చట్టాలనేవి ఉన్నాయా?
గొల్లపూడి మారుతీరావు

      gmrsivani@gmail.com



టెలికాం శాఖకీ, అవినీతికీ అనాదిగా అవినాభావ సంబంధం వుంది. 1996 నుంచీ ఈ చరిత్రకి పునాదులు ఉన్నాయి. అలనాడు పండిట్‌ సుఖ్‌రాం పూజా మందిరంలో, పడక గదిలో 3.6 కోట్ల రూపాయల సొమ్ము దొరికింది. ఇవాళ ఏదో పత్రికలో చక్కని కార్టూన్‌ వచ్చింది. భర్త, భార్యతో అంటాడు, 'మన రాజా అవినీతిని చూశాక, పాపం సుఖ్‌ రాం అవినీతి బొత్తిగా ట్రాఫిక్‌లో ఎర్ర దీపాన్ని దాటినంత చిన్నదిగా కనిపిస్తోంది' అని. ఏమైనా కాలం మారింది. దేశం మారింది. అవినీతి కూడా అభివృద్ధి చెంది ఈ దేశంలో లక్షా డెబ్భై అయిదు కోట్ల స్థాయికి చేరింది. ఆ రోజుల్లో పండిట్‌ సుఖ్‌రాంని 'బాండిట్‌' సుఖ్‌రాం అన్నారు. ఆ లెక్కన ఇవాళ కల్మాడీకీ, రాజాకీ పెట్టుకోడానికి ఏ ముద్దుపేర్లూ చాలవు.
అయితే అసలు కథ ఇదికాదు. పదహారు సంవత్సరాల కిందట ఈ నేరం జరిగింది. ఆ రోజుల్లో నేరస్థుడికి బెయిల్‌ ఇచ్చారు. తీరా అది నేరమని రుజువు కావడానికి 16 సంవత్సరాలు పట్టింది. ఈలోగా సుఖ్‌రాం హిమాచల్‌ప్రదేశ్‌లో సొంత పార్టీ పెట్టి, ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కూడా అయ్యారు. విధానసభకి అయిదుసార్లు, లోక్‌సభకి మూడుసార్లూ ఎన్నికయ్యారు! వారు ప్రస్తుతం తన 86వ యేట తీహార్‌ జైల్లో రాజా సరసన ఉన్నారు. ఇదే లెక్కల రాజా, కనిమొళి నేరాలు రుజువుకావడానికి ఎంత లేదన్నా మరో 19 సంవత్సరాలు పట్టవచ్చు. అప్పుడు మన రాజా తన 76వ యేట తీహార్‌ జైలుకి సాధికారికంగా వేంచేస్తారు.
ఈ దేశంలో చట్టాలు 1860 నాటివి. పాత బడ్డాయి. పాడుబడ్డాయి. 150 సంవత్సరాల కిందటి సంప్రదాయాన్ని, మర్యాదల్ని దృష్టిలో పెట్టుకుని బ్రిటిష్‌వారు ఆ రోజుల్లో రూపొందించిన చట్టాలు ఈనాటికీ మనకి శ్రీరామరక్ష. వాటిని కదిలిస్తే తేనెతుట్ట కదులుతుంది కనుక వాటి నీడలోనే విశ్రమిస్తున్నారు ఈనాటి అవినీతిపరులు. ఆ రోజుల్లో నేరం రుజువయ్యేదాకా నేరస్థుడు బోరవిరుచుకుని తిరగని రోజులు. బ్రిటిష్‌ సంప్రదాయం ప్రకారం నేరస్థుడిని వేలెత్తి చూపితే అతని ప్రజాజీవితం అంతటితో ముగిసినట్టే. ఆ మర్యాదని పాటించిన వ్యక్తులను ఉద్దేశించిన చట్టాలవి. నేరం వేలెత్తి చూపితే 'నేను చెయ్యలేదు. ఇది కుట్ర' అనే బుకాయింపు ఈనాడు సామాన్యమయిపోయింది. ఉదాహరణకు మాయావతి, ములాయం సింగ్‌, లాలూ, జయలలిత వగైరా. తీరా అరెస్టుచేసి జైలుకి పంపితే బెయిలు పుచ్చుకు రావడమే విజయంగా బోర విరుచుకుని ఊరేగే 'సిగ్గు'లేని నాయకుల రోజులొచ్చాయి. ఈ నేరస్థుడు బయట తిరగడం వల్ల నేర విచారణకి ఎటువంటి ఇబ్బందీ రాదని న్యాయస్థానం నమ్మిన తర్వాతే బెయిలు ఇస్తారు. నిరపరాధిత్వం నిరూపణ అయినందుకు కాదు. కానీ అలా బయటికి రావడమే గొప్ప విజయంగా కనిమొళికి చెన్నై విమానాశ్రయంలో పార్టీశ్రేణులు బ్రహ్మరథం పట్టడం మనం చూశాం.
అంతకన్న అనర్థమైన విషయం, ఈ సమాజానికీ, వ్యవస్థకీ పట్టిన ముఖ్యమైన 'అనర్థం' మరొకటి ఉంది. నేరం రుజువుకాని దశలోనే, తర్వాత నేరస్థుడని తేలిన ఒక నేరస్థుడు (సుఖ్‌రాం) హిమాచల్‌ప్రదేశ్‌లో కొత్త పార్టీని స్థాపించి, ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. గడ్డి తిన్న లల్లూ ప్రసాద్‌ బీహార్‌ ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన పదవిలో ఉండడానికి వీలులేదని న్యాయస్థానం అన్నప్పుడు వంటగదిలోంచి తన శ్రీమతిని సరాసరి ముఖ్యమంత్రి గద్దెకి బదిలీ చేశారు.
మరో 16 సంవత్సరాల తర్వాత నిన్న వారిమీద చార్జిషీటు నమోదయింది. తీరా తీర్పు వచ్చేనాటికి వారికి 90 ఏళ్లు వచ్చినా ఆశ్చర్యం లేదు. ఇన్నాళ్లూ న్యాయస్థానం ఎందుకు నిద్రపోయింది? వ్యవస్థ ఎందుకు చర్య తీసుకోలేదు? ఇదే పెద్దమనిషి, లోక్‌పాల్‌ బిల్లు చట్టమయితే మనమంతా జైల్లో ఉంటామన్న నిజాన్ని బహిరంగంగా పార్లమెంటులోనే వక్కాణించారు. స్వస్వరూపజ్ఞానం తెలిసిన అవినీతిపరుడిగా లాలూకి పెద్దపీట వేయాలి. మరో గొప్ప ఉదాహరణ జయలలిత. ఆమె మీద బోలెడు కేసులు నడుస్తున్నాయి. ఆమధ్య ఆమె పదవిలో ఉండరాదని కోర్టు తీర్పు ఇచ్చింది. ఆమె తన 'చెంచా'ని ముఖ్యమంత్రిగా నిలిపి రాష్ట్రాన్ని పరిపాలించింది. తనే రెండుసార్లు ముఖ్యమంత్రి అయింది. రేపు ఆవిడ నేరస్థురాలని న్యాయస్థానం నిర్ణయిస్తే? ఒక నేరస్థుడి పరిపాలనలో రాష్ట్రం నిలవడం ఎంత దురదృష్టం? కాక, ఆమె నిరపరాధి అని న్యాయస్థానం తీర్పు ఇస్తే -ఒక నిజాయితీ పరురాలయిన నాయకురాలికి ఎంత అన్యాయం జరిగినట్టు? అలాగే ములాయం మీద కేసులున్నాయి. మాయావతి మీద ఉన్నాయి. ఇవికాక మన ఘనత ఇతరత్రా బోలెడు ఉంది. రాజీవ్‌ గాంధీని దారుణంగా హత్య చేసినందుకు మరణశిక్ష పడిన హంతకులు 21 సంవత్సరాలుగా జైళ్లలో మ్రగ్గుతున్నారు. అఫ్జల్‌గురు సంగతి సరేసరి. ఈ అలుసు చూసుకుని మన కళ్లముందే ఎందరినో చంపిన అజ్మల్‌ కసబ్‌ తనకి న్యాయం జరగాలని వాపోతున్నాడు. ఇది ఈ దేశానికి హాస్యాస్పదమైన దుస్థితి. మొన్ననే సుప్రీంకోర్టు రాష్ట్రపతిని ఈ శిక్షల మీద తాత్సారానికి సంజాయిషీని కోరింది.
డబ్బున్న వాళ్ల బరితెగించిన పిల్లలు తాగి, మనుషుల మీద కార్లని నడుపుతున్నారు. గాజులు తొడుక్కున్న చట్టాలు వారిని విడుదల చేస్తున్నాయి. టీవీల వాళ్లూ, పత్రికల వాళ్ల పుణ్యమా అని అమ్మాయిని చంపి ఆటగా తిరుగుతున్న మనూశర్మ గతిలేక జైలుకి వెళ్ళాడు.
ఎప్పుడో 1860 నుంచీ మురిగిపోయిన ఈ ముసలి చట్టాలు నేరస్థులకి గుండె ధైర్యాన్ని పెంచుతున్నాయి. పైగా సిగ్గులేని తనం నేరస్థుడికి ఈ తరం సమకూర్చిన మొదటి ఆయుధం. మనకి నేరాలు తెలుస్తున్నాయి. నేరస్థులు పదవుల్లో కనిపిస్తున్నారు. రుజువు కానివ్వక పోవడం తన నిర్దోషిత్వంగా జబ్బలు చరుస్తున్నారు. మంచో, చెడో, అటు పక్కన ఉంచితే, నేరస్థుడని భావించిన సద్దాం హుస్సేన్‌ మీద నెలలలోనే శిక్ష అమలు జరిపారు. అలనాడు జుల్ఫికర్‌ ఆలీ భుట్టో మీద అలాగే శిక్ష అమలయింది. ఈ దేశపు దురదృష్టం, న్యాయ వ్యవస్థ చేతులు కట్టేసే ముసలి చట్టాలు అండకావడం. నాయకత్వం వాటిని అలుసుగా తీసుకోవడం. వెయ్యిమంది అవినీతిపరులు తప్పించుకున్నా ఒక నిరపరాధికి అన్యాయం జరగకూడదన్న అపురూపమయిన మానవతా దృక్పథం పెట్టుబడిగా బ్రిటిష్‌ సంప్రదాయపు చట్టాలు అలనాడు ఏర్పడ్డాయి. కానీ 90 మంది నీతిపరులు బలి అయిపోయినా (అక్టోబర్‌ విప్లవంలాగ) ఈ దేశాన్ని భ్రష్టు పట్టించే ఒక్క అవినీతి పరుడిని నేల కరిపించే చట్టాలు ఈ రోజు అవసరం. నిజంగా న్యాయస్థానం కళ్లు తెరిస్తే మనం కొత్త జైళ్లను కట్టుకోవాలి. తీహార్‌ చాలదు. మనకి ప్రస్తుతం పదిమంది శేషన్‌లూ, పది సుప్రీంకోర్టులూ, ఓ డజను సుబ్రహ్మణ్య స్వాములూ, ఇద్దరు అన్నా హజారేలూ కావాలి.
 

                                        మార్చి 5. 2012
  

   ************               ************           *************          *************
Also meet Maruthi Rao Garu in his telugu blog gollapudimaruthirao.blogspot.com
Read all the columns from Gollapudi  గొల్లపూడి గారి మిగతా కాలంస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి


KOUMUDI HomePage