Click Play to listen audio of this column
If you have issues with Voice clarity, upgrade your Flash Player Version. Click Here
 
అన్నా! ఆహా! ఆహాహా!

గొల్లపూడి మారుతీరావు
      gmrsivani@gmail.com 

 .
ఉద్యమాలూ, నిరాహార దీక్షలూ, నినాదాలూ, బుకాయింపులూ దైనందిన కార్యక్రమాలుగా మారిపోయిన ఈ రోజుల్లో - మహాత్మాగాంధీని 'పాత చీపురుకట్ట'లాగా వాడుకుంటున్న కాలంలో, 'దేశసేవ' అనే బూతుమాటని 'మాటలు కూడా సరిగ్గా చెప్పలేని ప్రతీ దోపిడీదారుడూ వాడుకుని నిచ్చెన ఎక్కుతున్న ఈనాటి వైకుంఠపాళీ రాజకీయాల్లో, లాప్ టాపులూ, గ్రైండర్లూ, మంగళసూత్రాలూ వొడ్డి - ఎవడి బాబు సొమ్ముతోనో ఓట్లు కొనుక్కోడానికి పందెం కాస్తున్న పార్టీలు పేట్రేగిపోతున్న నేపధ్యంలో, ఈ దేశంలో 'అవినీతి' ముద్రపడిన నాయకులు పిఏసి సమావేశాలకి అలా షికారు వెళ్ళినట్టు వెళ్ళి మాయమవుతున్న తమాషాని చూస్తున్న ఓ మామూలు, నేలబారు మనిషి - కేవలం 'నీతి' పెట్టుబడిగా ఎంత సాధించవచ్చునో, దాని ప్రభావం ఎంత ఉండగలదో - అన్నా హజారే గతవారం రోజులుగా నిరూపించారు. ప్రజల నైరాశ్యం, ఆవేశం అనే కార్చిచ్చు ఎంత ఉధ్రుతంగా దేశమూ, రాష్ర్టమూ, జిల్లా, గ్రామం స్థాయిని దాటి ఎలా రేగిందో కోట్లాది మంది విస్తుపోయేలాగ, ఆవేదనతో రెచ్చిపోయేలాగ చేయగలదో గత ఏడురోజులూ నిరూపించాయి. గంటల్లో ఢిల్లీ సింహాసనం పునాదుల్తో కదిలింది. నాయకులు అర్ధంకాక దిక్కులు చూశారు. నిరాహార దీక్షల్ని కమిటీల ఉచ్చులతో సుళువుగా దాటేసే పాలకులు - ఈ ఉద్యమం అలా లొంగే లాకాయి లూకాయి ఉద్యమం కాదని గ్రహించారు. గంటల్లోనే చర్చలకు దిగారు. అయితే మాటల్లో మభ్యపెట్టి, కమిటీల ఉచ్చులు బిగించి - నీతిని సమాధి చెయ్యడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. అయితే నిప్పుకి చెదలంటవు. అది శాశ్వత సత్యం. ఆ నిజం చెదలకీ తెలుసు.
ఇంటర్నెట్ చూడగలిగిన వారికి ఖండాంతరాలలో, జాతీయంగా, జిల్లాలలో, ఊళ్ళలో, గల్లీలలో - పేరు కూడా తెలీని నేలబారు మనిషి స్పందించాడు. దేశం వెల్లువై లేచింది. ఈ పాలక వ్యవస్థ అవినీతికి దేశం ఎంత విసిగిపోయిందో, ఎంతగా నేలబారు మనిషి ఆశలు వదులుకున్నాడో, ఏనాడయినా ఈ ముఖాలు కనిపించకుండా పోతాయా అని ఎంతగా ఎదురుచూస్తున్నాడో ఈ ఏడు రోజుల ఉధ్రుతం తెలిపింది. ఇది కేవలం నమూనా.
ఇదొక వెల్లువ. దీనికి మూల సూత్రం అన్నా హజారే ఆగ్రహం. కాని సమిధెలు ఎల్లెడలా ఎండి రాజుకోడానికి సిద్ధంగా ఉన్నాయి. అదే ఇప్పుడు జరిగింది. బొజ్జలు పెంచుకుని, చిరునవ్వులు చిందిస్తూ కార్లలో తిరిగే ఈ నాయకుల్ని చూసి ప్రజలు ఎంత అసహ్యించుకుంటున్నారో - ఆ విముఖతకి ఊపిరి కలిసొచ్చింది. "మీరు మాకు యజమానులు కారు. మాకు సేవకులు. మేం మీ యజమానులం. ఆ మాటని మీరు మరిచిపోతున్నారు" అని జంతర్ మంతర్ దగ్గర అన్నా హజారే బల్ల గుద్దారు.
విజయనగరంలో ఉద్యోగి చెంపని సభలోనే పగులగొట్టిన నమూనా నాయకులకి ఈ మాటలు వినిపించే ఉండాలి. వినకపోతే ప్రజలు చెవులు పిండి మరీ వినిపిస్తారు.
గాంధీగారిలాగే అన్నా  హజారే గొంతు పెద్దది కాదు. కాని బలమైనది. ఆ బలానికి మూలం నీతి. అంతకు మించి పవిత్రమైనది. 1965 లో ఇండియా పాకిస్థాన్ యుద్ధంలో పాల్గొన్న ఓ సిపాయి మహా రాష్ర్టలో అహ్మద్ నగర్ జిల్లాలోని రాలేగాం సిద్ధి అనే ఓ మారుమూల గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా ఎలా తీర్చి దిద్దారో తెలిస్తే - అవినీతిలో కూరుకుపోయిన వ్యవస్థ కాదు - నీతికి నిలబడిన ఒక్కడు - ఒకే ఒక్క వ్యక్తి ఏం చేయగలడో అర్ధమవుతుంది. 1975 లో రాలేగాం ఒక కుగ్రామం. ఇప్పుడది మన దేశంలోనే సంపన్నమయిన గ్రామం. స్వయం సమృద్దితో, వాతావరణ కాలుష్యానికి దూరంగా, సామరస్యంతో జీవించే ప్రాంతం.
ఈ వ్యవస్థని బాగు చెయ్యాలంటే ఏం చెయ్యాలి? అని నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు. అతి చిన్న సమాధానం. వ్యక్తి బాగుపడాలి. నీ స్థాయిలో నువ్వు చిత్తశుద్ధితో నీ జీవనాన్ని తీర్చిదిద్దుకుంటే - నీ సమీప వాతావరణంలో జ్యోతిలాగా ప్రజ్వలిస్తావు - అన్నా హజారే ఆ పనే చేశారు. ఆయన్ని భారత ప్రభుత్వం పద్మభూషణ్ గౌరవంతో సత్కరించింది.
విద్యార్ధులు, యువకులు, సినిమా నటులు, కార్పొరేట్ సంస్థలు - అందరూ అన్నా హజారేకి మద్దతు పలికారు. కిరణ్ బేడీ, బాబా రాందేవ్, ధోనీ, అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్ - ఒకరేమిటి? వేలాదిమంది - అన్నా హజారేని చూడని, తెలియని కోట్లాది మంది స్పందించారు. కారణం ఆ వ్యక్తిని తెలియకపోవచ్చు. కాని వారు మ్రగ్గుతున్న ఈ సమస్యకు కారణమెవరో తెలుసు.
42 సంవత్సరాలుగా కేవలం 8 సార్లు జన లోక్ పాల్ బిల్లుని పార్లమెంటులో ప్రవేశపెడుతూనే ఉన్నారు. కాని ఆ బిల్లు హసీం ఆలీలు, సురేష్ కల్మాడీలు, బాలకృష్ణన్ లూ ఉండగా - ప్రజాప్రతినిదుల ప్రాతినిధ్యంతో అవినీతి జరిపిన ఏ వ్యక్తి అయినా, ఏ నాయకుడినయినా నిలదీయగల వ్యవస్థని ఎందుకు ఏర్పరుస్తారు?
ఈ నిరాహార దీక్ష విశేషం ఏమిటంటే - ఈ అవినీతిలో అతి చక్కని వాటా ఉన్న దేవ గౌడలూ, మన రాష్ర్ట నాయకులూ, గడ్కరీలూ - అన్ని ప్రతిపక్షాలవారూ మద్ధతు పలికారు. ఎందుకు? వారు ప్రతిపక్షాలలో ఉన్నారు కనుక. దొంగలే దొంగల్ని ఎదిరించే ఉద్యమానికి మద్దతు పలకడం గమనార్హం. ఇదే తంతుని 63 ఏళ్ళుగా వీరు సాగిస్తున్నారు. ఈ వినోదానికి, ఈ వికృతమైన ఆత్మవంచనకి మనమంతా ఇన్ని సంవత్సరాలుగా ప్రేక్షకులం.
ముంబైలో వేలమంది విద్యార్ధులు "నేను అన్నా హజారే!" అని గాంధీ టోపీలు పెట్టుకుని ఊరేగింపులు జరిపారు. మరెందరో నిరాహార దీక్షలు జరిపారు. జరుపుతున్నారు. జమ్మూ, ముంబై, బెంగుళూరు, భోపాల్, ఢిల్లీ, విశాఖపట్నం, హైదరాబాదు - ఇలాంటి తిరుగుబాటు చూసి చాలాకాలమైంది.
అక్టోబరు విప్లవం గురించి మనకు తెలీదు. విన్నాం. కాని ఇది ఏప్రిల్ విప్లవం. ఇలాగే వ్యవస్థ కుళ్ళి పురుగులు పడితే అక్టోబరు విప్లవానికి ఎంతో దూరం లేదు. ఎప్పుడయినా కుళ్ళి, మురిగిన భూమిలోంచే పవిత్రమైన పద్మం తలెత్తుతుంది.
ప్రస్థుతం అన్నా హజారే అందుకు ప్రాణం పోసిన విత్తు.
 

 ***
ఏప్రిల్ 11, 2011

       ************               ************           *************          *************
Also meet Maruthi Rao Garu in his telugu blog gollapudimaruthirao.blogspot.com
Read all the columns from Gollapudi  గొల్లపూడి గారి మిగతా కాలంస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి


KOUMUDI HomePage