర్రచేష్టలుగా కనిపిస్తాయి. కాని తమ హయాంలో తమ పార్టీలో తపస్‌ పాల్‌ వంటి లక్షలాది కార్యకర్తలున్నారు'' -యివీ ఆ అమ్మాయి మాటలు.
            మూర్తీభవించిన మాతృమూర్తి మమతా బెనర్జీ. పక్క పార్టీల పెళ్లాల్ని మనషుల్ని పెట్టి రేప్‌ చేయించే తమ నాయకుల ప్రవర్తన -క్షమాపణతో సరిపెట్టుకోగలిగిన ఆకతాయితనం కిందే సరిపెట్టుకొనే ఔదార్యం ఆ తల్లిది. ఇలాంటి సందర్భాలను మీడియా ఆమెకు తెలియజేసినప్పుడు -మమతా ఎక్కడలేని విసుగుదలను చూపిస్తారు. ఇలాంటి చిన్న విషయాలను ఎత్తిచూపే పాత్రికేయుల లేకితనాన్ని గర్హిస్తారు. కోపం తెచ్చుకుంటారు. మూతి విరుస్తారు. ఒకానొక బహిరంగ సభలో ఇలాంటి ప్రవర్తన పట్ల ఆమె మాటలు: ''వీళ్లంతా కుర్రాళ్లు. అప్పుడప్పుడు ఈ కుర్రాళ్లు పెంకితనం చేస్తారు'' అన్నారు. కాని అమ్మా! రేపు మీ కార్యకర్తలు మీరు ఉదారంగా సరిపెట్టుకున్న చర్యల్ని ఆయా పార్టీల ఇళ్లకు వెళ్లి చేస్తే న్యాయస్థానం కరెక్టుగా ఆ శిక్షనే విధిస్తుంది. చంపెయ్యమంటుంది.
          చంపెయ్యమంటారా? అనే విసుగుదల ఆ నేరస్థులను ఏమీ చెయ్యలేని నిస్సహాయతకు చిహ్నమా? లేక తన చేతకానితనానికా? మంత్రిగా ఉంటూ లక్షా డెబ్బై అయిదు వేల కోట్లు దోచుకున్న అవినీతి పరుడు ఏ. రాజాని కరుణానిధిగారు ఏం చెయ్యాలి? చంపెయ్యాలా? పాపం వారాపని చెయ్యలేదు. మరొకసారి పార్టీ టిక్కెట్టు ఇచ్చి ఎన్నికలలో నిలబెట్టారు.
        కామన్వెల్తు ఉత్సవాల్లో కోట్లు ఫలహారం చేసిన సురేష్‌ కల్మాడీని ఎవరు చంపేశారు? అక్క చెల్లెళ్లను మానభంగం చేసి, చంపి, చెట్లకు వేలాడ దీసిన పెద్ద మనుషుల్ని ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ఏం చేసింది?
        ఉదారంగా ఇలాంటి దారుణమయిన కూతలు కూసే నాయకుల్ని అక్కున చేర్చుకునే ముఖ్యమంత్రి అలుసుని చూసు కుని -ఈ కాలేజీ అమ్మాయి అన్నమాట: ''తమ నాయకురాలి అండతో రేపు కాలేజీ నుంచి ఇంటికెళ్లే అమ్మాయిని ధైర్యంగా రేప్‌ చేసే సంస్కారాన్ని మీ పార్టీ పెంచుకుంటుంది. అయితే ప్రతిపక్షాల భార్యల్ని రేప్‌ చెయ్యమని చెప్పే తపస్‌ పాల్‌ నాకు పీడకల కాదు. కాని అతని మాటలకు ఆనందంతో విర్రవీగే ప్రేక్షక కార్యకర్తల రేపటి వీరంగం తలుచుకుంటే నాకు వణుకుపుడుతోంది. నాయకుల విచక్షణ ఎంతోకొంత శ్రీరామరక్ష. కాని నేలబారు కార్య కర్తకు తమ నాయకురాలి అలసత్వం పైశాచికమైన ఆయుధం'' అంది. అందుకే భగవద్గీతా కారుడు: ''యద్యదాచరతి శ్రేష్ట:'' అని హెచ్చరించాడు.
          మనతా బెనర్జీకి నా సవినయమైన మనవి: తప్పమ్మా. అలాంటి 'నీతి' పరుల్ని చంపడం మహాపాపం. వాళ్ల పాదాలు కడిగి, పూజగదుల్లో ప్రతిష్టించి -యింత ఘనత సాధించినందుకు భజనలు చేయండి. వారిని ఎదిరించినవారిని చంపండి. సాధికారికంగా రేపులు చేసే విభాగాన్ని ఏర్పాటు చెయ్యండి. మీలాంటి నాయకుల్ని ఎన్నుకున్న ప్రజానీకానికి ఆమాత్రపు బుద్ధి చెప్పేహక్కు మీకుంది. తమవంటి నాయకత్వం నుంచి ఇంతకన్న గొప్ప నిర్వాకాన్ని ఆశించే హక్కు ప్రజలకు లేదు.
           విమానం ఆకాశంలోకి ఎగురుతూండగా -నా అదృష్టవశాత్తూ నేను ఈ దేశంలో పశ్చిమ బెంగాలు, ఉత్తరప్రదేశ్‌, బీహార్‌లోలేనందుకు భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నాను.
  


      gmrsivani@gmail.com   
           జూలై 07,   2014          

*************

Read all the columns from Gollapudi  గొల్లపూడి గారి మిగతా కాలంస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 


KOUMUDI HomePage