Due to unavoidable reasons we could not upload Audio for this week.
  

   హాస్యపు కరువు


 
ఆ మధ్య నాగపూర్ కార్టూనిస్టు ఆసీం త్రివేదీని - కార్టూన్లు వేసినందుకు దేశద్రోహ నేరానికి అరెస్టు చేసినప్పుడు - ఈ పాలక వ్యవస్థకి, నాయకులకీ బొత్తిగా హాస్యపు రుచి తెలియదని చాలామంది దుమ్మెత్తిపోశారు.
పార్లమెంటుని పాయిఖానా తొట్టిగా, సత్యమేవ జయతే అన్న జాతీయ ఆదర్శాన్ని 'భ్రమేవ జయతే ' అన్నప్పుడు, ఆజ్మాల్ కసాబ్ ఈ దేశపు రాజ్యాంగం మీద ఉచ్చ పోసినప్పుడు - పాలక వ్యవస్థకి, నాయకులకీ బొత్తిగా హాస్యపు రుచి తెలియదని చాలామంది దుమ్మెత్తిపోశారు.
పార్లమెంటుని పాయిఖానా తొట్టిగా, సత్యమేవ జయతే అన్న జాతీయ ఆదర్శాన్ని 'భ్రష్టమేవ జయతే' అన్నప్పుడు, ఆజ్మాల్ కసాబ్ ఈ దేశపు రాజ్యాంగం మీద ఉచ్చపోసినప్పుడు - పాలక వ్యవస్థకి కోపం రావడం సహజమే.
కవ్వించి నవ్వించే కార్టూన్లు అంతగా బరితెగించాలా? అని కొందరు అనుకోవడమూ సహజమే. కార్టూన్లు చిన్న చురకలు. వాస్తవాన్ని అన్వయించే చిన్న మెలికలు. జరిగిన సంఘటనలో అసందర్భాన్నో, విపర్యాన్నో ఎత్తి చూపే ఒక సున్నితమైన ప్రక్రియ. అంతే దాని పరిమితి. కార్టూన్ బరితెగించకూడదు. అయితే బరితెగించిన కార్టూన్ 'దేశద్రోహం' అవుతుందా? అసమర్ధు డయిన కుర్రాడి చేతిలో తుపాకీ అతడిని హంతకుడిని చేస్తుందా?
ఇది మరో కథ. మరో మీ మాంస. ఏమయినా ఈ పాలకవ్యవస్థకి, నాయకులకీ హాస్యాన్ని ఆస్వాదించే అభిరుచి లేదని ఈ మధ్య వాపోయారు. 'ఇండియా టుడే' - ఈ విషయమై ఒక ప్రత్యేక సంచికనే ప్రచురించింది. ఈ విమర్శకి సమాధానాన్ని ఈ మధ్య మన నాయకులు సమృద్దిగా సమాధానం చెప్పారు. హాస్యం విషయంలో తాము తీసిపోమని నిరూపించారు. ఇందుకు బోలెడన్ని ఉదాహరణలు:
కాంగ్రెసు నాయకులు దిగ్విజయ సింగుగారు "అరవింద్ క్రేజీవాల్ అవినీతి ముసుగు విప్పుతానంటున్నాడు. ఆయనా, రాఖీసావంత్ ఎంత విప్పినా లోపల సరుకు ఏమీలేదు" అన్నారు.
ఈ జోక్ కి 90 కోట్లు ఖర్చవుతుందని పాపం, సింగుగారికి తెలీదు. రాఖీ సావంత్ ప్రస్తుతం దిగ్విజయ సింగ్ గారి మీద పరువు నష్టం దావా వెయ్యబోతున్నారు.
భారతీయ జనతా పార్టీ నాయకులు యశ్వంత సిన్హా గారు రాహుల్ గాంధీ గురించి మాట్లాడుతూ : రాహుల్ గాంధీ పెళ్ళిలో పెళ్ళికొడుకు ఎక్కే గుర్రం లాంటివాడు. అదెప్పుడూ ఒకే చోట ఆగిపోతుంది. ముందుకి కదలదు. రాహుల్ గాంధీ అంతే. ఆయన్ని కదపాలని మన్మోహన్ సింగుగారు మరి కొందరు నాయకులు ఎంత ప్రయత్నించినా ఆయన కదుల్తే కద - అన్నారు.
ఇక ఛత్తీస్ గడ్ ముఖ్యమత్రి రమణ్ సింగుగారు తమ రాస్ట్రంలో ఆక్సిడెంట్ల గురించి మాట్లాడుతూ - అందమయిన మోటారు సైకిళ్ళూ, అందుబాటులో ఆక్సిడెంట్ల గురించి మాట్లాడుతూ - అందమయిన మోటారు సైకిళ్ళూ, అందుబాటులో ఉండే మొబైలు ఫోన్లూ, వెనుక అందమైన గర్ల్ ఫ్రెండ్స్ కూర్చుంటే - ఆక్సిడెంట్లు జరగకుండా ఎలా వుంటాయి? అన్నారు.
వయసు మళ్ళిన మన కేంద్ర బొగ్గుగనుల మంత్రి శ్రీ ప్రకాష్ జైస్వాల్ గారు కాన్ పూర్ కవి సమ్మేళనంలో మాట్లాడుతూ - శ్రీ లంకలో 20ఓవర్ల మాచ్ లో పాకిస్థాన్ మీద ఇండియా విజయాన్ని గురించి ఓ ఉపమానం చెప్పారు. కొత్త విజయం, కొత్త పెళ్ళి మీద ఎప్పుడూ మోజు ఎక్కువ. పాతబడుతున్న కొద్దీ పెళ్ళాల మీద మోజు తగ్గిపోతుంది - అన్నారు. మంత్రిగారన్నారు గనుక ఇది తప్పు పట్టాల్సిన విషయమైపోయింది.
గుజరాత్ కాంగ్రెసు అధ్యక్షులు అర్జున్ మద్వారియాగారు నరేంద్ర మోడీని కోతి అన్నారని చాలామంది తప్పుబట్టారు. ఆయన నెత్తీ నోరూ కొట్టుకుంటూ "నేను అలా అనలేదు బాబూ. ఆయన్ని ఏ ప్రాణితోనూ నేను పోల్చలేదు. అందునా కోతి అని ఎలా అంటాను? కోతి మన పూర్వీకులు. మన పూర్వీకుల్ని మనం గౌరవించుకోవాలి కదా? అందుకని ఈ పోలిక సరికాదు" అన్నాఉర్. ఆరోపణ కంటే వివరణ మరింత ఘాటుగా ఉంది.
ఇక ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగుగారు తాము మహిళా రిజర్వేషన్ బిల్లుని ఎందుకు వ్యతిరేకిస్తున్నారో బయట పడ్డారు. "బాబూ, పల్లెటూళ్ళలో మన ఆడవాళ్ళు అందంగా ఉండరు. ఈ బిల్లువల్ల వారికి అన్యాయం జరుగుతుంది" అన్నారు.
బిజేపీ ప్రతినిధి నిర్మలా సీతారాంగారికి ఈ మాటలు బొత్తిగా నచ్చలేదు. "మేమేం ముడిసరుకు కాదు. ములాయంగారి మాటలకి నేను అభ్యంతరం తెలుపుతున్నాను" అన్నారు.
ఇటీవల గుజరాత్ ఎన్నికల సబలో మణిశంకర్ అయ్యర్ మాట్లాడుతూ - "నరేంద్ర మోడీగారు తన నియోజిక వర్గం నుంచి ఎందుకు పోటీ చెయ్యడం లేదు? ఓడిపోతారని భయం. ఆయన లాహు పురుష్ (రక్తాన్ని పీల్చుకు తాగే జలగ లాంటివారు)" అన్నారు.
ఇక ప్రముఖ న్యాయవాది, బిజేపీ నాయకులు రాం జెత్మలానీగారు ఈ మధ్య శ్రీరాముడి గురించి మాట్లాడారు "నా ఉద్దేశంలో రాముడు చెడ్డ భర్త. ఎవరో జాలరివాడు నిందవేసినంత మాత్రాన పెళ్ళాన్ని వదిలేస్తాడా? ఆ మాటకి వస్తే లక్ష్మణుడు చెడ్డ తమ్ముడు. వదినని వెదికి తీసుకురా - అని అన్న అడిగితే వెళ్ళకుండా ఆగిపోతాడా?" అన్నారు.
ఇబ్బంది ఏమిటంటే తనపేరులోనే రాముడిని పెట్టుకున్న పెద్ద న్యాయవాదిగారు రామాయనం విషామ్య్లోనే పప్పులో కాలేశారు. రాముడి మీద నింద వేసింది జాలరి కాదు. చాకలి. ఇంక సీతని వెదకమని రాముడు లక్ష్మణుడిని పంపలేదు. రాముడికి సహాయంగా వెళ్ళమని సీత లక్ష్మణుడిని వేడుకుంది.
అనడానికీ, ఎదిరించి సమాధానం చెప్పడానికీ సరసత, స్వార్స్యం గల సహజమైన చమత్కారం - ఆనాటి బ్రిటన్ పార్లమెంటు సభ్యుల గురించి ఇక్కడగుర్తుచేసుకోవడంలో సరదా ఉంది.
ఆనాటి హౌస్ ఆఫ్ కామన్స్ లో చర్చిల్ ని చీల్చిచెండాడే ప్రతిపక్ష నాయకురాలు లేడీ ఆస్టర్. ఇద్దరూ ప్రసిద్దులు. సరసులు. ఒకరికొకరు తీసిపోనివారు.
ఓసారి లేడీ ఆస్టర్ చర్చిల్ తో అన్నారు: సార్, నాకు మీలాంటి భర్త ఉంటే విషం ఇచ్చేదాన్ని" అని. చర్చిల్ వెంటనే సమాధానం చెప్పారు. "అమ్మా, నాకు మీలాంటి భార్య ఉంటే వెంటనే విషాన్ని తాగేసేవాడిని" అని.
ఏతావాతా - ఇంతమంది నాయకులు ఇంత సరసంగా మాట్లాడగలిగే ఈ దేశంలో ఆసీం త్రివేదీ ఏం పాపం చేశారు?
కొందరు నవ్వుతారు. కొందరు నవ్విస్తారు. కొందరు నవ్వించబోయి నవ్వులపాలవుతారు. మన నాయకుల నిర్వాకం ఆఖరుది.
 


      gmrsivani@gmail.com  

 
                                                                           నవంబర్ 19, 2012

   ************               ************           *************          *************
Also meet Maruthi Rao Garu in his telugu blog gollapudimaruthirao.blogspot.com
Read all the columns from Gollapudi  గొల్లపూడి గారి మిగతా కాలంస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి


KOUMUDI HomePage