Click Play to listen audio of this column
If you have issues with Voice clarity, upgrade your Flash Player Version. Click Here 
 
అవ్యవస్థ
గొల్లపూడి మారుతీరావు

      gmrsivani@gmail.com

   నిన్న ఇంగ్లీషు వార్తల ఛానల్‌లో నలుగురయిదుగురు మహిళలు -'త్వరగా విడాకులు' ఇచ్చే చట్టం గురించి చర్చిస్తున్నారు. వారందరూ స్త్రీలకు ఇంకా దక్కని స్వాతంత్య్రం గురించీ, ఆర్థిక స్తోమతు గురించీ, భర్త ఆస్తిని పంచుకునే హక్కుని గురించీ -యిలాంటివన్నీ ఆవేశంగా, అర్థవంతంగా, అనుభవపూర్వకంగా మాట్లాడుతున్నారు. అందరూ ప్రసిద్ధులయిన మహిళలు. అందరి ఉద్దేశమూ, ఆదర్శమూ అభినందనీయం, వాంఛనీయం. కానీ వారంతా నేలవిడిచి సాము చేస్తున్నారని నాకనిపించింది. నిజానికి -చాలారంగాలలో 'ఆధునికం' పేరిట -మనం ఎన్నో సంవత్సరాల నుంచీ నేలని విడిచాం. మనకాళ్లు నేలమీద లేవు. మన కళ్లు మనకి అక్కరలేని, పొంతనలేని, బొత్తిగా పొసగని విదేశీ వ్యామోహం మీద ఉంది. ఆకర్షించే, తాత్కాలిక ప్రయోజనాలను తీర్చే, అవసరాలను తీర్చుకునే, ఆనందానికి ఆలంబనగా నిలిచే 'సాము'లు చేస్తున్నాం. వాటికి రకరకాల 'సాకు'ల పూటుల్ని సిద్ధం చేసుకుంటున్నాం.
ఈ రోజునే పేపర్లో ఒక వార్త. ముంబైలో రమేష్‌ షినాయ్‌ (30) తన భార్య ప్రీతి తన బట్టలు సరిగ్గా మడతపెట్టడం లేదనీ, వంట చెయ్యడం లేదనీ, ఇంకా ఆర్థిక కారణాలు చూపి కేవలం నాలుగు నెలల క్రితమే కోరి పెళ్లి చేసుకున్న భార్య నుండి విడాకుల్ని కోరుకుంటున్నాడు!
ఈ దేశంలో 'విడాకుల' అవసరం ఒక వ్యవస్థ పతనానికి నిదర్శనం. ఇంకా ఏ కాస్తో, ఎంతో కొంత బలహీనంగా తూర్పు ఆసియా దేశాలలో ఈ వ్యవస్థ బతికి ఉంది. ఇప్పుడిప్పుడు -మనం కూడా ఆ వ్యవస్థలో పాశ్చాత్య దేశాలతో పోటీ పడుతున్నాం. నా మట్టుకు నాకే -జీవితంలో రెండుసార్లు పెళ్లి చేసుకుని విఫలమయిన 35 ఏళ్ల అమ్మాయిల్ని -ప్రసిద్ధుల్ని -కనీసం ముగ్గుర్ని తెలుసు. విడాకులు తీసుకునో, అవసరం లేకో -భర్తలకి దూరంగా ఉంటున్న స్త్రీలని కనీసం 15 మందిని తెలుసు. వారందరూ బాగా చదువుకున్నవారు. అందమయినవారు. పిల్లలు గలవారు. వయస్సులో ఉన్నవారు.
ఇప్పుడిప్పుడు మనకి తొందరగా విడాకులు తీసుకునే సౌకర్యం కూడా కలిసివచ్చింది. ''ఆత్మహత్యకు దగ్గర తోవ'' వంటి మెలకువ ఇది. ఎంతో ఆలోచనతో, ముందుచూపుతో, పరస్పరం సహజీవనం చేసే ఒద్దికతో -పిల్లల భవిష్యత్తునీ, విలువల్నీ, శ్రేయస్సునీ, దక్షతనీ, పెద్దల వృద్దాప్యపు అవసరాల్నీ కాపాడే లక్ష్యంతో ఒక సమగ్రమైన ప్రణాళికగా ఏర్పడిన వివాహ వ్యవస్థ యిప్పుడిప్పుడు ఛిన్నాభిన్నమవుతోంది.
కూతురు అమెరికాలో ఇజ్రేలీ వ్యక్తిని ప్రేమిస్తుంది. తల్లి ఇండియాలో ఒంటరిగా వండుకు తింటూంటుంది. తల్లీ తండ్రీ వృద్ధాశ్రమంలో ఉంటారు. భర్త ఓ తాత్కాలిక భార్యతో కాపురం చేస్తూంటాడు. తాత్కాలికం ఎందుకు? ఇప్పటి భార్యకి ఆదాయం, వేరయిన భర్త, ఆధారపడే కొడుకూ ఉన్నారు కనుక. ఇద్దరూ 'రేపు' గురించి చర్చించుకోరు -ఇద్దరి రేపూ ఒకటి కాదు కనుక. ఎంతకాలం ఇలా? ఒకావిడని అడిగాను. నవ్వి -సాగినంతకాలం -సాగుతోంది కదా? అంది. ఆ నవ్వులో గర్వం లేదు. తృప్తి లేదు. తప్పనిసరి అయిన రాజీ వుంది. రాజీ ఎందుకని? ఏ దశలోనో తీసుకున్న నిర్ణయం పట్ల తొందరపాటా? ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం స్నేహమయి, ప్రేమగా మారి, అనుబంధంగా స్థిరపడడానికి వ్యవధి కావాలి. ఇద్దరి అవగాహనా కావాలి. త్యాగాలు కావాలి. ఇప్పటికీ -మా ఆవిడ నామీద కేకలేస్తే -గత ఏభై ఏళ్లలో అంతకన్న ఘోరంగా కేకలేసి నా మాటని చెల్లించుకున్న వెయ్యి సందర్భాలు గుర్తు చేసుకుని నోరుమూసుకుంటాను. వెయ్యి రాజీల పెట్టుబడి, 50 ఏళ్ల వ్యవస్థ యిచ్చిన దన్ను. అవసరమా ఇది? ఎవరు నిర్ణయిస్తారు? పెళ్లయిన రెండో ఏటనే విడాకులా? పరవాలేదు. నాలుగో నెలకే విడాకులా! మీ తాతని అడగండి. మీ అమ్మా నాన్నా గంజి తాగి అయిదు రూపాయలు పంపడం ద్వారా పట్నంలో మీ చదువుని సాగనిచ్చిన వారి త్యాగాన్ని అడగండి. అది సమష్టి కార్యం. ఎప్పుడూ విలువల్ని పరిణామాల ఫలితాలతో కాదు వ్యక్తుల పెట్టుబడితో, పరిణతితో బేరీజు వెయ్యాలి.
జాతిలో సంప్రదాయ వైభవం కొరవడుతోంది. అమెరికాలో ఇజ్రేలీ ప్రియుడు 'జన గణ మణ' పాడడు. ''ఫలానా వ్యక్తి ఫలానా మహానుభావుడి తరం'' అని చెప్పుకునే గర్వం పోయింది. ఈలోగా భర్తలో, ప్రియునిలో, జీవితమో 'జీన్స్‌'ని కలగాపులగం చేసేసింది. చేస్తే నష్టమేం? అది అభిశప్తుడి ఆఖరి వైరాగ్యం.
ఓ వ్యవస్థ నిలదొక్కుకోడానికి -అది ఏ వ్యవస్థ అయినా -అక్టోబరు విప్లవం అయినా -వ్యక్తుల త్యాగాలు కావాలి. చెట్టు పెరగాలంటే నీరు పట్టాలి. ఆ త్యాగాలు ఒకప్పుడు సంప్రదాయం, కట్టుబాట్లు, సదాచారం, కుటుంబ పరపతి, పెద్దల ఆంక్షలు -వీటిలో వేటి కారణంగానో సాగుతూ వచ్చాయి.
మా అమ్మ మారుటి తండ్రి దగ్గర నన్ను పెంచలేదు. మా పొరుగింటి అమ్మకి తన కూతురు పెళ్లి చేసుకున్న దెవర్నో తెలీదు. ఇంకాస్త ముందుకి వెళ్తే ఆ కూతురుకే తెలీదు. తెలిసేనాటికే తత్తరపాటు, విడాకులు. హఠాత్తుగా వచ్చిన ఆర్థిక స్వాతంత్య్రం -కొంత ఆత్మస్థైర్యాన్ని, చిన్న అహంకారాన్ని, అనాదిగా వస్తున్న పురుషాధిక్యతని సజావుగానే ప్రశ్నించే నిజాయితీని -యిన్నిటిని ఇచ్చింది. పాపం. మా అమ్మకి ఇవేవీ తెలీవు. ఆవిడ ఆఖరి రోజుల్లో కొడుకుని పది రూపాయలు అడిగేది -ఎవరయిన దండం పెడితే యివ్వడానికి. ఆమె సమాజ ధర్మాన్ని పాటించి జీవనాన్ని సాగించిన నేలబారు జీవి.
అనూహ్యమయిన వెర్రితలలు వేస్తున్న -పిచ్చి పిచ్చి ఆలోచనల ప్రోగుగా తయారయిన ప్రపంచ చలన చిత్రరంగంలో -మొన్నటికి మొన్న బెర్లిన్‌లో గోల్డెన్‌ బేర్‌ని పుచ్చుకున్న ఉత్తమ ఇరాన్‌ చిత్రం (విచిత్రంగా ఆ సినిమా పేరు 'సెపరేషన్‌' అంటే విడాకులు!). భార్య భర్తనుంచి విడాకుల్ని కోరుకుంటుంది. భర్త అంగీకరిస్తాడు. (11 ఏళ్ల కూతురు తండ్రితో ఉండాలని కోరుకుంటుంది.) ఎందుకు? 80 ఏళ్ల రోగిష్టి తండ్రిని సాగడానికి.
ప్రపంచంలో ఏ మూలనో ఇంకా కుటుంబ వ్యవస్థని పట్టుకు వేలాడే సభ్య సమాజాలున్నాయి. మనం విడాకుల్నీ వీలయినంత శీఘ్రవంతం చేసుకుంటున్నాం.
మన వివాహంలో 'స్థాళీపాకం'లో ఒక మంత్రాన్ని భర్త భార్యతో చెప్తాడు -ఆమె రెండు చేతులూ పట్టుకుని 'నాకు నీ ద్వారా పదిమంది సంతానాన్ని యివ్వు (ఎందుకు? ఈ సమాజ ధర్మాన్ని కాపాడడానికి) నేను నీకు పదకొండో సంతానాన్ని అవుతాను' అని.
వీలుంటే విడాకుల కోర్టుల్లో గోడలకి ఈ శ్లోకాన్ని అతికించండి. ఈ దేశంలో వివాహ వ్యవస్థ శరీర స్పర్శకి ముందుగానే స్త్రీలో తల్లిని చూడడం, ఆశించడం నేర్పిందని ఒకరికొకరు దూరం కావాలని కోరుకునే ఈ కాలం ముంబై మార్కు భార్యభర్తలకి అర్థమవుతుందని.

                                       
మే 07, 2012  

   ************               ************           *************          *************
Also meet Maruthi Rao Garu in his telugu blog gollapudimaruthirao.blogspot.com
Read all the columns from Gollapudi  గొల్లపూడి గారి మిగతా కాలంస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి


KOUMUDI HomePage