అంతరిక్షంలో అద్భుతం  

   

నా జీవితంలో భారతీయుడిగా ఆనందంతో, గర్వంతో కళ్ళనీళ్ళు తిరిగిన అరుదయిన సందర్భమిది. భారతదేశం మొదటి ప్రయత్నంలోనే ఒక హాలీవుడ్ సినీమాకయే ఖర్చులో  పదోశాతం బడ్జెట్ తో అంగారక గ్రహం కక్ష్యలోకి అడుగుపెట్టింది. ఇది సామాన్యమయిన విషయంకాదు. ఇంతకు ముందు ఇలాంటి ప్రయత్నాలు 51సార్లు జరిగాయి. 21 సార్లు మాత్రమే విజయాన్ని సాధించాయి. ఇంతవరకూ అమెరికా, రష్యా, యూరోపు యూనియన్ల సమిష్టి ప్రయత్నాలు సఫలమయాయి. ఆ వరసలో భారతదేశం నాలుగోస్థానంలో నిలిచినా, మొదటి ప్రయత్నంలోనే అతి తక్కువ బడ్జెట్ తో, స్వదేశీ నైపుణ్యంతో విజయాన్ని సాధించిన మొదటి దేశం మనది.

మనకంటే కేవలం 48 గంటల ముందు అమెరికా ఉపగ్రహం అక్కడికి చేరింది. అయితే వారి వారి ఉద్దేశాల వెనుక ఆయా సంస్కృతుల ప్రాధమిక విలువల్ని గుర్తుపట్టాలనిపిస్తుంది. (నాకెప్పుడూ ఇలాంటి విషయాలే ఎక్కువగా ఆకర్షిస్తాయి.) అమెరికా ప్రయోగించిన ఉపగ్రహం పేరు "క్యూరియాసిటీ" (ఆసక్తి). భారతదేశం ప్రయోగించిన ఉపగ్రహం పేరు "అమ్మ". ఇది బొత్తిగా రంధ్రాన్వేషణలాగ కొందరికయినా అనిపించవచ్చుకానీ - ఎదుటి వ్యక్తికి చెయ్యెత్తి సెల్యూట్ చెయ్యడంలో, శిరస్సు వంచి నమస్కారం చెయ్యడంలో ఆ సంస్కృతీ మూలాలు ప్రతిఫలిస్తాయని నేను నమ్ముతాను - మనం గుర్తుపట్టినా, గుర్తుపట్టకపోయినా. అంతరిక్షంలోకి ఉపగ్రహాన్ని పంపి కనీ వినీ ఎరగని విజయాన్ని సాధించిన ఇస్రో డైరెక్టరు రాధాకృష్ణన్ ప్రతీసారీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకు రావడం నా దృష్టిని దాటిపోదు. అక్కడున్న చాలామంది శాస్త్రజ్ఞుల నుదుటిమీద కుంకుమ బొట్లు ఉన్నాయి - చెరిపినా చెరగనంత దిట్టంగా.

ఇక ఈ 'మామ్ ' అనే అంగారక గ్రహయాత్ర 5 నవంబరు, 2013లో అంతరిక్షంలోకి పంపిన ఈ ఉపగ్రహం 323 రోజులు 65 కోట్ల కిలోమీటర్లు ప్రయాణంచేసి 24న అంగారకుడి కక్ష్యకు చేరింది. దీనికి ఏదయినా సంకేతం ఇవ్వాలంటే - ఎన్నిరోజుల ముందు, ఎంత నిర్దుష్టమయిన సమయానికి, ఎలా ఇస్తే - అంతరిక్షంలో అంత వేగంగా, అన్ని కోట్ల దూరంలో ఉన్న ఉపగ్రహానికి అందుతుంది? ఇస్రో శాస్త్రజ్ఞులు దాన్ని నిర్ధారించారు. బొగ్గుని 214 కంపెనీలు దొంగతనం చెయ్యడం మనకు 20 సంవత్సరాలు తెలియలేదు - వినోద్ రాయ్ చెప్పి, సుప్రీం కోర్టు సమర్ధిస్తే తప్ప. మహాశూన్యంలో మన ఆలోచనల ప్రయాణం చెయ్యడానికి మార్గాల్ని నేటి శాస్త్రజ్ఞులు కనిపెట్టారు.

సరే. నాకేమో అంతరిక్షాన్ని తల్చుకున్నప్పుడల్లా నేనొక పిపీలికలాగ, క్రిమిలాగ, కీటకంలాగ, బొత్తిగా ఉనికికే అర్ధంలేని ప్రాణిలాగ తోస్తుంది. ఈ భూమిమీద మానవుని జీవనపరిణామం 60 సంవత్సరాలనుకుంటే - అసలు ఈ భూమి దక్షిణ ధృవం నుంచి భౌగోళికమైన వత్తిడులకు విడివడి వేర్వేరు ముక్కలు కావడానికి ఇప్పటికి 1800 లక్షల సంవత్సరాలు పట్టింది. ఇప్పటికీ ఈ ముక్కల్ని మనం ముక్కలనే పిలుచుకుంటున్నాం - ఆఫ్రికా ఖండము, ఆసియా ఖండము - ఇలాగ. ఈ హాస్యాస్పదమయిన జీవితమనే అతి చిన్న వ్యవధిలో మన విజయాలు, మన పదవులు, మన ఆదాయాలు, మన కీర్తిప్రతిష్టలు, మన సాధనలు - విలువలు ఎంత? తలుచుకున్న కొద్దీ సిగ్గుతో కుంచించుకుపోతాం.

అంతరిక్షంలో ఎన్నో సూర్యగోళాలున్నాయి. మనం చూసేది ఒక్క సూర్యుడినే. మన ఊహకి అందని ఎన్నో ఉపగ్రహాలున్నాయి. మనకి తెలిసింది - తొమ్మిదే. ఈ మధ్యనే మరో కొత్తగ్రహాన్ని గుర్తుపట్టారు. అయితే ఈ తొమ్మిది గ్రహాల సంచారాల్ని, వైలక్షణ్యాల్ని శతాబ్దాలుగా సెకన్లు తేడాలేకుండా ఇప్పటికీ మన వాళ్ళు గుర్తుపడుతున్నారు! ప్రతి సూర్యోదయాన్ని, అస్తమయాన్ని, గ్రహణాల్నీ - మరెన్నింటినో మన పంచాంగాలు చెపుతున్నాయి. ఆర్యభట్టు ఎప్పటివాడు!

కాంతి సెకనుకు లక్షా ఎనభై ఆరువేల మైళ్ళు ప్రయాణం చేస్తుంది. ఆ లెక్కన మనం ఆకాశంలో చూస్తే నక్షత్రం వెలుగు మనకు చేరడానికి కనీసం నాలుగు సంవత్సరాలు పడుతుంది. అంటే - మనం కళ్ళతో ఇప్పుడు చూస్తున్న నక్షత్రం - నాలుగేళ్ళ కిందట అక్కడ ఉన్నదన్నమాట! ఇప్పుడు ఉందా? ఏమో! ఇప్పుడు ప్రయాణం ప్రారంభిస్తే మరో నాలుగేళ్ళకు కానీ తెలియదు.

జ్ఞానం మన అవగాహన పరిధిని పెంచి, మన అహంకారాన్ని ఛిన్నాభిన్నం చేస్తుంది. మనకేం తెలుసు? ఎంత తెలుసు? అన్నిటికన్నా ముఖ్యం మనకి ఎన్నో తెలియవని మనకి తెలుసా?

జీవితమ్మెల్ల బహుశాస్త్ర సేవలందు గడిపితిని

రహస్యములు చాల గ్రాహ్యమయ్య

ఇప్పుడు వివేక నేత్రమ్ము విప్పిజూడ

తెలిసికొంటి నాకేమి తెలియదంచు -  అన్నాడు దువ్వూరి రామిరెడ్డి.

మనకి దేవుడు పెద్ద అన్వేషణ. మతం చిన్నగొడుగు. అంతరిక్షం ఇంకా ఆవిష్కృతం కావాల్సిన పెనుచీకటి. ఆలోచన విస్తరించినకొద్దీ, అవగాహన పెరిగిన కొద్దీ జ్ఞానం మన మనసుల్ని ఆర్థం చేస్తుంది. చెయ్యాలి. తలవొంచుతుంది. వొంచాలి. మనిషి తాత్విక ధోరణిలో పడతాడు. పడాలి. అదృష్టవంతుడయితే మనకు తెలియని మరేదో శక్తి ఉన్నదని నమ్ముతాడు. ఇంకా అదృష్టవంతుడయితే ఆ శక్తి 'దేవుడు ' అని గుర్తుపడతాడు. విశ్వాసం చేతికర్ర. చిన్న ఊతం.

"లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుది నలోకంబు పెంజీకటి కవ్వల.."అన్నాడు పోతన.

ఆయన ఇస్రో శాస్త్రజ్ఞుడు కాడు. కానీ సహేతుకమైన చర్చతో సరైన సమాధానాలను పట్టుకున్న ఎందరో మహనీయుల వారసత్వం మనది. మనకి గతం మీదా, సంస్కృతీ మూలాలమీదా నమ్మకం లేకపోయినా - వాటిని చూసి గర్వపడవచ్చు.

గొప్ప జ్ఞానం - ఇంకా అవగాహనకు లొంగని ప్రశ్నల్ని సంధిస్తుంది. అదే వేదాంతం, గొప్ప శాస్త్రజ్ఞుడు - అతని అన్వేషణ - అతనిలో సరైన స్పందనని కలిగిస్తే గొప్ప యోగి కావాలి తప్పదు. మరో మార్గం లేదు. నేను అలాంటి యోగిని కళ్ళారా చూశాను.

నేను ఆనర్స్ చదువుకునే రోజుల్లో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అణుశాస్త్ర విభాగాన్ని ప్రారంభించారు. దాని ఆచార్యుడిగా ఆయన్ని ఆహ్వానించారు. ఆయన పేరు స్వామి జ్ఞానానంద. సన్యాసం స్వీకరించకముందు ఆయన లౌకిక నామం భూపతిరాజు లక్ష్మీ నరసింహరాజు. ఆయన సన్యసించి హిమాలయాల్లో పదేళ్ళు గడిపి, తపస్సు చేసుకుని - 1936లో అణుశాస్త్రంలో పరిశోధనలు జరిపి, జర్మనీలో పనిచేసి, మిచిగన్ విశ్వవిద్యాలయంలో పనిచేసి భారతదేశానికి వచ్చారు. 1947లో ఢిల్లీలో జాతీయ భౌతిక శాస్త్ర పరిశోధనాలయంలో చేరారు. 1954లో భీమవరంలో ఒక ఏక్సిడెంటులో గాయపడి విశాఖపట్నం కింగ్ జార్జ్ ఆసుపత్రిలో చేరారు. అప్పటి వైస్ ఛాన్సలర్ వి.ఎస్.కృష్ణ వారిని కలిసి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అణుశాస్త్ర విభాగాన్ని ప్రారంభించడానికి ఆహ్వానించారు. ఆ సంవత్సరమే నేను ఆనర్స్ లో చేరాను. ఒక యోగి ఏమిటి, అణుశాస్త్రం ఏమిటి అని కుర్రాళ్ళం మేము విస్తుపోయేవాళ్ళం. చదువు నాకు సరిగా అబ్బలేదుగాని నా చదువు మాధమేటికల్ ఫిజిక్స్. ప్రయత్నిస్తే ఆ రోజుల్లో అర్ధమైయేదేమో!

విజ్నానం శక్తి. విజ్ఞానం కనువిప్పు. విజ్ఞానం చీకట్లో దివ్వె. విజ్ఞానం విముక్తి. విజ్ఞానం ముక్తి.


                                                                                                               
          

                                   gmrsivani@gmail.com   
                                    అక్టోబర్ 06 ,   2014          

*************

 

Read all the columns from Gollapudi  గొల్లపూడి గారి మిగతా కాలంస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 


KOUMUDI HomePage