విజ్ఞానం – విశ్వాసం  

ఒక విచిత్రమైన, అనూహ్యమైన విషయాన్ని ఈ మధ్య మిత్రులు, మల్లాది గ్రూప్ వ్యవస్థాపక అధ్యక్షులు మల్లాది సచ్చిదానంద మూర్తిగారు నాకు తెలిపారు. ఆయన ఛాందసుడుకాదు. బొత్తిగా చదువుకోని వాడుకాదు. సహేతుకమైన ఇంజనీరింగు పట్టా పుచ్చుకున్నవారు.

తులసీదాసు రచించిన 'హనుమన్ చాలీసా ' తెలియని, చదవని, వినని భారతీయుడు ఉండడు. ఇది పుక్కిట పురాణమనీ, మతఛాందసమనీ భావించే భారతీయులూ చాలామంది ఉంటారు. ఒకచోట "యుగ సహస్ర యోజన పరభానూ, లీల్యోతాహి మధుర ఫల జానూ" అన్నాడు తలసీదాసు. పసితనంలో హనుమంతుడు సూర్యుడిని చూసి ఫలమనుకుని ఆ లోకానికి ఎగిరాడట. ఇంతవరకూ ఇది పుక్కిట పురాణమని ఒప్పుకుందాం. ఒక కోతి ఏమిటి? సూర్యుడి దగ్గరికి ఎగరడమేమిటి? అనిపించడం సహజం. సరే. ఎంతదూరం ఎగిరాడు? యుగ సహస్ర యోజన పరబానూ" ఇది తులసీదాసు కలిపించినదికాదు. శాస్త్రీయమైన తూకం. లెక్క చూదాం. 

యుగము - 12,000 సంవత్సరాలు

సహస్రము - 1000

ఒక యోజనము - 8 మైళ్ళు

ఇప్పుడు - యుగ X సహస్ర X యోజన + 1200X1000X8 మైళ్ళు + 96000000 మైళ్ళు. (96 కోట్ల మైళ్ళు)

ఒక మైలు - 1.6 కిలోమీటర్లు

అంటే 96000000 X 1.6 + 1536000000 కిలోమీటర్లు (1536 కోట్ల కిలోమీటర్లు)

అమెరికాలో అంతరిక్ష పరిశోధక సంస్థ - భూమికి సూర్యునికీ సరిగ్గా ఇంతే దూరం ఉన్నదని నిర్ధారించింది. దీనిని అంతర్జాతీయ ఖగోళ సంస్థ బలపరచింది. ఈసారి మీ అబ్బాయి ఉత్సుకతతో ‘భూనికీ సూర్యునికీ మధ్య దూరమెంత నాన్నా? ' అంటే ధైర్యంగా 'హనుమాన్ చాలీసా చదువుకోబాబూ ' అని మీరు రికమెండు చేయవచ్చు.

ఇందులో మనం గ్రహించవలసిన విషయం ఒకటుంది. ఆ రోజుల్లో పెద్దలు మనకి కొన్ని పడికట్టురాళ్ళని ఏర్పరిచినా, కేవలం కాకమ్మ కథలు చెప్పలేదు. తరతరాల విజ్ఞాన్ని  కాచివడబోసి దాన్ని మనకు అందేటట్టు 'కాకమ్మకథ ' అంత సరళం చేశారు. మనం అబ్బురపడేంత శక్తిసామర్ధ్యాలు హనుమంతునికి ఉన్నాయని మనకి చెప్పబోయారు. ఇంత లెక్క తులసీదాసు మనస్సులో ఉంది, అతను చెప్పిన స్త్రోత్రంలో ఉంది. దానికి అంతర్జాతీయ సంస్థ మద్దతు ఉంది.

మరో సరదా అయిన కథ. నేను సినీమా నటుడిని అయే కొత్త రోజుల్లో నా నుదుటి మీదకి చుండ్రు పాకేది. రచయిత నుదుటి మీద చుండ్రు వల్ల నష్టం లేదుకానీ నటుడినయే తొలి రోజులుకదా? కనుక సత్వర చర్య అవసరమని దేశంలో కల్లా గొప్ప చర్మవ్యాధి నిపుణుడి దగ్గరికి వెళ్ళాను. ఆయన పేరు ఏ. తంబయ్య. చెన్నైలో పూనమల్లి హైరోడ్డులో ఆయన క్లినిక్. ఈయన దేశ స్థాయిలో డాక్టర్ బి.సి.రాయ్ అవార్డుని పుచ్చుకున్న ఘనుడు. చాలా పేరున్నవాడు. నా సమస్యని చూసి - తీరా వెళ్ళాను కనుక, డబ్బు ఇచ్చాను కనుక ఏదో ట్యూబు రాసి - అన్నిటికన్నా ముఖ్యం - పొద్దున్నే సూర్యుని ఎండలో తలకి నువ్వుల నూనె రాసుకుని పది నిముషాలు నిలబడమన్నాడు.  ఇదేమిటి? చిన్నప్పుడు మా అమ్మమ్మ - నువ్వుల నూనె రాసుకుని పొద్దున్నే ఎండలో నిలబడితే సూర్యభగవానుడి ధర్మమా అని ఎలాంటి చర్మ వ్యాధులయినా పోతాయంది కదా? ఆవిడ మా అమ్మమ్మ. ఈయన డాక్టర్ తంబయ్య. ప్రత్యేక నైపుణ్యంగల ప్రముఖ వైద్యుడు. సరే. ఈ పదినిముషాలూ ఏం చెయ్యాలి? "కావాలంటే హిందూ పేపరు చదువుకో, లేదా పాటలు పాడుకో." అన్నాడు. సరిగ్గా మా అమ్మమ్మ అదే చెప్పింది. పదినిముషాలు 'ఆదిత్య హృదయం' చదువుకోమని.

ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం

  జయావహం జపేన్నిత్య మక్షయం పరమం శివమ్

ఈ శ్లోకాలు చెపితే "సూర్యుడు దేవుడేంటి, కాళ్ళులేని అనూరుడు అతనికి సారధి ఏంటి? ఏడురధాలేంటి? పోవమ్మా, మా తంబయ్యగారు చెప్పిందే వైద్యం" - అని 21 వ శతాబ్దపు చదువుకున్న కుర్రాడు ఎగతాళి చెయ్యవచ్చు.

విజ్ఞానాన్ని  విశ్వాసంగా మలిచిన అద్బుతమైన కాలమది. ఇవాళ అంతర్జాతీయ ఖగోళ సంస్థ, 'నాసా ' సంస్థ తులసీదాసుని సమర్ధిస్తే తప్ప ఇవి పుక్కిట పురాణాలని అవతలికి తోసేసే తెలివైన రోజులు. మరి ఈ ఆదిత్య హృదయంలో ఈ పుక్కిట పురాణం ఏమిటి? దానికీ ఓ పరమార్ధం ఉంది. డాక్టరు తంబయ్య చెప్పాడు కనుక పదినిముషాలు ఎండలో నిలబడి హిందూ పేపరు చదువుకోవడం కన్నా - "నా రుగ్మతని పోగొట్టు స్వామీ!" అనుకుంటూ - మన అనారోగ్యం మీదా, మనల్ని బాగుచేసే ఆ ప్రక్రియమీదా ఆ పదినిముషాలూ ధ్యానాన్ని ఉంచితే ఇంకా గొప్పదికదా?

అయితే ఆ హిందూ పేపరులో ఒబామా కథ మనకి అర్ధమవుతుంది. తులసీదాసు చెప్పిన హనుమాన్ చాలీసా మనకు అసందర్భంగా కనిపిస్తుంది. అవసరమైన ప్రక్రియని మనల్ని అబ్బురపరిచి, ఆశ్చర్య పరిచే అతి ప్రాధికమైన 'విశ్వాసం'గా మలిచి తరతరాలు మన మనస్సుల్లో, సంప్రదాయంలో నిలిపిన పెద్దలు ఎంత ముందు చూపు కలవారు?

విజ్ఞానానికి ఎల్ల ఉంది. విశ్వాసానికి విస్ర్తుతి ఉంది. విజ్ఞానం నిర్దారిస్తుంది. విశ్వాసం మనసుని ఆయుత్తం చేస్తుంది. విజ్ఞానం  మానవ మేధకు సంబంధించినది. విశ్వాసం ఒక జాతి వికాసానికి సంబంధించినది. విశ్వాసం మత ఛాందసుడి గుడ్డితనం కాదు, సంప్రదాయవాది బలహీనత కాదు, ఆర్ష విజ్ఞానం సిద్దం చేసుకున్న ముసుగుకాదు, అన్నిటికీ మించి ఆలోచనకి తావివ్వని జబ్బుకాదు. ఏ కాలానికయినా, ఏ పనికయినా, ఏ విజయానికయినా ఉండవల్సిన ప్రాధమికమైన అర్హత. ఈ తరం చదువుకున్న మనిషి మా మిత్రుడు, ఫామిలీ డాక్టరు - ఎప్పుడూ ఒక మాట చెప్తాడు. ఏ రోగానికయినా వైద్యం ఫలించడానికి నాలుగు 'డీ 'లు అవసరమని. అవి - డయాగ్నోసిస్, డ్రగ్, డిలిజన్స్, డెడికేషన్. అనగా రోగం నిర్దారణ, మందు, శ్రద్ద - నాలుగోది - కాని అతి ముఖ్యమైనది - ఈ వైద్యం ఫలిస్తుందనే విశ్వాసం.

చిన్నప్పుడు తేలు కుడితే మా నాన్నగారు నన్ను విశాఖపట్నంలో మంగళగిరి సీతారామయ్యగారింటికి తీసుకువెళ్ళడం గుర్తుంది. ఆయన నా ముందు కూర్చుని పెదాలు కదుపుతూ ఏదో వర్ణించేవాడు. నాకు భయంకరమైన బాధ. తర్వాత నన్ను నోరు తెరవమని నోట్లో ఏదో వేసాడు. విచిత్రం మరో పదినిముషాలకు బాధ తగ్గడం ప్రారంభించేది. ఇప్పుడాలోచిస్తే సీతారామయ్యగారు రెండు స్థాయిలలో వైద్యం చేశాడు. 'మంత్రాలకు చింతకాయలు రాలుతాయి ' అనే విశ్వాసాన్ని పునరుద్దరించాడు. నొప్పికి అసలు మందు ఏదో ఇచ్చాడు. మందు వల్ల నొప్పి పోయింది. మంత్రం వల్ల విశ్వాసం బతికింది. ఇది అపూర్వమైన చికిత్స.

నాసాని, అంతర్జాతీయ ఖగోళ విజ్ఞాన్ని మాత్రమే నమ్మే ఈనాటి విజ్ఞత ఒక గొప్ప స్థాయిలో శాశ్వతంగా మన సంప్రదాయంలో ఇన్సులేట్ చేసిన మరో విలువైన చికిత్సని వదులుకొంటోంది. ఇందుకు తులసీదాసు, డాక్టర్ తంబయ్య, మంగళగిరి సీతారామయ్యలే ఉదాహరణలు.

  
                                                                                                               
          

                                   gmrsivani@gmail.com   
                                    అక్టోబర్ 13 ,   2014          

*************

 

Read all the columns from Gollapudi  గొల్లపూడి గారి మిగతా కాలంస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 


KOUMUDI HomePage