ఈ శతాబ్దపు హిమనగం

గొల్లపూడి మారుతీరావు
      gmrsivani@gmail.com  


నాకు తెలిసి గత వంద సంవత్సరాలలో ముగ్గురే ముగ్గురికి తమ జీవితకాలంలోనే శతజయంతి ఉత్సవాలు జరిగాయి. ఒకరు: ప్రముఖ ఇంజనీరు, భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య, కంచి కామకోటి పీఠాధిపతి, పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతీస్వామి, మూడవ వారు సంగీత కళానిధి, పద్మభూషణ్‌, కళాప్రపూర్ణ డాక్టర్‌ శ్రీపాద పినాకపాణి. నా ఉద్దేశంలో వందేళ్లు బ్రతకడానికి శరీర ఆరోగ్యంకంటే ముఖ్యమైందీ, అవసరమైందీ మరొకటి ఉన్నదని, జీవితం పట్ల ఒక ఆరోగ్యకరమైన దృక్పథం, ఒక ఉదాత్తమయిన వర్తన కేవలం ఆహారంకంటే మరేదో జీవలక్షణాన్ని ప్రోదు చేస్తుంది.ఈ మధ్య ఆయన పాత పేపర్లని వారబ్బాయి తిరగేస్తూండగా ఆ రోజుల్లో రేడియోలో పాడినందుకు గాను యివ్వగా మార్చుకోని ఎన్నె చెక్కులు బయటపడ్డాయట. ఆయన జీవితంలోఎందరో సత్కరించిన బంగారు పతకాలు తను సంపాదించినవి కావని నమ్మి -భద్రాచలంలో సీతమ్మకి పాదుకలు చేయించాలని సంకల్పించారు. అయితే విగ్రహాలకు అవి అమరవని ఆలయ అధికారులు చెప్పిన మీదట సీతమ్మకు వడ్డాణం చేయించారు. ఈ రెండు సంఘటనలూ ఆయన కీర్తి ప్రతిష్టలూ, సంపాదనకు అతీతమైన మరేదో స్థాయిలో తన దృక్పధాన్ని నిలుపుకున్నారని అర్థమౌతుంది. ఇదే నేను చెప్పిన ఆ 'మరొకటి'. ఇది ఒక కారణం. యోగశాస్త్రం రీత్యా 'ప్రాణాయామం' చిరంజీవత్వానికి దగ్గర తోవ అన్నది లోకవిదితం. మరి 88 సంవత్సరాల పాటు వందలాది వేలాది ప్రయోగాలతో ఎన్నో రాగాలను లయబద్ధంగా, శృతిబద్ధంగా గానం చేసిన గాయకులు -ఆ యోగాన్ని మరొక ఉన్నత స్థాయిలో ఉపాసన చేశారు. తన శరీరాన్ని ఒక శృతిబద్ధమైన వాద్యంగా తీర్చిదిద్దుకున్నారు. అది మహాయోగం. దీన్ని తపస్సులాగ నిర్వర్తించి చిరాయువుని పొందిన మరికొందరి ఉదాహరణలు -శెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్‌, ఎమ్‌.ఎస్‌.సుబ్బులక్ష్మి, డి.కె.పట్టామ్మాళ్‌. నా జీవితంలో ప్రత్యేకమైన అదృష్టం శ్రీపాదవారి ఇంటి అల్లుణ్ణి కావడం. పినాకపాణి గారి పెద్దన్నయ్యగారు నాకు పిల్లనిచ్చిన మామగారు. 51 సంవత్సరాల కిందట పినాకపాణి గారు నా పెళ్లిలో చాంబరు కచ్చేరీ చెయ్యడం నాకు గొప్ప జ్ఞాపకం. ఆనాడు వారు పాడిన ఒక కీర్తన కూడా గుర్తుంది. కాపీనారాయణి రాగంలో త్యాగరాజ కీర్తన 'సరససామదాన'. తర్వాత నేను ఆలిండియా రేడియోలో చేరడం -వారితో, వారి సంగీతంతో మరింత దగ్గర సంబంధం ఏర్పడింది.
నేను కడప రేడియో స్టేషన్‌ ఇన్‌చార్జిగా ఉన్నప్పుడు పినాకపాణిగారు కచ్చేరీకి వచ్చారు. అది 1981. ప్రముఖ మృదంగ విద్వాంసులు పాల్గాట్‌ మణి అయ్యర్‌ అంతకుముందే గతించారు. ఆ సందర్భాన్ని గుర్తు చేస్తూ ''ఆయన పోయినప్పుడు వారి పాత రికార్డింగులు ప్రసారం చేశారు. మా రికార్డింగులేమైనా ఉంచుతున్నారా?కాలం ఒక్కలాగ ఉండదు. ఎప్పుడేం జరుగుతుందో!'' అన్నారు నాతో. నేను నవ్వి చాలా ఉంటాయన్నాను. తర్వాత మరో 31 సంవత్సరాలు జీవించారు! ఇంకా జీవిస్తున్నారు. వారు కాలాన్ని జయించిన చిరంజీవులు. మరోసారి వారింటికి వెళ్లినప్పుడు అన్నారు: ''75 ఏళ్లు వచ్చాక నా జీవితంలో చరమ దశకి వచ్చాను. ఇక చాలు అనుకున్నాను'' అన్నారు. కాని సంగీత ప్రపంచానికి వారి నిజమైన సేవలన్నీ ఆ తర్వాతే జరిగాయి. వారి 'సంగీత సౌరభం -700 పుటల నాలుగు భాగాలు, ఇంకా ఎన్నో గ్రంథాలు ప్రచురితమయ్యాయి. ఒకసారి నాతో తిరువయ్యూరులో వారి తొలినాటి కచ్చేరీ గురించి ప్రస్తావించారు. కచ్చేరీ అయాక అరియక్కుడి వారి భుజం తట్టి ''మీ గానంలో ఎందరో సంప్రదాయజ్ఞుల బాణీలు తెలుస్తున్నాయి'' అన్నారట. ఆయన మార్గదర్శకులలో అరియక్కుడి ఒకరు. నేనన్నాను -మీరు ఆత్మకథ ఎందుకు రాయకూడదు? అని. రాస్తే ఎవరూ నమ్మరేమో! అన్నారు. ''అది వారి ఖర్మ. కాని ముందు తరాలకి మీ కథ మార్గదర్శకమవుతుంది'' అని అప్పట్లో ఆంధ్రప్రభ వారపత్రికని చూస్తున్న మిత్రులు వాకాటి పాండురంగరావుగారికి ఉత్తరం రాశాను -మీరు ఆత్మకథని వ్రాయమని పినాకపాణిగారిని ఆహ్వానిస్తే బాగుంటుందని. పాండురంగరావుగారు ఉత్తరం రాశారు. తత్ఫలితంగా 'నా సంగీత యాత్ర' రూపుదిద్దుకుంది. అదినాకు ప్రత్యేకమైన గర్వకారణం.విశ్వనాథవారు చెప్పినట్టు పినాకపాణి గారి శిష్యులు గర్వంగా 'అల నన్నయ్యకు లేదు తిక్కనకు లేదా భాగ్యము' అని చెప్పుకోగలిగే ధిషణాహంకారం చూపగలిగినంత ఉద్దండులు. ఈ పద్మభూషణ్‌ శిష్యుడు మరొక పద్మభూషణ్‌ నూకల చినసత్యనారాయణ. ఈ సంగీత కళానిధి శిష్యుడు మరొక సంగీత కళానిధి నేదునూరి కృష్ణమూర్తి. ఇంకా పద్మశ్రీ శ్రీరంగం గోపాల రత్నం, ఈ బిరుదులు లేకపోయినా ఆ స్థాయిలో నిలవదగిన మరొక గాయకులు వోలేటి వెంకటేశ్వర్లుగారు. నా అదృష్టం రేడియోలో వీరందరితోనూ కలిసి పనిచెయ్యడం. వారి మనోధర్మాన్ని ఈ తరంలో అందలమెక్కిస్తున్న రెండవతరం గాయకులు మల్లాది సోదరులు, వైణికురాలు జయలక్ష్మి శేఖర్‌. సంగీతానికి సరికొత్త బాణీని -పాణిబాణిని పరిచయం చేసిన సంగీత మూర్దన్యులు పినాకపాణి. ఈ వయస్సులోనూ వారి మనస్సంతా సంగీతమే నిండిపోయింది. ధమనుల్లో గానసుధే ప్రవహిస్తోంది. ఆ మధ్య వారిని కలిసినప్పుడు పాడుకొంటూ ''ఇంకా భైరవి పూర్తి స్వరూపం అందడం లేదండీ!'' అన్నారు గత 88 సంవత్సరాలుగా సంగీతాన్ని ఉపాసిస్తున్న ఈ రుషి. ''ఇప్పుడు వెళ్ళిపోవాలని లేదు. నాకున్నదంతా, నాకు తెలిసిందంతా నలుగురికీ పంచిపెట్టేసి, పిండేసిన గుడ్డలాగ ఈ కట్టె కట్టెలమీదకి పోవాలి'' అన్నారు. ఏ చిన్న గమకమైనా, స్వరమైనా ఆర్ద్రమై ఆయన హృదయాన్ని తాకుతుంది. కళ్లు ఆనందంతో నీటి చెలమలౌతాయి.
నూరేళ్ళ జీవితాన్ని చరితార్థం చేసుకున్న ఈ గాయకుని మరో అరుదైన అదృష్టం -గత ఎనిమిదేళ్లుగా మంచం మీదే పడుకుని ఉన్న వారిని కంటికి రెప్పలాగా సాకే ఇద్దరు కుమారులు ఉండడం -కా.పాప, డాక్టర్‌ గోపాల్‌. ఇద్దరూ ఆలయంలో మూలవిరాట్టుకి చేసినట్టు సేవలందిస్తున్నారు. మూర్తీభవించిన శ్రావణ కుమారులు. సంగీత ప్రపంచం వారికీ రుణపడి ఉంటుంది.మనస్సుని సంగీతానికి ఆలయాన్ని చేసి, జీవితాన్ని ఉపాసన చేసుకున్న ఈ శత వర్షగాయకులు మరిన్ని సంవత్సరాలు ఆరోగ్యంగా, వారి లక్ష్యం వేపు యాత్రని కొనసాగించగలరని ఆ పరమేశ్వరుడిని ప్రార్థిద్దాం.
 

 
                                                                           ఆగస్టు 13, 2012

   ************               ************           *************          *************
Also meet Maruthi Rao Garu in his telugu blog gollapudimaruthirao.blogspot.com
Read all the columns from Gollapudi  గొల్లపూడి గారి మిగతా కాలంస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి


KOUMUDI HomePage