సెక్సీకథ
గొల్లపూడి మారుతీరావు

      gmrsivani@gmail.com

    సెక్స్ వస్తుతః జంతు ప్రవృత్తి. సంస్కారం దానికి ముసుగు. అందం సాకు. పరపతి పెట్టుబడి. వ్యభిచారం వ్యాపారం. పోలీసు దర్యాప్తు ముఖం దిగదుడుపు.
మనిషి ఈ ప్రాధమిక దశకి పెద్ద ప్రయత్నం అక్కర్లేకుండా అతి సుళువుగా, అతి త్వరగా దిగజారిపోగలడు - అది అతని స్వభావ దశ కనుక.
కృతయుగంలో సెక్స్ కేవలం సంకల్పం. త్రేతాయుగంలో ఆలోచన. ద్వాపర యుగంలో అనుషంగం. కలియుగంలో సంఘర్షణ. ఈ యుగంలో మనిషి సమగ్రతను సాధించిన పూర్తి జంతువు. విచక్షణ, పదవి, సంపద, సంస్కారం, పరువు - వీటన్నిటినీ మరిపింపజేసే ప్రవృత్తి, క్రీడ - సెక్స్.
అసలు - మధ్యధరా సంస్కృతిలోనే - అలనాటి పురాణాలు, చరిత్ర, సాంఘిక జీవనంలోనూ సెక్స్ ఒక బలమైన ఆయుధం. మహాభారతంలో కరువు కాటకాలు ముసురుకున్న ప్రాంతంలో వర్షాలు కురియడానికి మహాయాగం తలపెట్టారు. చేసే ఋత్విక్కు ఋశ్యశృంగుడు. అతనికి పుట్టుకనుంచే స్త్రీ అంటేనే తెలియదు. ఆయన్ని సామ్రాజ్యానికి తీసుకురావడానికి ఒక దేవ వేశ్యని నియోగించారు. ఆమె పేరు వైశాలి. ఇది ప్రముఖ రచయిత ఎం.టి.వాసుదేవన్ నాయర్ అద్భుత చిత్రం.
ఎవరైనా మహా తపస్సు చేస్తే - తన ఇంద్రపదవి ఊడుతుందని భయం కలిగినప్పుడు - ఇంద్రుడు ఏం చేస్తాడు? తపస్సుని భగ్నం చెయ్యడానికి ఒకే ఒక మార్గం. సెక్స్. దేవవేశ్యల్ని పురమాయిస్తాడు. మహర్షి విశ్వామిత్రుడంతటివాడు మేనక ముందు బలాదూరు అయిపోయాడు.
ఇంత ఉదాత్తమయిన ఉదాహరణలు చెప్పడానికి కారణం - నిన్నకాక మొన్న తారా చౌదరి ఉచ్చుల్లో పడిన పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, విద్యార్ధులు ఏ మాత్రం సిగ్గుపడనక్కరలేదని. వారందరూ మహర్షి ఋశ్యశృంగుని వారసులుగా గుర్తుంచుకోవాలి.
ప్రతీ వ్యవస్థలోనూ ఒక తార ఉంటుంది. అలనాడు క్లియొపాత్రా ఉంది. 1963 ప్రాంతాల్లో బ్రిటిష్ రాజకీయ వ్యవస్థని పునాదుల్తో కదిపిన క్రిస్టిన్ కీలర్ కథని మనమింకా మరిచిపోలేదు. అప్పటి ప్రధాని మాక్మిలన్ మంత్రివర్గంలో రక్షణ మంత్రి ప్రొఫ్యూమో 1961లో ఆ అమ్మాయిని కలిసి వ్యామోహంలో పడ్డారు. అదంతా పెద్ద కథ.
మొన్నటికి మొన్న మోనికా లెవెన్ స్కీ అమెరికాలో శ్వేతభవనాన్ని వణికింపజేసింది. బిల్ క్లింటన్ దొరగారితోనే శృంగారం నెరిపింది. 1995 - 97 మధ్య జరిపిన ఈ రంకుని సాటి ఆడవారితో పంచుకోవడం సరదాగా ఉంటుంది. ఆమె తన సహచరురాలు లిండా ట్రిక్ తో ఈ రంకు కథలు చెప్పుకుని ఆనందించేది. లిండా ఈ కథల్ని బుద్ధిగా రికార్డు చేసింది. తర్వాత ప్రపంచానికి తెలిసింది.
ప్రస్తుతం తారాచౌదరి అనే శృంగార మూర్తిని లక్ష్మి అనే విశాఖపట్నం అమ్మాయి వీధిన పెట్టిందికాని తారా చౌదరికి తెలుసు ఇలాంటి ఒకరోజు వస్తుందని. అందుకనే డిజిపీలు, డి.ఎస్పీలు, పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు, వ్యాపారవేత్తలు, సినీ ప్రముఖులు తదితర పెద్దల శృంగార లీలల టేపులూ, వీడియోలూ సిద్ధంగా ఉంచుకుంది. నిన్న ఆవిడ టీవీ కెమెరాల ముందు స్పష్టంగా చెప్పింది - ఇవన్నీ బయటపెట్టడం తన ఉద్దేశం కాదని. రాజకీయనాయకులు పదవితో బెదరిస్తారు. ఆమె 'పరువు'తో బెదిరిస్తుంది. అవసరమైనప్పుడు అడపా తడపా డబ్బు చేసుకుంటుంది. మనిషిలో జంతువు మేల్కొన్నప్పుడు చేసే పనులను పెద్దమనిషి ముసుగు తొడుక్కున్నప్పుడు ఎవరూ గుర్తుచేసుకోవాలనుకోరు. అది తారకూ తెలుసు. పెద్దమనిషి తనాన్ని పెట్టుబడిగా ఉపయోగించుకునే పెద్దలు ఈ మధ్య 'మందు' కుంభకోణాల్లో వీధిన పడి ఎలా గింజుకుంటున్నారో మనం చూస్తున్నాం. మందు ప్రసక్తే అవినీతి అని చెప్పిన మహాత్ముని పార్టీ జెండా ఎగురవేసే ఈ సభ్యులంతా నీతికి కొత్త అర్ధాలు కల్పించే వ్యవస్థ నేపధ్యంలో ఆ 'నీతి'కి ధర కట్టే తారలు ఉండడం విడ్డూరమూ కాదు. విశేషమూ కాదు.
తారా చౌదరి అరెస్టయాక ఆమె లాప్ టాపుల్లో, సీడీల్లో బయట పడిన పెద్దల్ని లోపాయకారిగా పోలీసులు చాకచక్యంగా బ్లాక్ మెయిల్ చేస్తున్నారనే ఓ కథనం వినవచ్చింది. పాపం. బంజారా హిల్స్ పోలిసు అధికారి తనని పక్కలోకి ఆహ్వానించాడని తార కోర్టులో చెప్పుకుంది. ఇంత విస్తృతమైన రంకుని బయట పెట్టే పోలీసులందరూ మహాత్మా గాంధీ వారసులయి ఉంటారని మనం ఊహించడం, ఆశించడం అన్యాయం. నోరూరించే పాయసాన్ని వండుతున్న వంటవాడు ఒక కిస్మిస్ పండుని నోట్లో వేసుకోబోవడం అబ్బురం కాదు. పురుషులందు పుణ్య పురుషులు నిన్నటి బూతుమాట. జంతువులందు కొత్త జంతువులు నేటి సాధారణాంశం.
ఇలాంటి మరొక తారామణి కథ - గుంటూరు శ్రీదేవి హైదరాబాదులో చేస్తున్న వ్యాపారం కూడా ఇప్పుడే వెలుగులోకి వచ్చింది. గురజాల మాజీ ఎమ్మెల్యే నరిసిరెడ్డిగారు ఈ గుట్టును బయట పెట్టారని టీవీలు చెపుతున్నాయి.
ఆయా స్థాయిలను బట్టి, పదవులను బట్టి - ముందు ముందు ఆయా వ్యక్తుల ఉపయోగాన్ని బట్టి (తెనాలి రాజకీయ నాయకులొకాయన తారకు ప్రియతమ ముఖ్య మంత్రి రాజశేఖర రెడ్డిగారితో ఫోటో తీయించారట.) సరసమయిన ధరలకు మనుషుల్లో జంతు ప్రవృత్తిని మచ్చికచేయడానికి అలవాటు పడింది తార. ఇంకా అలనాటి సినీతార యమున (ఒక హిట్ సినీమా 'పుట్టింటి పట్టుచీర'లో నా కూతురుగా నటించింది), సైరాబాను, భువనేశ్వరి, జ్యోతి - ఈ జాబితా అనంతం.
మర్రిచెట్టుకు మామిడికాయలు కాయవు. గంజాయివనంలో తులిసిమొక్కలు పెరగవు. తారా చౌదరులకు ఆలవాలమయిన వ్యవస్థలో - ఒక రిటైర్డ్ డీజీపీ, ఆంధ్ర ప్రాంతపు పార్లమెంటు సభ్యులు, తెలంగాణా ఎమ్మెల్యేలు, ఆంద్రదేశపు ఆరుగురు ఎమ్మెల్యేలు, సినీ ప్రముఖులు, ఎనిమిదిమంది రాజకీయ నాయకులు, 20 మంది వ్యపారవేత్తలు - వీరందరి రాసక్రీడలు తార టేపుల్లో ఉన్నాయి. ఇదంతా 2జి కంటే అతి విలువైన, అతి ముచ్చటైన సమాచారం. 2జి కేవలం మనిషి ప్రలోభాన్ని బయటపెట్టే కథ. ఇది మనిషి నైతిక పతనానికి అద్దం పట్టే కల.
కిందటి తరం నాయకులు బొత్తిగా అసమర్ధులు, పిరికివాళ్ళు. వాళ్ళు ఒక ఎమ్మార్ పనిని చేసుకోవడం తెలీదు. ఒక బోఫోర్స్ వ్యవహారం చేతకాదు. ఏదీ? తెన్నేటి విశ్వనాధం, టంగుటూరి ప్రకాశం, చండ్ర రాజేశ్వర రావు, గోవింద వల్లభ్ పంత్ లకు ఇలా తారా చౌదరిని ఆశ్రయించే దమ్ముందా?
ఎంత చెట్టుకి అంతగాలి. నేటి వ్యవస్థలో విశృంఖలమైన జంతు ప్రవృత్తికి తారా చౌదరి అందమైన భూతద్దం.



                                       
ఏప్రిల్ 16, 2012  

   ************               ************           *************          *************
Also meet Maruthi Rao Garu in his telugu blog gollapudimaruthirao.blogspot.com
Read all the columns from Gollapudi  గొల్లపూడి గారి మిగతా కాలంస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి


KOUMUDI HomePage