ఓ చరిత్రకి తెర

         

             ఓ గొప్ప చరిత్రకి తెరపడింది. దాదాపు ఆరు దశాబ్దాలు చిరునవ్వుకీ, చిత్తశుద్ధికీ, రమ్యతకీ, నవ్యతకీ, తెలుగుదనానికీ, వెలుగుదనానికీ, భక్తికీ, రక్తికీ చిరునామాగా నిలిచిన ఇద్దరు జీనియస్‌లు -బాపూ, ముళ్లపూడి శకం ముగిసింది. ఈ తరంలో బహుశా ఇంత విస్తృతంగా, ఇంత గొప్పగా తెలుగుదేశాన్ని ప్రభావితం చేసిన జంట మరొకటి లేదేమో!
            విచిత్రమేమంటె ఇద్దరూ అంతర్ముఖులు. కాని వారి వృత్తి బాహిర ప్రపంచాన్ని ఆనందపరచడం. మరొక్క సందర్భమే గుర్తుకొస్తుంది. తన ప్రతిభతో, వ్యుత్పత్తితో చిత్రసీమలో అగ్రస్థానాన్ని నిలిచిన అమెరికన్‌ దర్శకుడు స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌కి పదిమంది మధ్యలో ఉండాలంటే బెరుకుగా ఉంటుందట. అందుకని హోటల్లో గదిలో కూర్చుని టీవీలో షాట్‌ని చూస్తూ మైక్‌ పట్టుకుని చిత్రానికి దర్శకత్వం వహిస్తారని ఎవరో చెప్పారు. ఇదెంత నిజమో తెలియదు.
                54 సంవత్సరాల కిందట చిత్తూరులో ఆంధ్రప్రభ దినపత్రికలో పనిచేసేవాడిని. అప్పుడు నాకు 21 సంవత్సరాలు. ఇంకా పెళ్లికాలేదు. వారపత్రికని బుద్ధవరపు చిన కామరాజుగారు చూసేవారు. ఆనాటి ఆంధ్రప్రభ ప్రత్యేక ఆకర్షణ అందులో వచ్చేరచనల కంటే ఆ రచనలకు బాపూ బొమ్మలు. బాపూ నుంచి వచ్చే బంగీని కామరాజుగారు విప్పుతూంటే మేమంతా ఊపిరి బిగబట్టి ఎదురుచూసేవాళ్లం -ఆ బంగీలోంచి ఏ అపురూప దృశ్యాలు బయటపడతాయా అని. బాపూ 65 సంవత్సరాలపాటు ఇలాంటి అభిమానుల ఆసక్తిని ఏనాడూ భంగపరచలేదు. ఎప్పుడూ తనని తాను జయించుకుంటూ కొత్తదనాన్ని ఆవిష్కరించుకుంటూ ముందుకుసాగారు.
                   ఆనాటి కుర్ర రచయితల -ముఖ్యంగా నాకల నా కథకి బాపూచేత బొమ్మ వేయించుకోవాలని. కారణం బాపూ కేవలం కథకి బొమ్మవేయడు. బొమ్మతో కథని సమీక్షిస్తాడు. తన అభినివేశంతో కథని మరో మెట్టు పైని నిలబెడతాడు. బాపూ చిత్రాలు జీవితానికి అద్దం పట్టవు. జీవితాన్ని సమీక్షిస్తాయి. ఎప్పుడూ కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తాయి.
            తరువాత నావి ఎన్ని రచనలు ఆ అదృష్టాన్ని నోచుకున్నాయో! నా నిదురపోయే సెలయేరు కథ బాపూ సెంటర్‌ స్ప్రెడ్‌ బొమ్మకి నోచుకున్న కారణానికే నా అభిమాన కథ. తరువాత నా నవలలు ఎన్నింటికో ముఖ చిత్రాలు వేశారు. కథల్ని పైమెట్లెక్కించారు. ఆ మధ్యనా ఆత్మకథకి ప్రత్యేకంగా రంగుల చిత్రం వేసి ఆశీర్వదించారు.
                 చిత్రలేఖనం కళ అయితే బాపూగారిది మరింత ఉన్నతమయిన కళ. కుంచెతో రేఖల్ని అతి పొదుపుగా ఉపయోగిస్తూ అతి సాంద్రమైన దృశ్యాన్ని కళ్లకు గట్టే అరుదయిన ప్రతిభ బాపూగారిది. ఇన్ని తక్కువ రేఖలతో ఇంత అద్భుతంగా రూపుదిద్దవచ్చా అని ఆశ్చర్యపోతూ, ఆనందించే పార్శ్వం ఆయన అభిమానులది.
                  మరొక గొప్ప ప్రతిభ. వ్రాసే వాక్యంలో వేసే బొమ్మలో ఆవ్యక్తి రూపమేకాక, ఆ వ్యక్తి మనోభావమూ, కులమూ ప్రతిఫలించడం మరో గొప్ప కోణం. ఇలాంటి పని చెయ్యగలవారు నాకు ముగ్గురే కనిపిస్తారు. గురజాడ అప్పారావు, శివాజీ గణేశన్‌, బాపూ. కన్యాశుల్కంలో బ్రాహ్మణ్యంలో వెలనాటి, నియోగి తారతమ్యాన్ని సంభాషణల్లో కళ్లకు కట్టినట్టుచూపిన ఘనత గురజాడది. శివాజీ గణేశన్‌ కల్లుపనివారి కులం. ఆయన శ్రీవైష్ణవుడి వేషాన్ని పరీక్షిక్కు నేరమాచ్చి సినీమాలో చూసి పులకించాను. సముద్రంలో స్నానం చేసి, తడి ఉత్తరీయాన్ని పిడిచి భుజం మీద వేసుకుని కెమెరా వేపు నడిచివచ్చే శ్రీవైష్ణవుడిని చూస్తూ ఆ మహా కళాకారునికి నివాళులర్పించాను. నా నవల సాయంకాలమైంది ముఖ చిత్రంలో అలతిరేఖల్లో శ్రీవైష్ణవానికి మూర్తి కట్టిన అపూర్వ ప్రతిభ బాపూది. ఇది కేవలం వారి ఆలోచనా నైశిత్యానికేకాక,చిత్ర రచనా కౌశలానికి కలికితురాయి.
                    మంచి రచన -బాపూని రెచ్చగొడుతుంది. దానికి తనదైన కొత్తదనాన్ని జతచేయడానికి ఆయన ప్రతిభ రెచ్చిపోతుంది. ముళ్లపూడి -బాపూ బాంధవ్యం తెలుగుదనం రుచి మరిగిన ఎవరికయినా విడదీయలేని జంట. రమణ ఆలోచనని బాపూ బొమ్మ ఉద్దీపన చేస్తుందో, బాపూ రేఖలకు రమణ ఆలోచన స్పూర్తినిస్తుందో ఒక జీవితకాలం పాటు ఎవరికీ అందకుండా పెనవేసుకుపోయిన జీనియస్‌ వారిద్దరిదీ. బాపూ ఫ్రేమ్స్‌ మాట్లాడుతాయి. ఆయన దృశ్యానికి నోరుంది. వినే చెవులుంటే ఆయన చిత్రాలు పలకరిస్తాయి. బాక్సాఫీసులో ఆయన చిత్రాలన్నీ డబ్బుల డబ్బాలు నింపకపోవచ్చు. కాని ఆయన చిత్రాలకు ఎదురుచూసి, తప్పక మురిసిపోయే అభిమానులు ప్రపంచమంతా ఉన్నారు.
               బాపూ రమణలు శ్రీరామభక్తులు. రామాయణం అంతటినీ దృశ్యమానం చేసిన పుణ్యం ఒక్క బాపూకే దక్కుతుంది. ఆ మధ్య రమణగారు వెళ్లిపోయాక ఎవరో బాపూగారిని కెమెరాముందు కూర్చోపెట్టగలిగారు.
               రమణగారి స్క్రీన్‌ప్లేలో గొప్పతనాన్ని చెప్తూ త్యాగయ్యలో ఒక సన్నివేశాన్ని వివరించారు ఆయన. శ్రీరాముడు, సీతమ్మ త్యాగయ్య ఇంటికి వచ్చారు. కిరీటాన్ని ధరించిన స్వామికి ఆ ఇంటి తలుపులు కురచ అయ్యాయి. కిరీటం గుమ్మానికి తగులుతుందేమో! స్వామి ఆగారు.  వొంగబోయారు స్వామి. త్యాగయ్య హెచ్చరికగా రారా హే రామచంద్రా అని కీర్తన ఎత్తుకున్నారు. ఈ దృశ్యం రమణగారి ఊహ. ఆ మాటని చెప్తూంటే బాపూగారి గొంతు గాద్గదికమయింది.

         బాపూ భక్తి పౌరవశ్యానికి తార్కాణంగా మరొక చిత్రం ఎప్పుడూ నా మనస్సులో కదులుతూంటుంది. శ్రీరామచంద్రుడు అమ్మవారి పాదాన్ని వొళ్లో పెట్టుకుని కుంచెతో పారాణిని అలంకరిస్తున్నాడు -అనురాగపూర్వకంగా. స్వామి పాదాల దగ్గర పారాణి గిన్నెను పట్టుకుని ఒక అనుచరుడు సభక్తికంగా నిలబడి ఉన్నాడు. ఆ అనుచరుడు బాపూ. ఈ చిత్రాన్ని చూసినప్పుడూ, తలుచుకున్నప్పుడూ నాకు వొళ్లు పులకరిస్తుంది.
             బాపూ రమణల్ని ఎప్పుడూ academic excellence ప్రత్యేంగా ఆకర్షిస్తుంది. ఏ గొప్పతనాన్ని ఏ రంగంలో చూసినా వారిద్దరూ పులకిస్తారు. తన్మయిలయి, పసిపిల్లలయి గంతులు వేస్తారు. బాపూ కుంచె ఉరకలు వేసి కొత్త పుంతలు తొక్కుతుంది. వారి అభిరుచులు, అభిమాన గాయకులు, కళాకారుల జాబితా అనంతరం -మెహదీ హస్సన్‌, గులాం ఆలీ, సత్యజిత్‌ రే, ఇంగ్మార్‌ బెర్గ్‌మన్‌, బడేగులాం -యిలా ఎన్నయినా. బాపూగారు నేలమీద కూర్చుని బొమ్మ వేస్తూంటే ఆగకుండా ఓ గొప్ప కళాకారుడి గాత్రం ఆయన్ని నిరంతరం పలకరిస్తూనే ఉంటుంది.
                బాపూగారికి మొన్న పద్మశ్రీ ఇచ్చారుగాని, కనీసం పది సంవత్సరాల కిందట వారిని పద్మభూషణ్‌తో సత్కరించుకోలేని కళంకం ఆ పద్మభూషణ్‌ పురస్కారానికి శాశ్వతంగా మిగిలిపోతుంది.
                  మరో గొప్ప చరిత్ర -బహుశా ప్రపంచంలో ఏ చిత్రకారునికీ దక్కనిది -వారి చేతివ్రాత ఒక బ్రాండుగా, ఫాంట్‌గా తెలుగు భాషని అలంకరించడం. ఒక భాషని అలంకరించే గొప్ప అవకాశం, ప్రతిభ అందరికీ కలిసిరాదు.
                   ఈ తరం చేసుకున్న అదృష్టం పేరు బాపూ. ఈ తరం చిరునామా బాపూ. రాబోయే తరాలు -చిత్రకారుల, కళాకారుల ప్రతిభను గుర్తుపట్టి బేరీజు వేసుకునే తూకపురాయి బాపూ. కీర్తి శిఖరం -బాపూ. బాపూ మౌలిక కళా జగత్తులో అపురూపమయిన పరిమళం. తెలుగు భాష ఉన్నంతకాలం తెలుగుజాతిని అలా సుసంపన్నం చేస్తూనే ఉంటుంది.

                                                                 
          

      gmrsivani@gmail.com   
       సెప్టెంబర్ 08  ,   2014          

*************

Read all the columns from Gollapudi  గొల్లపూడి గారి మిగతా కాలంస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 


KOUMUDI HomePage