చీకటి 'తెర '
గొల్లపూడి మారుతీరావు

      gmrsivani@gmail.com

    ఫ్రెంచ్‌ దర్శకుడు లూక్‌ గొదార్ద్‌ సినిమా ప్రభావాన్ని గురించి చెబుతూ ఒక మాటన్నాడు. సినిమా సెకెనుకి 24సార్లు నిజాన్ని చెబుతుందట. సినిమా ప్రక్రియ తెలియని వారికి ఒక నిజం చెప్పాలి. సినిమా రీలు 24 ఫ్రేములు కదిలితే తెరమీద బొమ్మ కదులుతుంది. అదీ రహస్యం. గొదార్ద్‌ అనే నిజాయితీపరుడు రొమ్ము చరుచుకున్న మాధ్యమం ప్రభావం అంత గొప్పది.
అయితే అది ఆ రోజుల మాట. ఆనాటి సినిమాల మాట అప్పటి సినిమా ఫ్రేముల మాట. ఇప్పటి సినిమాలు సెకెనుకి 24 సార్లు కాలకూట విషాన్నీ, గ్లామర్‌నీ, ఆకర్షణనీ, నినాదాన్నీ- అన్నిటికీ మించి అబద్ధాన్నీ సంధిస్తున్నాయి. నేను సిినిమాల వాడిని. ఈ మాట చెబుతున్నపుడు ఇంటిగుట్టు తెలిసిన మేనమామ రట్టు చేసినట్టు చాలామందికి అనిపించవచ్చు. తోటి, సాటి సినిమాల వారికి బాధగానూ ఉండవచ్చు. కానీ ఈ కాలమ్‌ ప్రయత్నం రొమ్ము చరుచుకోవడం కాదు. రొమ్ము చీల్చుకు నిజాల్ని విప్పుకోవడం, ఒప్పుకోవడం.
సినిమా ప్రభావాన్ని నిర్మాతలూ, దర్శకులూ మరిచిపోయి చాలా రోజులయిపోయింది. సినిమాని ఎలా అమ్ముకోవడమో - అన్న ఒక్క ఆలోచనతోనే తంటాలు పడుతున్న యావ మనకి తెలుస్తోంది.
గొదార్ద్‌ కాలంనాటి సినిమా - నిజాన్ని ఆకాశంలో నిలిపే సినిమాని - 'పోతన'ని ఓ కుర్రాడు అలనాడు చూశాడు. అతను జీవితకాలమంతా ధ్యానముద్రలో బాలయోగిగా ముమ్మిడివరంలో నిలిచిపోయాడు.
నేను చెప్పిన మార్కు సినిమా ప్రభావం ఎలాంటిది? తమిళనాడులో అలనాడు కె. బాలచందర్‌ 'నూతిక్కి నూరు' అనే చిత్రాన్ని తీశారు. ఆ చిత్రాన్ని చూసి ప్రభావితుడైన సూర్యప్రకాష్‌ అనే ఓ కుర్రవాడు కేవలం ఎనిమిది హత్యలే చేశాడు. మొన్ననే - తల్లిదండ్రులకు తనమీద టీచర్‌ ఫిర్యాదు చేసిందన్న కోపంతో ఆమెని స్కూలులో వెంటాడి కత్తితో ఎనిమిది సార్లు పొడిచి చంపాడు ఓ కుర్రాడు. అతనికి 'అగ్నిపథ్‌' అనే చిత్రం స్ఫూర్తినిచ్చిందని తెలిసింది.
పూణలోనే - మొన్ననే - 16 ఏళ్ల కుర్రాడిని - అతనితో చదువుకుంటున్న సహచరుడు మరో ఇద్దరు మిత్రులతో (అంతా మైనర్లు) ఎత్తుకుపోయి - తండ్రిని 50 వేలు చెల్లించమన్నారట. తర్వాత తమ డిమాండ్‌ని 15వేలకి కుదించారట. బెదిరిపోయిన నిస్సహాయపు తండ్రి డబ్బుని చెల్లించాడు.
కానీ కుర్రాళ్లకి కావల్సింది డబ్బు కాదు. తన తోటి విద్యార్థిని ధిగీ ప్రాంతపు అడవుల్లోకి తీసుకెళ్లి గొంతు పిసికి చంపేశారు. ఈ కుర్రాళ్లకి టీవీల్లో వస్తున్న 'సిఐడి' సీరియల్‌ స్ఫూర్తినిచ్చిందట. అన్నట్టు - సినిమా ప్రక్రియ తెలియని వారికి - టీవీలో బొమ్మ కదలడానికి 26 ఫ్రేములు కదలాలి. అంటే గొదార్ద్‌ అనే అమాయకుడి మాటల్లో టీవీ సెకెనుకి 26 సార్లు నిజాన్ని - ఈ సందర్భంలో - దురాలోచనని సంధిస్తోందన్నమాట. కొందరు కుర్రాళ్లని మాధ్యమం రెచ్చగొట్టింది. దుర్మార్గానికి రెక్కలు తొడిగింది. ఎవరూ ఊహించలేని ప్రభావం చూపే మాధ్యమానికి మిడి మిడి జ్ఞానం ఇవ్వగలిగే అనర్థానికి ఇది మచ్చుతునక. సరైన తూకంలో నిజాన్ని చెప్పలేని మాధ్యమం - చెయ్యి జారిన - లేదా చెయ్యిదాటిన అబద్ధాన్ని అద్భుతంగా అలంకరిస్తుంది. నరాలని రెచ్చగొడుతుంది. ముఖ్యమైన విషయం గమనించాలి. పైన చెప్పిన అన్ని ప్రభావాలూ - బాలయోగితో సహా - రెచ్చగొట్టే వయస్సులో ఉన్నవారి పైన చూపినవే. సినిమా గురిపెట్టిన తుపాకీ. సంధించడం తెలియని వాడి చేతుల్లో అది ఆయుధం. తన పని తెలియని ఒక్క ఎడిటరు చేతిలో చిన్న ఆలోచన పెద్ద ఉద్యమం కాగలదు. భయంకరమైన క్షిపణీ కాగలదు. ఒకాయన 'మంచి'ని చెబుతున్నాడు. ఒకసారి చెబితే అది సూక్తి. రెండోసారి చెబితే అది నీతి. మూడోసారి అది ఉద్బోధ. నాలుగోసారి నినాదం. అయిదోసారి ఉద్యమం. ఆరోసారి విప్లవం. ఏడోసారి వినాశనం. ఒక్క ఫ్రేముకు ఉన్న శక్తి అది. అన్నా హజారే మాలేగావ్‌లో చెప్పింది నీతి. ఢిల్లిdలో లక్షల సమక్షంలో చేసింది ఉద్యమం.
ప్రసక్తి వచ్చింది కనుక చెబుతున్నాను. ఉద్యమాలకీ, రాజకీయాలకీ, నాకూ ఎలాంటి సంబంధమూ లేదు. ఇది కేవలం మాధ్యమం శక్తిని ఉటంకించడానికి ఉదాహరణ మాత్రమే. ఆత్మహత్య- ఓ వ్యక్తి బలహీనతకు పర్యవసానం. ఆవేదనకి అంతిమ చర్య కాదు. అది సైకిక్‌ న్యూరోసిస్‌. దాన్ని క్లినికల్‌ డిప్రెషన్‌ అంటారు. తన ఉద్దేశాన్ని వాస్తవం చెయ్యలేని, చేసుకోలేని వ్యక్తి వెదుక్కునే దారి. ఎస్కేప్‌ రూట్‌. (రైతుల ఆత్మహత్యలు బలమైన ఉదాహరణలు) ఇది చాలా దయనీయమైన పరిణామం. మార్కులు సరిగ్గా రాని కారణాన, రావేమోనన్న భయానికి, తండ్రి తిట్టాడన్న కారణానికి, ప్రేమ ఫలించని కారణానికి మనం ఆత్మహత్యల్ని ఎన్ని చూడడం లేదు? తమిళనాడులో ఎమ్‌.జి.రామచంద్రన్‌ పోయినప్పుడు, మన రాష్ట్రంలో ఎన్‌.టి.రామారావు పోయినప్పుడు ఆత్మహత్యలు చేసుకున్న వారున్నారు. తమ అభిమాన నటుడు రజనీకాంత్‌ సినిమాకి టిక్కెట్లు దొరక్కపోతే ఆత్మహత్య చేసుకున్న సందర్భాలున్నాయి. ఇవన్నీ 'న్యూరోసిస్‌'లో భాగాలే. సరే. ఇందులో మాధ్యమం ప్రసక్తి ఎక్కడ?
ఇది ఆ వ్యక్తికీ, ఆ కుటుంబానికీ సంబంధించిన తీర్చలేని విషాదం. దాన్ని భూతద్దంలో చూపి, నినాదాలు చేసి, చచ్చిన వ్యక్తిని హీరోని చేసి, త్యాగశీలుడిని చేసి, ఫ్లెక్సీలు, బ్యానర్లతో జిల్లాల్లో, రాష్ట్రంలో, ఢిల్లిdలో ఊరేగింపులు జరిపి పెద్దలు నీరాజనాలర్పిస్తే - మాధ్యమాలూ, పత్రికలూ ఆ నిస్సహాయుడి ఫోటోల్ని ప్రచురిస్తే- వైద్య సహాయం అవసరమైన, తొందరపడిన ఓ నిస్సహాయుడి దుర్మరణం - ఓ జాతిని మేల్కొలిపే సమిధిగా రూపు దాల్చితే - ఒక వైద్యపరమైన రుగ్మత గ్లామరైజ్‌ అవుతుంది. అర్థంలేని పాప్యులారిటీకి దగ్గరితోవ అవుతుంది. ఎంతమంది - ఇలాంటి నిస్సహాయపు స్థితిలో ఉన్న - న్యురోసిస్‌లో ఉన్న యువకులు - ఆ చిన్న 'అంగ'ని వెనక్కి తీసుకోలేని మార్గంలో వేస్తారు? ఇందులో పెద్దల, మాధ్యమాల వాటా ఉంది. సెకెనుకి 26 ఫ్రేముల ఫోకస్‌ ఉంది. బలహీనుడిని కొండమీద నుంచి దొర్లించే స్ఫూర్తి ఉంది. పూణలో ముగ్గురి కుర్రాళ్ల హత్యకీ, ఇక్కడ మాధ్యమం నిర్వహించే ప్రోత్సాహానికి పెద్ద తేడా లేదు.
ఆర్టీసి బస్సు కిందపడి కన్నుమూసిన కుర్రాడి కథ ఎందరికి తెలుసు? అది తీర్చలేని ఆ కుటుంబపు విషాదం. పూణలో 16 ఏళ్ల కుర్రాడు బస్సు కిందపడితే అది పత్రికలో ఆరోపేజీలో ఓ దురదృష్టకరమైన సంఘటన. కానీ ఈ హత్య - మాధ్యమాల తప్పుడు ప్రభావానికి 90 శాతం బాధ్యతని వహించవలసిన దుర్ఘటన.
అమ్మాయిలతో పన్నెండు రీళ్లు ఊరేగిన విలన్‌ని ఆఖరి రీలులో చంపినంత మాత్రాన సత్యానికి పట్టాభిషేకం జరగదు. పైగా అవినీతికి గ్లామరు పెరుగుతుంది. 16 ఏళ్లు నిండని కుర్రాడిని చంపిన సాటి యువకుల తలల్లోకి పాకిన విషం దిగడానికి - వాళ్ల జీవితకాలం చాలదు. వాళ్లని - మరో 40 ఏళ్ల తర్వాత - ఎవరయినా ప్రశ్నించగలిగితే - వాళ్ల చూపుడువేలు చివరన - ఒకటే ఒక్కటి ఉంటుంది. సినిమా - ఇంకాస్త ముందుకుపోయి - టీవీ- ఇంకాస్త ముందుకుపోయి - మాధ్యమం.
రెండే రెండు విషయాల్ని చెప్పి ముగిస్తాను. మొదటిది ప్రపంచ ప్రఖ్యాత దర్శకులు ఆల్ఫ్రెడ్‌ హిచ్‌కాక్‌ చెప్పినది: సినిమా తాలూకు భయంకరమైన బలహీనత - నిర్దేశించిన చెలియలికట్టని దాటడం. విలన్‌ ఎంత విజయవంతమైతే సినిమా అంత రాణిస్తుంది. మరొక మాట: విలన్లలో ఆకర్షణ - మానవ స్వభావంలో ప్రాథమికమైన బలహీనతలకు ప్రాతినిధ్యం వహించడం. వాళ్లలో ఉన్న బలహీనతలే - వాళ్లని ప్రేక్షకులకు మరింత దగ్గర చేస్తాయి. వారి జీవితాల్లో అసమగ్రత లోపం కాదు - సిినిమాకు పెట్టుబడి. సగటు మానవుడి బలహీనతల్ని అద్దంలో చూపించి ఆ విలన్లని వారిలో ఒకరిని చేస్తాయి కనుక. తెరమీద తన సాటిమనిషి - విలన్‌ - చెయ్యగలిగిన పని జీవితంలో తను ఎందుకు చెయ్యకూడదు? అని ఆలోచిస్తాడు. అదే అనర్థానికి పునాది. ఒకరు బలహీనతలకి బలి అవుతున్నారు. మరొకరు బలహీనతల్ని వాడుకుంటున్నారు.


                                       
ఏప్రిల్ 9, 2012  

   ************               ************           *************          *************
Also meet Maruthi Rao Garu in his telugu blog gollapudimaruthirao.blogspot.com
Read all the columns from Gollapudi  గొల్లపూడి గారి మిగతా కాలంస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి


KOUMUDI HomePage