Click Play to listen audio of this column
If you have issues with Voice clarity, upgrade your Flash Player Version.
Click Here

 

ఢిల్లీకి కొత్త గొడ్డు

             ఈ మధ్య ఢిల్లీకి ఓ అందమయిన మంత్రి చేరారు. ఆయన న్యూయార్కునుంచి తెలివైన వ్యాసాలు రాయగా మనం పత్రికలలో చదువుకున్నాం. మనకి సంబంధించని విషయాలు ఆయన చెప్తూంటే ఆనందంగా విన్నాం. ఐక్యరాజ్య సమితిలో కబుర్లు పొరుగింటి పుల్లకూరలాంటివి.  అవి వూరి, రుచి ఎక్కి నోరూరిస్తాయి. అవి విని, తిని మనం తృప్తిపడ్డాం. ఇంతకీ ఆయన పేరు శశి తరూర్. ఆయన ఆ మధ్య ఐక్య రాజ్య సమితి కార్యదర్శి కావాలని మనమంతా ఆశించాం. కొన్ని దేశాలు మద్దతు పలికాయి. ఆయన న్యూయార్కులో కార్యదర్శి అయి అక్కడి కబుర్లూ కాకరకాయలూ మనకి చెప్తూంటే మనకి తియ్యగా, పుల్లగా వినసొంపుగా వుండేవి. కాని బన్ కె మూన్ అనే ఆయన కార్యదర్శి అయిపోయారు. అటు తర్వాత ఈ అందమయిన ఉద్యోగి మనమంతా యిచ్చిన మద్దతుకి మురిసి, అది తన పరపతిగా అపార్ధం చేసుకుని- ఈ అందమయిన మేధావి ఇండియా వచ్చి - తన రాష్ట్రానికి వెళ్ళి- మొదటి సారిగా ఖద్దరు కండువా ధరించి- దేశభక్తి కబుర్లు దంచి "తెలివైన వాడు, ఉండదగిన వాడుఅని వోటర్ ని మెప్పించి, ఢిల్లీ అధిష్టానానికీ ఇలాంటి దురబిప్రాయమే కలిగించి మంత్రి అయిపోయాడు.

          ఆయన ఈ మధ్యనే అయిదారు ఖద్దరు కండువాలు కొన్నారుకాని- ఎక్కువగా ఖరీదయిన అమెరికా సూట్లూ, అమెరికా మార్కు షర్టులూ ధరిస్తారు. అమెరికా మార్కు ఆలోచనలే చేస్తారు. ఇంగ్లీషు కూడా అమెరికా ధోరణిలోనే మాట్లాడుతారు. అంతేకాదు. మంత్రి అయితే అయారుకాని- వారికి భారతీయుల పట్ల, రాజకీయ నాయకుల పట్ల, ఇక్కడి విమాన సంస్థల పట్ల- అమెరికా ఆస్ట్రేలియావారికున్న చిన్న చూపే వుంది. ఈ మధ్య ఎన్నికలు కనుక "మెరుగయిన ప్రశంసల్ని గుప్పించారుకాని- వారికి భారతీయులు "గొడ్లువంటి వారని, ముఖ్యంగా విమాన సంస్థలు గొడ్ల చావిడీలు నడిపే పాలెగాండ్రని- యిలాంటి సదభిప్రాయాలున్నాయి.

          అవడానికి మంత్రి అయారే కాని- వారికి మంత్రులుండే బంగళాలు నచ్చవు. వారు బతికే ధోరణి నచ్చదు. వారికి రాజకీయ వాతావరణం రణగొణ ధ్వనిలాగవుంటుంది. వారి ఏకాంతానికి భంగం కలుగుతుంది. ప్రణబ్ ముఖర్జీ వంటి పెద్దాయన చెప్పారు కనుక- హొటల్ గది ఖాళీ చేశారుగాని వారికి తాజ్ హొటళ్ళలో "సూట్లలో వుండాలనే వుంటుంది.

          ఖర్చులు తగ్గించమన్న పెద్దాయన పిలుపుకి గతిలేక స్పందించి "సరే, నేనూ నలుగురిలాగే విమానాల్లో గొడ్లచావిడి క్లాసులోనే ప్రయాణం చేస్తాను అని సరిపెట్టుకున్నారు. డబ్బు తగినంత లేని, గత్యంతరం లేని, పరిస్థితులకు తలవొంచే మామూలు తరగతి భారతీయులందరూ వారికి "గొడ్లులాగ- చేసే తరగతి వారికి "గొడ్ల తరగతిలాగ కనిపిస్తుంది.(వారామధ్యనే ఈ గొడ్ల తరగతిలో కేరళ వెళ్తూ హాయిగా నిద్రపోయిన దృశ్యాన్ని ఓ అమెరికా ఫొటోగ్రాఫర్ పత్రికలో ప్రకటించారు. అయితే అది తప్పనిసరిగా గొడ్లచావిడిలో నిద్ర ముంచుకొచ్చిన సందర్భం అయివుండొచ్చు.)

          ఇవాళ వారి "గొడ్ల హాస్యాన్ని విని ఆనందించలేనివారికి క్షమాపణ చెప్తూ వారు చెప్పిన వివరణ అనిర్వచనీయం. వారు "గొడ్లు అన్నది ప్రయాణీకుల్ని కాదట. విమాన సంస్థలు ప్రయాణీకుల్ని  గొడ్లలాగ చూస్తున్నారట. మరి వారా మధ్య కేరళ వెళ్ళినప్పుడు ఏ గొడ్డుకిచ్చే మర్యాదలు చేశారో వారే తెలియజేయాలి. కొన్ని లక్షల గొడ్లు ఈ దేశంలో ప్రతీ రోజూ ఇవే చావిళ్ళలో ప్రయాణం చేస్తున్నాయనీ, ఆ గొడ్ల జాబితాలో ఇన్పోసిస్ నారాయణ మూర్తి వంటి వారున్నారని- ఏతావాతా మన దేశంలో "గొడ్లకి పవిత్రమైన స్థానం వున్నదని- ఈ అమెరికా గొడ్డుకి తెలీదు.

          క్షమాపణ చెప్తూ వారన్న మాటలు మనకి మరింత ఆనందాన్ని కలిగిస్తాయి. "ప్రజలు హాస్యాన్ని అవగాహన చేసుకుని ఆనందిస్తారన్న నా ఊహ తప్పని నేను తెలుసుకున్నాను. నా మాటల్ని వక్రీకరించేవారితో మాట్లాడకూడదని యిప్పుడర్దమయింది" అంటూ తాను "గొడ్లు అన్నది వ్యక్తుల్ని కాదని,ఎవరూ ఎదిరించలేని, పరిష్కరించలేని "సమస్యలని విమర్శకులు అర్దం చేసుకోవాలి అని అన్నారు. ఎంత గొప్ప అన్వయం!

          ఇంత తెలివైన మేధావులు యిన్నాళ్ళూ మన మంత్రి మండలిలో లేనందుకు విచారిస్తూ-వారు ఉటంకించినట్టుగానే యిలాంటి వ్యక్తి మంత్రికావడం ఢిల్లీకి కొత్త గొడ్డు (వారి మాటల్లోనే "సమస్య అనే అర్ధం లోనే) వచ్చినందుకు ఆనందిద్దాం. అయితే గొడ్డుకో తెగులు వుంటుందన్నది సామెత కనుక

ఏకాంతమూ, వ్యాయామమూ కావలిసిన ఇలాంటి "అమెరికా భారతీయుల్ని మనమంతా బతికే గొడ్లపాకల్లోకాక  ఏ అండమాన్ లోనో, లేదా ఏ మాలీ దీవుల్లోనో నివసించే అవకాశం కల్పించాలని, వీరి మార్కు హాస్యాన్ని ఆస్వాదించే స్థాయికి ఈ దేశం పెరిగే వరకూ వీరి ఏకాంతాన్ని ఢిల్లీ అధిష్టానం కాపాడాలని మనం ఆశిద్దాం. భారతీయ "గొడ్ల పాకల్లో అమెరికా "గొడ్లు నివసించడం "పాడి కాదు. (పాడిని న్యాయం అని వాడుకున్నా,పశు సంపద అని అర్ధం చేసుకున్నా నా కభ్యంతరం లేదు.)   
      **********                   *********                *********                   **********
You can mail your opinions directly to Maruthi Rao Garu at gmrsivani@gmail.com
Also meet Maruthi Rao Garu in his telugu blog gollapudimaruthirao.blogspot.com

Read all the columns from Gollapudi  గొల్లపూడి గారి మిగతా కాలంస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

KOUMUDI HomePage